విశాఖ మ్యూజియంకి ‘అల్లూరి చిత్రాలు’ బహుకరణ

అల్లూరి జయంతి ముగింపు సభలో మాదేటి రవిప్రకాష్ వెల్లడి

అల్లూరి సీతారామరాజు ఉద్యమ జీవన రేఖలతో 18 మంది చిత్రకారులు గీసిన అద్భుత చిత్రాలను విశాఖలోని విశాఖ మ్యూజియమ్ కు బహుకరించేందుకు సిద్ధంగా ఉన్నామని మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ వ్యవస్ధాపక‌ కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ వెల్లడించారు.
‘శౌర్య ప్రతీక – పోరు పతాక ‘ శీర్షికతో కూడిన 26 భారీ కాన్వాస్ చిత్రాలను తాము రక్షిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నేపధ్యంలో, జూలై 2 నుండి మూడు రోజులుగా రాజమహేంద్రవరం దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో నిర్వహిస్తున్న అల్లూరి చిత్రాల ప్రదర్శన ఆదివారం ముగియనుంది. సిపి బ్రౌను మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో రవిప్రకాష్ మాట్లాడుతూ, చిత్రకారులు ఎంతో శ్రమకోర్చి గీసిన అల్లూరి చిత్రాలను భద్రపరచవలసి ఉందన్నారు.

దామెర్ల కాంప్లెక్స్ నిర్మించాలి : సన్నిధానం శాస్త్రి విన్నపం

అల్లూరి సీతారామరాజు విద్యాభ్యాసం చేసిన బంగారయ్య పాఠశాల రాజమండ్రిలో ఉందని, నగరంతో అల్లూరికి ఎనలేని అనుబంధం ఉండేదని అధ్యక్షత వహించిన‌ సి.పి. బ్రౌను‌ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి వెల్లడించారు. శిధిలమైన దామెర్ల ఆర్ట్ గ్యాలరీని‌ కూలగొట్టే అంశం ఇప్పటికే నగర కార్పొరేషన్ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ ఆధీనంలో, అర ఎకరం పైగా ఉన్న స్ధలంలోని‌ దామెర్ల ఆర్ట్ గ్యాలరీని‌ కూలగొట్డి, పది అంతస్ధుల దామెర్ల‌ కాంప్లెక్స్ నిర్మించాలని ఆయన సూచించారు.‌ మొదటి అంతస్ధును ఆర్ట్ గ్యాలరీకి‌ కేటాయించి, మిగిలిన అంతస్ధులలో‌ ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో‌ అద్దెకు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని‌ సన్నిధానం శాస్త్రి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శ్రీ టిఎస్. రవికాంత్, సిహెచ్ భాస్కర రమణ, బళ్ళా శ్రీనివాస్, (మయూరి శ్రీనివాస్), సి.ఎస్.నాగార్జున, వై.కృష్ణ కుమార్, ఆర్ట్ గ్యాలరీ కేర్ టేకర్ గంగరాజు, బ్యాంక్ మేనేజర్ కాళహస్తి గురుదేవ్, గ్యాలరీ సిబ్బంది, ప్రసాద్, సత్యనారాయణ, అంబటి కృష్ణ శర్మ, పలువురు విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

SA:

View Comments (1)

  • మంచి అవకాశం చిత్రకారులకు
    మ్యూజియం నిర్వహకులకు
    మంచి ఆలోచన అందరిలోను
    సామాజిక స్పృహ బాగుంది.