ప్రముఖ హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత, ఆలీతో సరదాగా కార్యక్రమం రూపకర్త అయిన ఆలీ జన్మదినం సందర్భంగా …
ఆలీ పుట్టింది 10 అక్టోబరు 1968 రాజమండ్రిలో… ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చారు.
ఆలీ … ఈపేరు వినగానే ముఖం ఆనందంతో విప్పారుతుంది. వింతైన మేనరిజమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు చిత్రసీమలో అలంకరించి తర్వాత కాలంలో హీరోగా మారిన ఆయన సినీప్రస్థానంలో యమలీల దో ప్రత్యేకత. తెలుగు సినిమా ” యమలీల “. చిత్రం ద్వారా మహేష్ బాబు ను హీరోగా పరిచయం చేయాలనుకున్నారు దర్శకుడు యస్.వి.కృష్ణారెడ్డి. ‘నంబర్ వన్’ చిత్ర షూటింగ్ సమయంలో సూపర్‌స్టార్ కృష్ణ గార్కి ఈకథను వినిపించి తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. కథ చాలాబాగుంది ఐతే మహేష్ సినిమాల్లోకి రావటానికి ఇంకా టైం ఉంది చదువు పూర్తయ్యాక చూద్దాం అన్నారట కృష్ణ గారు.
ఆయన అలా అనేసరికి మరో హీరో కోసం వెతకడం ప్రారంభించారు దర్శకుడు. ఒక ఈవెంట్లో ఆలీ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి అతనినే హీరోగా ఫిక్స్ అయ్యారు కృష్ణారెడ్డి. వరుస హ్యాట్రిక్ విజయాల తరువాత తీస్తున్న చిత్రంలో ఒక సాధారణ హాస్యనటుడు
‘ఆలీ’ ని హీరోగా తీసుకోవడంతో ఈవిషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న కృష్ణారెడ్డికి ఈచిత్రంతో విజయాలకు బ్రేక్ పడుతుందని చిత్రపరిశ్రమలో చాలామంది అనుకున్నారు. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన తొలి సోషియో ఫాంటసీ చిత్రం. ఈచిత్రంలో ప్రత్యేక పాటలో సూపర్‌స్టార్ కృష్ణ తన డాన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
హాస్యనటుడు హీరోగా నటించిన చిత్రంలో ఒక ప్రముఖ నటుడు ప్రత్యేక పాటకు నటించడం బహుశా సినీపరిశ్రమలో ఇదే తొలిసారి కావచ్చు. ఈచిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఒక సాధారణ హాస్యనటుడు హీరోగా నటించిన చిత్రం అసాధారణ విజయం సాధించడంతో కృష్ణారెడ్డి ప్రయోగం ఫలించిందని చిత్రపరిశ్రమలోని పెద్దలు మెచ్చుకున్నారు. మదర్ సెంటిమెంట్, ఆరోగ్యకరమైన కామెడీ, చక్కని సంగీతంతో కూడిన పాటలు ఈచిత్రాన్ని విజయతీరాలకు చేర్చాయి. ఈచిత్రం 9 కేంద్రాలలో 175రోజులు ప్రదర్శించబడింది. నిర్మాతలకు కాసులవర్షం కురిపించిందీ చిత్రం. ఈచిత్రాన్ని హిందీలో వెంకటేష్, రవీనాటాండన్ లతో ‘తక్దీర్ వాలా’ గా, తమిళంలో కార్తీక్, సంఘవి లతో ‘లక్కీమేన్’ గానూ పునర్నిర్మించారు. 2014లో ఈచిత్రానికి సీక్వెల్ ‘యమలీల 2’ తీశారు. ఈచిత్రం విజయం సాధించలేదు. కృష్ణారెడ్డికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతదర్శకుడు గా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి.
ఈచిత్రంలో పాటలన్నీ అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి అందులో సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు … ఎవర్గ్రీన్ సాంగ్.
మనీషా ఫిలిమ్స్ పతాకంపై వచ్చిన ఈచిత్రం ఆలీ కెరీర్ లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు సుమారు 1100 పైగా చిత్రాలలో నటించాడు. వెండితెరపైన, బుల్లి తెరపైన ఆల్ రౌండర్ గా రాణిస్తున్న ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.
ఆనందానికి వాకిలి ఆలీ … వందేళ్ళు వర్థిల్లాలని 64కళలు.కాం ఆకాంక్షిస్తుంది…