కాదేది కళకు అనర్హం అంటున్న తెనాలి కుర్రాడు

కాదేది కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు, ఈ పోటీ ప్రపంచంలో వస్తువుల తయారీలో కూడా వినూత్న అలోచనలతో వస్తేనే విజయం. అలాంటి ఒక కొత్త అలోచనలతో ప్రారంభించిందే ‘అల్లిక ‘ సంస్థ.
గుర్రపు డెక్క గురించి మీరు వినేవుంటారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా, రైతులకు నష్టం కల్గించే ఒకరకమైన కలుపుమొక్క. వీటిని తొలగించడానికి యేటా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంది ప్రభుత్వం. విదేశీ టెక్నాలజీ ఉపయోగించినా సమస్య తీరలేదు. చెరువు మీద చిక్కగా పచ్చగా పారుతూ, కొంతకాలం తర్వాత ఏకంగా చెరువునే మింగేస్తుంది. పర్యావరణం మీద ప్రభావం చూపించే అనేకానేక అంశాల్లో గుర్రపు డెక్క ఒకటి. పర్యావరణానికి హాని కిలిగించే గుర్రపుడెక్క కాడలతో అద్భుత కళాఖండాలు తయారు చేయిస్తూ, 70 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు అబ్దుల్ ముజీబ్. పనికిరాని గుర్రపు డెక్కను కుటీర పరిశ్రమకు ముడిసరుకుగా వాడి, నిరుపేద కుటుంబాల్లో ఆకలి లేకుండా చేశాడు. గుర్రపు డెక్కతో అద్భుతాలు చేయడమే కాదు.. మనిషి మనుగడకు అవసరమైన నీటి వనరులను కలుపు మొక్కల బారినుంచి తనవంతు ప్రయత్నంగా కాపాడుతున్నాడు. మొదటగా గుర్రపు డెక్కను స్థానికంగా ఉండే చెరువు నుంచి సేకరించి ఎండబెట్టాడు. ఒక్కో కాడను సన్నగా చీరి, మ్యాట్ తయారు చేశాడు. తొలుత చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అలా మొదలైంది అతడి ప్రయాణం. పరిశోధనలో భాగంగా ఒకసారి అస్సాంకి వెళ్లాడు. అక్కడ ఇలాంటి కలుపు మొక్కలతోనే అందమైన హాండిక్రాఫ్ట్స్ తయారు చేయడం గమనించాడు. అలా పదిరోజుల పాటు, అనేక ప్రాంతాలు తిరిగి ఈ హ్యాండ్ మేడ్ వస్తువుల గురించి పూర్తిగా నేర్చుకున్నాడు.

ఫేస్ బుక్ ద్వారానే: తిరిగి ఆంధ్రాకు వచ్చాక, గుర్రపు డెక్క తీవ్రంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో సర్వే చేశాడు. అలా 2014 అక్టోబర్ లో ‘అల్లిక’ అనే సంస్థను స్థాపించాడు. మొదటగా ఆరుగు మహిళలకు శిక్షణ ఇచ్చాడు. ఒక్కో ఐటెం పెంచుకుంటూ మార్కెట్ మీద పట్టు సంపాదించాడు. రెండున్నరేళ్లలో ఊహించని విధంగా ‘అల్లిక ‘ క్లిక్ అయింది. ప్రస్తుతం 70 మంది కళాకారులు తన సంస్థలో పని చేస్తున్నారు. హాండ్ బ్యాగులు, బుట్టలు, డైనింగ్ మ్యాట్స్, హోం డెకార్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, లాప్ టాప్ బ్యాగ్స్, కాన్ఫరెన్స్ బ్యాగులు, లాంప్ షేడ్స్ తదితర వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తారు. గుర్రపు డెక్కను సేకరించడానికి కొందరిని నియమించుకున్నాడు. దాదాపు 30 మంది దానికోసమే పనిచేస్తారు. వాళ్లంతా చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లో గుర్రపు డెక్కను కోసి తీసుకొస్తారు. తెనాలి, పెద్రవూరు, అంగల్ కుదురు, జగడగుంటపాలెంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని చెరువులు, కుంటల నుంచి వాటిని సేకరిస్తారు. దీనితో రైతులు కూడా ఆనందంగా వున్నారు. భారతదేశంలో హస్తకళా పరిశ్రమ ఇంకా కుటీర పరిశ్రమగానే వుంది. కొన్నేళ్లుగా లక్షలాది కుటుంబాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. ఏటా 20 శాతం ఆర్ధిక ప్రగతి సాధిస్తున్నదీ రంగంలో విప్లవాత్మక మార్పులు రావల్సిన అవసరం ఉందంటాడు అబ్దుల్ ముజీబ్. మార్కెటింగ్ అంతా ఫేస్ బుక్ ద్వారానే (https://www.facebook.com/AllikaWeave) చేసుకుంటాడు. ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ స్టాల్స్ పెడతాడు. అయితే, డిమాండ్ అనుకున్నంతగా లేదనేది ముజీబ్ అభిప్రాయం. దాన్నిబట్టి భవిష్యత్తులో కొత్త ప్రాడక్ట్స్ తయారు చేయాలని భావిస్తున్నాం అంటాడు.

