ఆకాశవాణి సేవలో కొండలరావు

(ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా…)

శ్రవణేంద్రియం ద్వారా మానవాళికి మానసికానందంతో పాటు విజ్ఞానంతో కూడిన సమాచారాన్నిఅందించడంలో ఆకాశవాణి సంస్థ ద్వారా అశరీరవాణిగా పిలువబడే ఉత్తమ ప్రసార సాధనమైన రేడియో పాత్ర అద్వితీయం పరోపకారం కోసమే అన్నట్లుగా, రేడియో, రేడియోలో నిరంతరం ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలతో పాటు వ్యవసాయ, వాణిజ్య, పశు సంబంధిత విద్య, వైద్య సాంస్కృతిక రంగ, దేశభక్తి సంబంధిత క్రీడారంగ, రాజకీయ రంగం ఇలా ఒకటేమిటి వివిధ విభాగాలకు సంబంధించిన విశేషాలను పలురకాల కార్యక్రమాల ద్వారా సకల జనాళికి విజ్ఞాననిధిని అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది.

నాగరికత అంచెలంచెలుగా సాంకేతికతకుప్రాధాన్యతనిస్తూ, విస్తరిస్తున్న తరుణంలో కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా రేడియోని తరవాతి తరాలకు పరిచయం చేయడంలో మరియు ‌రేడియో ప్రసారాల్లో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న వార్తా విభాగాన్ని, అత్యంత ప్రతిభతో ముందుకు తీసుకెళుతున్న ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డా. జి. కొండలరావు సేవ అనిర్వచనీయం.

గుత్తికొండ సత్తిరాజు, వెంకట నాగరత్నంగార్ల కుమారుడైన డా. గుత్తికొండ కొండలరావు పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు. పాఠశాల స్థాయి నుండి వినయ విధేయతలు, క్రమశిక్షణతో పాటు కార్యాచరణే జీవిత గమ్యానికి సోపానంగా భావించి, ఆచరించి, మంచి ఉత్తీర్ణత సాధించడం అభినందనీయం. డా. జీ.కే. కలం పేరుతో సుపరిచితులైన కొండలరావు పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురంలోని శ్రీ వై.ఎన్. కాలేజీలో బి.ఏ. ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. బి.ఏ. చదువుతూ ఎన్.సి.సి. లో నేవీ విభాగంలో 7 వ ఆంధ్ర నావీ యూనిట్ లోసి సర్టిఫికెట్ సాధించారు ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ లో పీ.జీ. చేసి గోల్డ్ మెడల్ సాధించారు. సంస్కృతం, హిందీ, యోగ ఇలా పలు విభాగాల్లో, పలు భాషల్లో ప్రావీణ్యంతో పాటు పట్టాను పొందారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సును న్యూఢిల్లీలో చేసి, సౌత్ కొరియా, నేపాల్, భూటాన్ దేశాలను సందర్శించారు. బెంగళూరు దూరదర్శన్ కేంద్రంలో , ఇంటర్న్ షిప్ చేసి, ప్రస్తుతం ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో దాదాపు 25 సంవత్సరాలకు పైగా అనుభవంతో ప్రస్తుతం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతిగా పని చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దేశాన్నిఅతలాకుతలం చేస్తూ, జనజీవనం స్తంభించి అగమ్యగోచరమైప్పుడు, విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం నుంచి నిత్యం రోజుకు రెండుసార్లు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలతో పాటు ప్రత్యేకంగా కోవిడ్-19 పేరుతో 2020 మార్చి నుండి రోజుకి, మూడు సార్లు కోవిడ్ కి సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేయడం అభినందనీయం. మరీ ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి బారిన పడిన ప్రజలకు, గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ వారి సహకారంతో ఎందరో ప్రముఖ వైద్యుల సలహాలు సూచనలు మరియు ముఖ్యమైన కోవిడ్ సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లను శ్రోతలకు తెలియపరచడం, కోవిడ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా మారుమూల ప్రాంత శ్రోతలకు, అర్థమయ్యే రీతిలో కోవిడ్ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన జింగిల్స్ ను, ఉదాహరణకు ‘ముఖానికి మాస్కులు ధరించడం, రెండు గజాల సురక్షిత దూరంపాటించడం, ఎప్పటికప్పుడు ముఖం, చేతులు శుభ్రపరచుకోవడం, వంటి సందేశాలను స్వయంగా రూపొందించి కేవలం 10 నుండి 16 సెకండ్ల కాలవ్యవధిలో ఇప్పటికే 7,100 కంటే ఎక్కువసార్లు ప్రసారం చేయడం, ప్రపంచ చరిత్రలోనే బ్రాడ్ కాస్ట్ వ్యవస్థలో రికార్డు స్థాయికి చేరుకోవడం శ్లాఘనీయం. కరోనా సమయంలో విపత్తులనులెక్క చేయకుండా కొండలరావు చేసిన కృషికి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీవిశ్వభూషణ్ హరిచందన్ స్వయంగా అభినందనలతో లేఖ రాసి పంపించడం గర్హనీయం. కోవిడ్ సమయంలో ఎందరో మానసిక స్థైర్యాన్ని కోల్పోయినప్పుడు, ప్రముఖ మానసిక నిపుణుల సలహాలను సూచనలను 1000కి పైగా బైట్ లను ప్రసారం చేయడం అభినందనీయం.

కోవిడ్ అవగాహన ప్రత్యేక సమాచార ప్రసారాలతో పాటు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ‘ఆజాదీ కా అమృత మహోత్సవం’ పేరుతో జరుపుకుంటున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు స్వాతంత్ర సమరయోధుల మరియు దేశభక్తులకు సంబంధించిన వివరాలను వివరణతో ప్రసారం చేయడం విశేషమైతే ప్రతిగురువారం స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన ప్రశ్నలతో క్విజ్ కార్యక్రమాన్ని ప్రాంతీయ వార్తల్లో భాగంగా ప్రసారం చేసి , తద్వారా విజ్ఞాన నిధి అందిస్తున్నారని అనడంలో ఆశ్చర్యం లేదు. ప్రతి నెల ‘మన్ కీ బాత్ ‘ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శ్రోతలు తమ అభిప్రాయాలను పంచుకునే కార్యక్రమాన్ని ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయగా, తదుపరి ప్రాంతీయ వార్త విభాగం ద్వారా ఆ కార్యక్రమ వివరాలను శ్రోతలకు అందించడం ద్వారా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అత్యద్భుతం . ఈ విధంగా విజయవాడ ఆకాశవాణి కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డా. జీ. కొండలరావు ‘విశ్రాంతి ఎరుగని క్రాంతి‘ గా ఆకాశవాణిలో చేసినసేవలను గుర్తించి వారికి విశాఖపట్నం ఆకాశవాణి వార్త విభాగాధిపతిగా బాధ్యతను అప్పగించడం డాక్టర్ జీ.కే. అవిరళ కృషికి, కఠోరశ్రమ కి నిదర్శనం, అభినందనీయం, అనుసరణీయం. ఈ విధంగా ఆకాశవాణి సంస్థలో వార్తా విభాగాన్నిఅంచెలంచెలుగా ముందుకు నడిపిస్తూ, శ్రోతలను ఉత్తేజపరుస్తున్న డా. గుత్తికొండ కొండలరావుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ..
పంచాగ్నుల కృష్ణవేణి
విజయవాడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap