
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది నాడు వివిధ రంగాలలో విశేష కృషిచేసిన కళాకారులకు ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి కళాకారులను సత్కరించడం జరిగింది. వెనువెంటనే దేశవ్యాప్తంగా చిత్రకారులు, శిల్పకళాకారుల సృజనాత్మకతను పరిచయం చేసే వేదికగా ‘అమరావతి చిత్రకళా వీధి’ పేరిట ఉత్సవాన్ని ఏప్రియల్ 4వ తేదీన రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించింది.
ఈ చిత్రకళా వీధిలో సుమారు 400 మందికి పైగా కళాకారులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి అనేక విభాగాల్లో పాల్గొని కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. చిత్రకళలో పెన్సిల్ ఆర్ట్ మొదలుకుని, ఆయిల్-యాక్రిలిక్ మీడియంలలో చిత్రాలు ప్రదర్షించి, ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. శిల్పకళలో ప్రముఖ కళాకారులు వారు తయారుచేసిన శిల్పాలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 400 స్టాల్స్ పెట్టుకోడానికి ప్రభుత్వం రాజమహేంద్రవరంలో సెంట్రల్ జైలు నుండి మొదలుకుని అటవీశాఖ కార్యాలయం వరకు రోడ్డుకు యిరువైపుల ఏర్పాటు చేసింది. కళాకారులకు ఆహార, వసతి సౌకర్యాలతో పాటు మంచినీటి సౌకర్యాన్ని అందించడం జరిగింది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సిబ్బంది ఖైదీలతో నిర్వహించిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ కళ అయిన కళంకారీ కళకు సంబంధించిన స్టాల్ ఈ ప్రదర్శనలో లేకపోవడం గమనార్హం. చిత్రకళా వీధిలో స్టాల్స్ నిర్వహించడానికి కార్పొరేట్ స్కూల్స్ తో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆసక్తిని కనబరిచాయి. చిత్రకళలో బుడి బుడి అడుగులు వేస్తున్న బాల, యువ చిత్రకారులతో పాటు ఉద్దండులైన కళాకారుల చిత్రాలు కొలువుదీరాయి.
ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ చిత్రకళా వీధి ప్రదర్శన సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. వేసవి ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో ప్రేక్షకులకు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రానికి అది జాతరగా మారింది.. ప్రేక్షకులను మరింత రంజింప చేయడానికి కళా వేదికలు ఏర్పాటు చేసి విద్యార్థులచే సంప్రదాయ నృత్యాలు నిర్వహించారు. గిరిజన నృత్యాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తమ కార్యాలయాలలో అమరావతి చిత్రకళా వీధి ఉత్సవానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి ఈ వేడుకను ఆరంభించారు. రాజమహేంద్రవరంలో కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని నిర్వహకులు ప్రకటించనప్పటికీ… శాసన సభ డిప్య్తూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వేడుకలను ప్రారంభించగ, రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి కందుల దుర్గేష్ లతో పాటు రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు చిత్రకళా ఉత్సవంలో పాల్గొని కళాకారులను అభినందించారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుంచె పట్టి సంతకం పెట్టిన పెయింటింగును లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రామకృష్ణ సంపాదకత్వంలో, మాదేటి రవిప్రకాష్ ప్రచురించిన రాజమండ్రికి చెందిన వరదా వెంకట రత్నం జీవిత చరిత్ర ‘ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడు‘ పుస్తకాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు.
చిత్రకళా ఉత్సవంలో పాల్గొన్న ప్రతి కళాకారునికి సాంస్కృతిక శాఖామంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సంస్థ ముఖ్య అధికారి తేజస్వీ చేతుల మీదుగా శాలువ కప్పి సర్టిఫికెట్ ప్రధానం చేశారు.

కళాకారులు తమ కళాకృతలను ప్రదర్శించడమే కాకుండా, అభిరుచి కలిగిన కళాప్రేమికులుకు అమ్మకాలు కూడా చేసుకున్నారు. ఇకనుండి అమరావతి చిత్రకళా వీధిని ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా మొదటి కళాఉత్సవంలో స్టాల్స్ నిర్వహణ కోసం కళాకారుల నుండి వసూలు చేసిన మొత్తాన్ని రాజమహేంద్రవరంలో ప్రముఖ చిత్రకారుడైన శ్రీ దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీ అభివృద్ధి నిమిత్తం వినియోగించనున్నారు.
చిత్రకళా ఆకృతులలో లీఫ్ ఆర్ట్, ఆక్రినల్ పెయింటింగ్స్, థ్రెడ్ ఆర్ట్, మిల్లెట్ ఆర్ట్స్ పలువురిని ఆకర్షించాయి. కోనసీమ ప్రత్యేక చెక్కబొమ్మలు, అనంతపురం తోలుబొమ్మలు ప్రేక్షకులను రంజింప చేశాయి. ఈ ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారుడు, 64 కళలు డాట్ కాం ఎడిటర్ కళాసాగర్ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్లోని వివిధ కళారంగాలలో ప్రావీణ్యత కలిగిన కళాకారుల ప్రతిభను తెలియజేస్తూ.. ప్రచురించిన ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‘ పుస్తకాన్ని తిలకించి ప్రశంసించడం విశేషం!.
వ్యాసకర్త: ఎన్.బి.యస్. శ్రీనివాస్ పోలిశెట్టి (7207736077)





🤝🤝🤝🤝❤️