ఫ్యూచర్ ప్లాన్స్: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన అబ్దుల్ ముజీబ్ ఆలోచనంతా పర్యావరణ పరిరక్షణ మీదనే. ఇకో ఫ్రెండ్లీ ప్రాడక్ట్స్ తయారుచేయడం మీదనే తన ఫోకసంతా. ఇప్పుడు గుర్రపుడెక్క కాడల నుంచే ప్రాడక్ట్స్ తీసుకొస్తున్నాడు. భవిష్యత్తులో దాని ఆకులు, వేర్లను ఎండబెట్టి సేంద్రియ ఎరువు తయారు చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఈ మొక్కల నుంచి వచ్చే నార ద్వారా శానిటరీ ప్యాడ్స్ తయారు చేయాలన్నది అల్లిక మరో ప్రాజెక్ట్. ఏపీ, తెలంగాణలో ఎక్కడైతే గుర్రపు డెక్క అందుబాటులో వుంటుందో అక్కడ టీంని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. తద్వారా మహిళలకు ఆర్ధికంగా చేయూతనివ్వడమే కాకుండా, గుర్రపు డెక్క బారినుంచి చెరువులను తనవంతు సాయంగా కాపాడాలని చూస్తున్నాడు. ఇలాంటి యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అవిష్కరణలు వెలుగు చూస్తాయనడంలో సందేహంలేదు.

ఎక్కడ దొరుకుతాయి: రూ.150 నుండి రూ.1500 వరకు ఉండే ఈ వస్తువులను కొనడానికి ముందుగా ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కున్నా కాని, ఇకో ఫ్రెండ్లి ఇంకా నాణ్యత, స్టైల్ నచ్చడంతో ఇప్పుడు బిజినెస్ చాలా బాగా పుంజుకుంది . హైదరాబాద్ లామాకాన్, ఆర్గానిక్ స్టోర్స్, శిల్పరామంలో ఈ వస్తువులు లభిస్తాయి. అల్లిక సంస్థ మొబైల్ పౌచ్, డైనింగ్ మాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ బ్యాగ్స్, హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ లాంటి వెన్నో తయారుచేస్తున్నారు. గుర్రపై డెక్క నారతో తయారు చేసిన ఈ వస్తువులు చాలా ధృడంగా ఉంటాయి 12కేజీల వరకు బరువు మోయగలిగే సామర్ధ్యంతో  పది నుంచి 15సంవత్సరాల వరకు మన్నికగా ఉండగలవు. అల్లిక సంస్థ  – ఫోన్‌: 09948703646

-కళాసాగర్

1 thought on “కాదేది కళకు అనర్హం అంటున్న తెనాలి కుర్రాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap