అమరావతి ఆర్ట్ – బౌద్ధ శిల్పాల సచిత్ర పరిచయం

ధరణికోట- నాగార్జునకొండ శిల్ప సంపదలపై ప్రముఖ జర్నలిస్ట్, రచయిత పున్నా కృష్ణమూర్తి సచిత్ర వ్యాస సంకలనం ‘అమరావతి ఆర్ట్’లోని పుస్తక సమీక్ష.

దక్షిణ భారతదేశంలో ‘పోతాల’ పర్వతం ఉందని, గౌతమ బుద్ధుడు నిర్వాణం పొందిన తర్వాత ఆ పర్వతంపై ‘అవలోకితేశ్వరుడు’గా ఉన్నాడని బౌద్ధ సాహిత్యం చెబుతుంది. ఆ పర్వతం ఇప్పటికీ ఊహల్లోనే ఉంది. అలాగే ధాన్యకటకం. టిబెట్, చైనా, జపాన్ బౌద్ధ సాహిత్యంలో ధాన్యకటకం ప్రస్తావన ఉంది. ఒకనాడు అదెక్కడో ఎవరికీ తెలీదు.

ఇప్పటి పల్నాడు జిల్లా అమరావతి పట్టణ శివారు ప్రాంతంలో మట్టిదిబ్బను కల్నల్ మెకంజి సీఇ 1798 లో ప్రాథమిక సర్వే చేసిన ప్పుడూ ధాన్యకటకం తెలియదు. శతాబ్దాలుగా దాన్యకటకం (దాన్యకొట్టం, దాన్యకట్ట) ధరణి కోటగా వ్యవహరించబడిన ఈ ప్రాంతం అసలు పేరు మరచిపోయింది. ఇక్కడి మట్టి దిబ్బను అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలను చూసి అవి జైన శిల్పాలు అనుకున్నాడు మెకంజీ. తన డాక్యుమెంట్లలో జైనశిల్పాలు కావచ్చనే రాసుకున్నాడు.

రెండవ పర్యాయం సర్వేయర్ జనరల్ అఫ్ ఇండియాగా పదోన్నతిపై మెకంజీ ఇండియా వచ్చాడు. హెన్రీ మిల్టన్, మార్కెలస్ బ్రూక్ తదితరులతో కూడిన డ్రాఫ్ట్స్ మెన్ బృందాన్ని వెంట తెచ్చాడు. ఇంగ్లండ్ నుంచి సీఇ 1816లో ఇక్కడకు వచ్చిన యువకళాకారులు, దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు ఇక్కడ మకాం వేశారు. శిల్పాల నకళ్లను చిత్రించారు. ఈ మట్టిదిబ్బ పేరు దీపాలదిన్నె, బౌద్ధస్థూపానికి అచ్చమైన తెలుగుపేరు.
జీవితం బుడగ అని సూచిస్తాయి అర్థగోళా కృతిలోని బౌద్ధస్థూపాలు, జీవితం క్షణికమే అయినా భూమ్యాకాశాల సౌందర్యాన్ని ప్రతి ఫలించాలి అంటుంది బౌద్ధ తత్వం. అందుకు. అనుగుణంగానే వాటిని నిర్మించారు.
అమరావతి స్తూపం 90 అడుగుల ఎత్తయిన చలువరాతి గోళార్హం.

పైన సూర్యచంద్రుల కాంతిని ఇనుమడించే రాతి ఛత్రం, చుట్టూ మాణిక్యాలు. పంచ ఆయక స్థంబాలు. పంచశీలను పరిరక్షిస్తూ నాలుగువైపులా సింహరాజాలు, బుద్ధుని జీవిత ఘట్టాలు 14 అడుగుల ఎత్తులో స్తూపం చుట్టూ శిలా లతా తోరణాలు ధాన్యకటకంకు తలమానికమైన ఈ దీపాల దీన్నె అసంఖ్యాక బౌద్ధ సూత్రాల ధారణలతో ధరణికే కోటగా విలసిల్లింది.

కంటకం కదను గాంధార, మగధ శిల్ప రీతుల్లో వివిధ బౌద్ధ స్థూపాలలో శిల్పాలుగా మలచారు. కానీ, సిద్ధార్జుని ఎడబాటుకు చెమర్చిన కంటకం అశ్వహృదయం అమరావతి ఆర్ట్లో మాత్రమే ఆవిష్కృతమైంది. అమరావతి ఆర్ట్ దక్కన్ పీఠభూమిలో ధరణికోట-నాగార్జున కొండ-అజంతా క్షేత్రాల శిల్ప, చిత్ర విశేషాలే. మెకంజీ బృందం చిత్రించిన అమరావతి శిల్పపు డ్రాయింగ్లో కంటకం, రాకుమారునికి ఛత్రాన్ని పట్టిన చెన్నుడు కనిపి స్తాడు. స్వాగతిస్తున్న దేవతలూ కనిపిస్తారు.

అమరావతి శిల్పంలో ఒక చక్రవర్తి ఉన్నారు. ఆయన శిఖలో మణి ఉన్నందున శిఖామణి అంటారు. రెండు చేతులు జోడించి ఉన్నారు. తేజస్సు ఉట్టిపడుతోంది. సిగలో మణి ప్రస్ఫు టంగా కనిపిస్తుంది. కుడివైపున చత్రం పట్టుకుని నాగవంశీయ రాజు, ఆయన అంతే వాసి, ఎడమవైపు చామరం పట్టుకున్న స్త్రీ. మరొక సేవిక,
బుద్ధుని పాదముద్రికలు ఎలా ఉంటాయి? పాదం మధ్యలో ధర్మచక్ర, వైదిక మతానికి ప్రాకృతిక మతానికి మధ్యేమార్గంగా సార నాద్లో ఆయన ప్రవచించిన మధ్యేమార్గానికి ప్రతీక ధర్మచక్రం. మడమ ప్రాంతంలో మూడు స్వస్తిక్ గుర్తులుంటాయి. అవి త్రిరత్నాలకు సంకేతం. సంఘానికి ‘స్వస్తి’ కలిగిస్తుంది అని బుద్ధడు చేసిన బోధనలే త్రిరత్నాలు.

మన్మథుడు లేకపోతే మాయాదేవి సుతుడు ఎక్కడున్నాడు? మన్మథుని జయించకపోతే సిద్దార్థుడు బుద్ధుడు ఎలా అవుతాడు? కారుణ్య మూర్తి బుద్ధుని బోధనలకు దారి చూపేందుకు మరుని శరములను మించిన సూచికలు ఏముంటాయి? అమరావతి శిల్పులు మిధున శిల్పాల ద్వారా తమ లక్ష్యాన్ని మనోహరంగా సాధించారు. దీపాలదిన్నె చుట్టూ బుద్దుని జీవిత ఘట్టాలను, జాతక కథలను చెప్పే దీర్ఘ చతురస్రాకారపు ఫలకాలు ఎన్నో ఉండేవి. ఆ ఒరిజినల్స్లో కొన్ని మెడ్రాస్ మ్యూజియంలో, కొన్ని కోల్కతాలో, ముఖ్యమైనవి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. అమరావతి ఆర్ట్లోని వివిధ పరిణామాలన్నీ దీపాలదిన్నెలో కొలువైనాయి.

నల్లగొండ జిల్లావైపున గల నందికొండకు గుంటూరు జిల్లాలోని అనుపు ప్రాంతానికి మధ్యగల ప్రాంతంలో కృష్ణానది, ఉత్తరం వైపు నకు ప్రవహిస్తుంది. కృష్ణానదీ తీర గ్రామాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్లు కేవలం రాళ్లు కావని అవి అమూల్యమైన మానవజాతి పురావస్తు సంపద అని ఖురేషీ గుర్తించాడు. ఈ అవగాహనకు ప్రాతిపదికలు అమరావతి (ధాన్యకటకం)లో మెకంజీ ద్వారా వెలుగులోకి వచ్చిన శిల్పాలు.

అమరావతి ఆర్ట్
ధరణికోట- నాగార్జున కొండ శిల్పసంపదల సచిత్ర వ్యాస సంకలనం
రచయిత : పున్నా కృష్ణమూర్తి
వెల: రూ.1500, పేజీలు: 125
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలు, 76809 50863

Share via
Copy link
Powered by Social Snap