భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన వీరాధివీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగువారి శౌర్యానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు.
అయితే.. ఆయన గొప్ప వీరుడు మాత్రమే కాదు..గొప్ప నటుడు కూడా.స్త్రీ పురుష పాత్రల్ని ఎంతో సమర్ధవంతంగా పోషించిన నటుడు.గత రెండు నెలలుగా నేను శ్రీ రామరాజు జీవితంపై ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసే పనిలో… చాలా కృషి చేసినప్పుడు..ఏ గొప్ప విషయాన్ని గమనించి..చాలా ఆనందించాను. నిజానికి అది మన నాటక కళాకారులకి.. ఆమాట కొస్తే తెలుగు నాటక రంగానికే గర్వకారణం.
శ్రీ రామరాజు కాకినాడలో పిఠాపురం రాజా వారి ఉన్నత పాఠశాల లో చదివేటప్పుడు.. జార్జి చక్రవర్తి పట్టాభిషేక దినోత్సవం జరిగింది.
అప్పుడు శశిరేఖా పరిణయం నాటకాన్ని ప్రదర్శించారు. అందులో శశిరేఖ పాత్రకు ఒక అందమైన యువకుడ్ని చూసారు. ముట్టుకొంటే మాసిపోయినట్టున్న రామరాజును ఆ పాత్రకు ఎంచుకున్నారు.
రామరాజు శశిరేఖ పాత్రలో జీవించారు.ఆయన నిజంగా శశిరేఖ దిగివచ్చిందా అన్నట్టే కనిపించారుట. ఆయన అభినయం చాలా గొప్పగా ఉందట. పైగా ఆయన పాడిన పాటలు,పద్యాలు విని పేక్షకులు పరవశించి పోయారు.అదే నాటకంలో చివరిలో శ్రీ రామరాజు నారదుడిగా కూడా నటించారుట. ఈ నాటకం కాకినాడలో 12-12-1912 వతేదీన ప్రదర్శించబడింది. రాజు అభినయానికి మెచ్చుకొని ఒక మెడల్ బహుకరించారు.
ఈ సంగతులన్ని రాజు గారి సహాధ్యాయి అయిన .. మరొక గొప్ప దేశభక్తుడు కీర్తిశేషులు మద్దూరి అన్నపూర్ణయ్య గారు.. కాంగ్రెస్ పత్రికలో 19-6-1928న వ్రాసారు. ఆనాటి అల్లూరి సీతారామరాజు ఫోటో చూడండి. ఎంత అందంగా ఉన్నారో..
–వాడ్రేవు సుందర్రావు (9396473287)