జయహో అక్కినేని నాటక కళా పరిషత్!

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 99వ జయంతి సందర్బం… “సాంస్కృతిక బంధు” శ్రీ సారిపల్లి కొండలరావు గారి సారధ్యం.. యువకళావాహిని ఆధ్వర్యం… డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ రవీంద్రభారతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి 28వ ఆహ్వాన నాటికల పోటీలు దిగ్విజయంగా జరిగాయి. ఈనెల 15, 16వ తేదీలలో జరిగిన ఈ పరిషత్ లో ఏడు అద్భుత నాటికలు పోటీ పడ్డాయి. ఒక దాన్ని మించి ఒకటి. మధ్య తరగతి జీవితాలను కళ్ళ ముందు ఆవిష్కరించారు దర్శక ప్రయోక్తలు. నిజంగా న్యాయ నిర్ణేతలకు ఎంపిక కత్తి మీద సాము. ఎందుకంటే ఆయా నాటికలు ప్రదర్శించిన బృందాలన్నీ అనుభవం లో మహామహులు. పైగా నాటికలన్ని వివిధ పరిషత్ లలో బహుమతులు కైవసం చేసుకున్నవే. అలాంటి అద్భుత నాటికలను ఎంపిక చేసి యువకళావాహిని బృందం గొప్ప ఛాలెంజ్ విసిరింది. ఆ ఛాలెంజ్ ను స్వీకరించిన జడ్జీలు కోట శంకరరావు, బి.యం.రెడ్డి, శ్రీ భాస్కర చంద్రలు ఇచ్చిన తీర్పు కు రవీంద్రభారతి కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. యువకళా వాహినికి ఈ పరిషత్ నిర్వహణ అద్భుత విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఆ సంస్థ వ్యవస్థాపకులు వై. కె. నాగేశ్వరరావు గారు లేకుండా నిర్వహించిన పరిషత్. లంక లక్ష్మీనారాయణ నాయకత్వంలో సారిపల్లి కొండలరావు, డాక్టర్ కె.వి. రమణాచారి లాంటి పెద్దల సూచనలతో అద్భుతంగా నిర్వహించారు.

శుక్రవారం నిర్వహించిన బహుమతీ ప్రదానోత్సవంలో ప్రముఖ నట దర్శక రచయిత తనికెళ్ళ భరణి దంపతులను అక్కినేని స్మారక పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సారిపల్లి కొండలరావు సభాధ్యక్షత వహించిన ఈ వేడుకలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి, ఈస్ట్ జోన్ డిసిపి శ్రీ ఎం.రమేష్, సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ, సినీ విజ్ఞాన విశారద ఎస్.వి.రామారావు, డాక్టర్ మహ్మద్ రఫీ, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ బి.హరీష్ లక్ష్మణ్, తెలుగు యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు, ప్రముఖ భరత నాట్య గురు శ్రీమతి నిర్మల ప్రభాకర్, రామరాజు శ్రీనివాసరావు పాల్గొని విజేతలను అభినందించారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి, వై. కె. నాగేశ్వరరావుగారికి శ్రద్ధాంజలి ఘటించారు.

Akkineni Nataka Parishath S. Kondalarao

పరిషత్ లో పోటీ పడిన నాటికలు:

  1. కళాంజలి హైదరాబాద్ వారి పాశం నాటిక, రచన గోవిందరాజుల నాగేశ్వరరావు, దర్శకులు కొల్లా రాధాకృష్ణ
  2. చైతన్య కళాభారతి, కరీంనగర్ వారు రమేష్ మంచాల దర్శకత్వంలో చీకటి పువ్వు ప్రదర్శించారు.
  3. మిత్ర క్రియేషన్స్, హైదరాబాద్ బృందం జనాబ్ ఎస్.ఎం. బాష దర్శకత్వ పర్యవేక్షణలో అందిన ఆకాశం నాటిక.
  4. రసఝరి పొన్నూరువారు వై. ఎస్. కృష్ణేశ్వరరావు దర్శకత్వంలో గుర్తు తెలియని శవం నాటిక.
  5. అరవింద ఆర్ట్స్, తాడేపల్లి కళాకారులు గంగోత్రి సాయి దర్శకత్వంలో మధుపర్కాలు.
  6. గంగోత్రి, పెద కాకాని వారు నాయుడు గోపి దర్శకత్వం లో ఆస్థికలు నాటిక.
  7. సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారు మంజునాధ్ దర్శకత్వంలో థింక్ నాటిక.

బహుమతులు వీరికే!
ఉత్తమ ప్రదర్శనగా థింక్ (హైదరాబాద్) నాటిక నిలిచి 15 వేల నగదు, శాశ్వత షీల్డ్ గెలుచుకుంది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చీకటి పువ్వు (కరీంనగర్) పదివేల నగదు, షీల్డ్ కైవసం చేసుకోగా, త్రుతీయ ప్రదర్శన గా గుర్తు తెలియని శవం (పొన్నూరు) గెలుచుకుంది. ఉత్తమ రచయిత శ్రీ పరమాత్ముని శివరాం (చీకటి పువ్వు), ఉత్తమ నటుడుగా శ్రీ వై.ఎస్. కృష్ణేశ్వరరావు (గుర్తు తెలియని శవం), ఉత్తమ నటి గా శ్రీమతి జ్యోతిరాజ్ భీశెట్టి, ఉత్తమ దర్శకుడిగా శ్రీ మంజునాథ్ (థింక్), ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా వి.సి.హెచ్.కె. ప్రసాద్ (ఆస్థికలు), ఉత్తమ విలన్ గా సతీష్ కుమార్ (థింక్), ఉత్తమ హాస్య నటుడుగా పి. రంగనాయకులు (మధు పర్కాలు) గెలుచుకున్నారు. ఉత్తమ రంగాలంకారణలో “పాశం” నాటిక నిలిచింది. అందిన ఆకాశం నాటిక ఉత్తమ సంగీతం (లీలా మోహన్), ఉత్తమ ఆహార్యం (పి.శివ) కైవసం చేసుకుంది. ప్రత్యేక జ్యూరి బహుమతులను గుర్తు తెలియని శవం లో నటించిన ఇ. భాగ్యరాజ్, ఆస్థికలు లో నటించిన జి. లహరి గెలుచుకున్నారు. బహుమతులు కొందరికి లభించినా ప్రదర్శనలు మాత్రం వేటికవే మేటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయా నాటికలను గొప్పగా మలచిన దర్శకులు అందరూ అభినందనీయులే.

  • డా. మహ్మద్ రఫీ
    ఫోటోలు: శ్రీ గిరి
SA: