అతనొక మెరుపు.. అతనొక ప్రవాహం..

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా స్పెషల్ స్టోరీ…

2001 అక్టోబర్ 4 ఫస్ట్ షో టైమ్ కు వాన పడుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ ముందు సురేష్ కొండేటి ఎదురు చూస్తున్నారు. నాలాంటి ఫిలిం జర్నలిస్ట్ మిత్రుల కోసం అదే రోజు విడుదలయన మెగాస్టార్ చిరంజీవి గారి ‘డాడీ’ సినిమా ప్రెస్ షో ఏర్పాటు చేశారు. అందరమూ ఫ్యామిలీతో చూడటానికి వెళ్ళాం .
సినిమా స్టార్ట్ అయింది. ఎవరో కుర్రాడు డాన్స్ స్టూడెంట్ గా విరగదీశాడు. అతను అల్లు అరవింద్ గారి అబ్బాయి అని తెలిసింది. ఇంటర్వెల్ లో జర్నలిస్టులు అందరమూ ఆ కుర్రాడి గురించే మాట్లాడుకున్నాం. అరవింద్ గారి అబ్బాయిని ఇంత సింపుల్ గా పరిచయం చేశారేంటి? సరదాగా కనబడ్డాడా? సీరియస్ గానే హీరో అవుతాడా? అనే చర్చలు.. తుఫాన్ వచ్చేముందు ఆకాశంలో ఓ మెరుపు మెరుస్తుంది.. తన రాకని ప్రకటించుకుంటూ.. ‘డాడీ’ సినిమాలో అల్లు అర్జున్ మెరుపు పరిచయం అచ్చం ఇలాంటిదే. తన రాకని ఎనౌన్స్ చేశాడు. అంతేకాదు ఆ సినిమాలో మెగాస్టార్ స్టూడెంట్ గా నటించాడు బన్నీ. సినిమా రంగంలోనూ ఆయన స్టూడెంట్ గానే ఎదిగాడు.

2003 అప్పటికి కొంతమంది కుర్ర హీరోలు ప్రేమకథా చిత్రాలతో ఉర్రూతలూగిస్తున్నారు. అటువంటి సమయంలో ‘గంగోత్రి’ సినిమా వచ్చింది. కె.రాఘవేంద్రరావుగారి నూరవ చిత్రం. అల్లు అర్జున్ కి తొలి చిత్రం. కొంతమంది హీరో ఇలా ఉన్నాడేంటి? నిలబడతాడా అన్నారు. ఇంకొంతమంది. పాటలు బాగున్నాయి, కథ బాగుంది సినిమా హిట్ అన్నారు.
కానీ ఇండస్ట్రీ గుర్తించని ఓ రహస్యమాయాజాలం ప్రేక్షకుల్లో జరిగిపోయింది. అదేమిటంటే.. స్టూడెంట్స్ లవ్ స్టోరీల ట్రెండ్లో ఓ పల్లెటూరి ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. సగటు అబ్బాయిలు ‘గంగోత్రి’ హీరోలో తమని తాము చూసుకున్నారు. ఓన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ వాళ్ళ హీరో అయ్యాడు. ఇంకో తమాషా ఏమిటంటే.. ‘గంగోత్రి’ అనే టైటిల్ హీరోయిన్ ని ఉద్దేశించి పెట్టినా, అది అల్లు అర్జుగారి కెరీర్ గ్రాఫ్ కి అక్షరాలా సరిపోయింది. గంగ పుట్టుక ‘గంగోత్రి’లో చిన్నగా అన్పిస్తుంది. కాని గంగా ప్రవాహ వేగం లెక్కపెట్టడం ఎవరి తరం? అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ అలాగే పరిగెత్తింది. రెండొందల కోట్ల బాక్సాఫీస్ రికార్డ్స్ మీద జెండా ఎగరేసింది.
నాకున్న కొద్దిపాటి వ్యక్తిగత పరిచయంతో అల్లు అర్జున్‌ గురించి ఓ మాట చెబుతాను. ఎప్పుడూ ఆయన ఓ స్కూల్ పిల్లాడిలా ఆలోచిస్తారు, ఉత్సాహపడతారు తనని తాను మలుచుకుని, అద్భుతమైన మేకోవర్ చేసుకుంటారు. అంటే ఓ పాత్ర కోసం ఏం చేయాలి. తన శరీరాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి? తన భాషని, యాసని ఎలా మార్చుకోవాలి? ఏం చేసి ప్రేక్షకులని మెప్పించాలి? నిరంతరం ఇవే ఆలోచనల్లో ఉంటారు. క్యారెక్టర్ రక్తి కటించడానికి హార్డ్ వర్క్ కోచింగ్ తీసుకునే అతి తక్కువమంది హీరోల్లో అల్లు అర్జున్ ముందుంటారు. దానికి మొదటి అడుగే ‘ఆర్య’. గంగోత్రి-ఆర్యకి మధ్య అల్లు అర్జున్ ఎలా రూపాంతరం చెందారనేది ‘ఆర్య’ సక్సెస్ నిరూపించింది.

