అలిసెట్టి మినీ కవితలు అగ్ని కణాలు

ప్రముఖ కవి అలిసెట్టి ప్రభాకర్ రాసిన మినీ కవితలు అగ్ని కణాలని డా. రావి రంగారావు తెలియజేసారు. జనవరి 19 న ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో అమరావతి సాహితీమిత్రులు నిర్వహించిన సాహిత్య సభలో ఆయన “అలిసెట్టి కవిత్వం”గురించి ప్రసంగించారు. అలిసెట్టికి కవిత్వం, జీవితం ఒక్కటే అన్నారు. ధ్వంసమై పోతున్న సమస్త మానవ విలువలగురించి కలత చెందిన కవి అని, కుటిల రాజకీయాల్ని నిరసిస్తూ నిప్పు కణికెల్లాంటి కవితలు రాసా రన్నారు. తక్కువ పదాలతో, పాదాల పొందికతో జనంకోసం బలమైన కవిత్వం రాశారని తెలిపారు. చదువు రాని మనుషులు కూడా అర్థం చేసుకొనే కవిత్వం రాయటం చాలా కష్టం అని, అలిసెట్టి అలాంటి జన రంజక కవి అని వివరించారు. ప్రముఖ సాహితీవేత్త డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి “త్రిపురనేని రామస్వామి హేతువాద కవిత్వం”గురించి ప్రసంగించారు. సమాజంలో పేరుకుపోయిన మురికి నమ్మకాల్ని ఎండగట్టే కవిత్వం రాసారన్నారు. హేతువుద్వారానే మానవ జాతి వికాసం జరుగుతుందని భావించి రాసిన త్రిపురనేని సంఘ సంస్కరణ కవిత్వాన్ని విశ్లేషించారు. ప్రముఖ సాహితీవేత్త అన్నాప్రగడ వెంకట నరసింహారావు అధ్యక్షత వహించిన సభలో “ఈ మాసం కవి”గా డా. రావెళ్ళ శ్రీనివాసరావు (విజయవాడ) పాల్గొని సమకాలీన సమస్యలపై వివిధ కవితల్ని, కొన్ని బాల గేయాల్ని వినిపించి సభను రంజింపజేసారు. ఈ సభలో విశాఖపట్నం ప్రసన్న భారతి సాహిత్య సంస్థ పక్షాన సంస్థ ప్రతినిధి కె. సర్వేశ్వర ప్రసాద్ కలవకొలను సూర్యనారాయణకు పద్య కవితా పురస్కారం అందించారు. కలవకొలను కవిత్వ విశేషాల్ని ప్రముఖ సాహితీవేత్త డా. రామడుగు వేంకటేశ్వరశర్మ తెలియజేసారు. అమరావతి సాహితీమిత్రులు సంస్థ కన్వీనర్ పింగళి భాగ్యలక్ష్మి నిర్వహణలో జరిగిన కవి సమ్మేళనంలో పలువురు కవులు పాల్గొన్నారు.

SA: