కళాయాత్రికుడు ఏల్పుల పోచం కు ‘విజయవాడ ఆర్ట్ సొసైటీ’ 20 వేల ఆర్థిక సాయం
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కళాయాత్ర చేస్తున్న తెలుగు చిత్రకారుడు ఏల్పుల పోచం, ఈ రోజు (30-11-2022) విజయవాడ ఆర్ట్ సొసైటీ చిత్రకారులతో కలసి తన అనుభవాలను పంచుకున్నారు. ఇప్పటి వరకూ 25 రాష్ట్రాలు, 1380 రోజులు పాటు యాత్ర చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ 34 ఏళ్ళ యువకుడు కళాయాత్రలో భారతదేశ సంస్కృతి, ఆచారాలు, ప్రజల జీవన విధానాన్ని Live Drawings చేస్తున్నాడు.
బతకడానికి, జీవించడానికి తేడా చూపే వ్యక్తులు చాలా అరుదు. అలాంటి గొప్ప వ్యక్తి పోచం ఏల్పుల. తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుందంటారు. సంచారమే అసలైన సంపద అంటూ అందరిలో స్పూర్తిని నింపుతున్నాడు ఈ తెలంగాణ యువకుడు. పొట్టిశ్రీరాములు విశ్వ విద్యాలయం నుండి బిఎఫ్.ఏ., చత్తీస్ గర్ ఇందిరా కళా సంగీత్ యూనివర్సిటి నుండి ఎం.ఎఫ్.ఏ. పట్టా పొందిన పోచం తానొక పోస్ట్ గ్రాడ్యుయేట్ ని అన్న అహాన్ని విడిచి, మరొకరి ఇంటి ముందు దోచిలి చాచి అన్నం అడగడం కంటే నిరహంకారత్వం ఎక్కడుంటుంది! ఒక చిత్రకారుడిగా, నిత్య విద్యార్థిగా అన్నీ విడిచి దేశాటన చేయడం… కళాయాత్ర ను ఒక వ్యసనంగా మార్చుకోవడం అతనికే చెల్లింది. నిరుపేద కుటుంబం లో పుట్టినా పోచంగారి ఆశయం ఉన్నత మైనది కాబట్టి తన కళాయాత్రకు మిత్రులు, గురువులు, కళాభిమానుల ప్రోత్సాహంతో అనేక రాష్ట్రాలు పర్యటించి లక్షలాది మంది ప్రజలతో మమేకమై, వేలాది బొమ్మలు గీశారు. కళాయాత్రలో తను గీసిన చిత్రాలను కూడా ప్రదర్శించారు ఈ సభలో.
ఈ సభలో పోచం తన అనుభవాలను పంచుకుంటూ… ఈ కళాయాత్రలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోన్నానని, కొన్ని సార్లు పస్తులు కూడా వున్నానని, అయినా ఇదంతా సంతోషం తోనే చేస్తున్నానన్నారు. నా లక్ష్యం ముందు ఇవ్వన్ని చాలా చిన్నవన్నారు. తనకొచ్చిన హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషలతో ముందుకు వెలుతున్నానన్నారు. తనను ఇంతగా అభిమానంతో సత్కరించి, సహాయాన్ని అందించిన ‘విజయవాడ ఆర్ట్ సొసైటీ’ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
25 రాష్ట్రాల యాత్ర ముగించుకొని ఒరిస్సా నుండి విజయవాడకు వచ్చిన ఏల్పుల పోచం గారిని ‘విజయవాడ ఆర్ట్ సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించి, 20 వేల రూ.లు. ఆర్థిక సాయం అందించారు.
ఇతని కళాయాత్ర మరో 5 దక్షిణాది రాష్ట్రాలలో కొనసాగాల్సివుంది. అది కూడా విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ..
-కళాసాగర్
చాలా మంచి కార్యక్రమం… చిత్రకారులుగా… సమాజ బాధ్యతలో పాలుపంచుకుంటు… తోటి చిత్రకారునికి ఇలా అభినందనలు…తెలుపుతూ… ఆర్థికంగా సహాయం చేయడం… అభినందనీయం…. విజయవాడ ఆర్ట్ సొసైటీ మిత్రులు అందరికి…. 🤝🙏🙏🙏🙏🙏🙏💐
చాలా బాగా రాశారు..
సాగర్ గారు
బాగా రాశారు
Very nice 👍