తెలుగునాటే కాదు కేరళలో కూడా అభిమానులని సంపాదించుకున్నారు. ఒకవైపు యూత్ ఫుల్ లవ్ స్టోరీలు (హ్యాపీ, పరుగు, ఆర్య2) మరోవైపు విభిన్నమైన ఎంటర్టైనింగ్ సినిమాలు (దేశముదురు, ఇద్దరమ్మాయిలతో, జులాయి) చేస్తూ మాస్ ఇమేజ్ కోసం (బన్నీ, బద్రీనాత్) ట్రై చేశారు. కానీ ‘రేసుగుర్రం’తో తనలోని మాస్ ఎంటర్టైనర్మెంట్, యాక్షన్ని పర్ ఫెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగారు.
‘సరైనోడు’తో తన దమ్మేంటో చెప్పారు. ఇక ‘అలవైకుంఠపురం’తో ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పారు. సినిమాల పేర్లు-వాటి కథలు, బాక్సా ఫీస్ రిజల్ట్స్.. ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆయన ఎంత కష్టపడతారనేదానికి కొన్ని ఉదాహరణలు మీతో పంచుకుంటున్నాను. కొన్నేళ్ళ క్రితం అల్లు అర్జున్  చేయి ఫ్రాక్చర్ అవుతుండేది. అలా కట్టు కట్టుకునే ‘దేశముదురు’ సినిమా ప్రారంభానికి ముందు పూరీజగన్నాథ్ గారి ఆఫీసుకు వచ్చారు. అలాగే ‘వరుడు’ సినిమాలో ఓ సాంగ్ లో చేతి కట్టుతోనే డాన్స్ చేశారు. ‘వేదం’లో కేబుల్ రాజు క్యారెక్టర్ కావచ్చు, ‘వరుడు’లో సంప్రదాయ వివాహానికి ప్రాధాన్యత ఇచ్చే సందీప్ పత్రే కావచ్చు.. ‘బద్రీనాథ్’లో క్షేత్రపాలకుడే కావచ్చు.. ‘రుద్రమదేవి’లో గోనగన్నారెడ్డి పాత్రే కావచ్చు.. ‘దువ్వాడ జగన్నాథం’లో బ్రాహ్మణుడి పాత్రే కావచ్చు.. ‘నా పేరు సూర్య’లోని సోల్జర్ క్యారెక్టర్ కావచ్చు. ప్రతి పాత్రకి ప్రాణం పెట్టి చేశారు. ఆయా పాత్రల సంభాషణలు, యాసలు. బాడీ లాంగ్వేజ్ తెరమీదికి తీసుకురావడానికి కబడని కసరత్తులు ఎన్నో చేశారు.
ఇప్పుడు సుకుమార్ గారి సినిమా (పుష్ప) కోసం చిత్తూరు యాస నేర్చుకుంటున్నారు. ఇది అల్లు అర్జున్ లోని తపన. సక్సెస్ ని మాత్రమే కౌగిలించుకునే ఈ సినిమా పరిశ్రమలో తన ఫ్లాపులని అల్లు అర్జున్ తక్కువ చూడరు, తక్కువ చేయరు. వక్కంతం వంశీగారి దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ బన్నీ అభిమానులని కొంత నిరాశపరిచిన మాట నిజం. సినిమా పరిశ్రమ స్వభావానికి వాళ్ళ పేర్లు వాళ్ళే తలవరు. కానీ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ సక్సెస్ మీట్లో వక్కంతం వంశీ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు, కృతజ్ఞతలు తెలిపారు. త్రివిక్రమ్ గారితో సినిమా చేస్తే బాగుంటుందని సూచించిన వక్కంతం వంశీగారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్.
అలాగే కొన్నేళ్ళ క్రితం ఏదో టీవీ టాక్ షోకి అల్లు అర్జున్ అతిథిగా వెళ్ళారు. ఆయన సినిమాల ఫోటోలన్నీ పెట్టి ‘వరుడు’ సినిమా ఫోటో మిస్ చేశారు. అల్లు అర్జున్ ఆ హె’ “ఏంటి వరుడు సినిమా ఫోటో పెట్టలేదే ఏం.. అది నా సినిమా కాదా’ అని అడిగారు. ఇప్పటికీ సినిమా సినిమాకి గ్యాప్ లో ఎంతమంది రచయితల కథలు అర్జున్ వింటారో తెలుసా? దానికోసం ప్రత్యేకించి స్క్రిప్ట్ టీమ్ పెట్టారు. రచయితలని, డాన్స్ మాస్టర్లని.. ఇలా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరినీ ఇతను ఎంకరేజ్ చేయడమేకాడు.. పక్కవాళ్ళకి రికమెండ్ చేస్తుంటారు.
రచయితలకు అల్లు అర్జున్ ఇచ్చే గౌరవం గురించి ఇతర ప్రముఖ హీరోలు కూడా ప్రస్తావించడం నా వ్యక్తిగత అనుభవం. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ, మేకోవర్, స్టైల్, స్టెప్స్, ఫైట్స్, రికార్డ్స్ ప్రేక్షకులందరికీ తెలిసినవే. కానీ ఎంత కఠోర శ్రమ చేస్తాడనేది అల్లు అర్జున్ కి, ఆ సినిమా టెక్నీషియన్స్క మాత్రమే తెలుసు.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మదినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దక్షిణాదికే తెలిసిన అల్లు అర్జున్‌గా విజయప్రభంజనం రానున్న కాలంలో మన దేశం మొత్తానికీ,ఈ ప్రపంచానికి కూడా తెలియాలని కోరుకుంటున్నాను.

– తోట ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap