‘అమరావతి’కి అక్షర నీరాజనం

ఆచార్య నందిపాటి సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన “అమరావతి కవితా సంపుటి” రాజధాని యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఆకాశమంత పందిరి వేసి ఈ భూదేవంత అక్షరనీరాజనాలు అర్పిస్తూ అమరావతి మీద ఈ ప్రపంచమంత అభిమాన ధనాన్ని కురిపిస్తూ సాహితీ పూతోటలో అందంగా విరబూయించారు. ఇందులోని కవితలన్నీ కూడా మానవతావిలువలకు అద్దం పడుతూ ఇంకా అమరావతి మీద అభిమాన ధనాన్ని కురిపించారు. అలాగే ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన అమరావతి యొక్క పూర్వ వైభవాన్ని ఎలుగెత్తి చాటారు తన కవితల ద్వారా రచయిత. ఇంకా ఈ కవితా సంపుటి గోదావరి నదిమ తల్లి యొక్క గొప్పతనం, సర్వమత సమ్మేళనాన్ని వెలుగెత్తి చాటే కవితలు, అబ్దుల్ కలాంని ఎలుగెత్తి చాటుతూ, భారతావని ఆర్తనాదాలు, స్వచ్ఛమైన మనసు గురించి, నిరాశవాది యొక్క వెతలు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేనివన్నీ కూడా చిరునామాలేని ఉత్తరాలు అంటూ చెప్పే కవితలు, పల్లె వదిలి పట్టణానికి వెళ్లి డాంబికాలు పోయిన వైనం, ఇంకా దేశంలోని విధ్వంసాలను ఆపేదెవరు అంటూ ఆర్తిగా, ఆవేదనా భరితంగా సాగిపోయే కవితలన్నీ కూడా చదువరులను ఎంతో గొప్పగా ఆకట్టుకున్నాయి. ఇందులోని కవితలన్నీ కూడా సుదీర్ఘంగా కాకుండా తక్కువ నడివితో ఉండి ఆకాశమంత సందేశాన్ని అందిస్తూ ఎంతో ఆశక్తిదాయకంగా సాగిపోయాయి.

ఆచార్య నందిపాటి సుబ్బారావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూవిజ్ఞానశాస్త్ర విభాగాధిపతిగా ఇటీవల పదవీవిరమణ చేశారు. వీరు విద్యార్థుల్ని దేశం గర్వించదగ్గ గొప్ప పౌరులుగా తీర్చిదిద్దారు. జలవనరుల పరిరక్షణ పై విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే అమరావతిని మాతృభూమిగా అభిమానిస్తూ అక్షర నీరాజనాలర్పించారు.

ఇక కవితల్లోకి వెడదాం – మొదటి కవిత “అక్షరమాల” అంటూ “అ నుంచి ఱ” వరకు ఉన్న అక్షరాల ఘనతని తెలియజేశారు. “ఆ నుంచి ఐ” వరకు తొలకరి మేఘనాధుడిలా ఉంటాయని, ఇంకా క,ఖ, గ,… లకు మంగళ హారతులు పట్టారు. తేనెలా చ, ఛ… లు, పూల మకరందంలా ట, ఠా…లు, ఉంటాయని ఎంతో తీయగా చెప్పారు నందిపాటివారు. మెరుపుని కదిలిస్తే ఎలా ఉంటుందో “శ నుంచి ఱ” అక్షరాలు ఉంటాయని ఓ మెరుపు మెరిపించారు అక్షరం మాలపై. అక్షరమాలని అమ్మతో పోల్చి కమనీయం, రమణీయం తెలుగు భాష అంటూ కీర్తించారు. “అమరావతి వైభవం” కవితలో ఆనాటి ధరణికోట ఈనాటి తెలుగు ప్రజల ఘన కీర్తి అంటూనే సర్వమత సమ్మేళనాలకు నెలవు అన్నారు. కృష్ణమ్మ ప్రవాహంతో విశ్వవిఖ్యాతి నొందుతూ ముందు ముందు తెలుగు తల్లి మెడలో మణిహారంలా మెరిసిపోతుందని చాటి చెప్పారు రచయిత.

అలాగే “పులకిస్తున్న అమరావతి” కవితలో ఆంధ్రుల మహా స్వప్నం సాకారం కాబోతున్న వైనాన్ని చాలా చక్కగా చెప్పారు. పుణ్య జలాలతో మట్టితో పులకిస్తూ జ్యోతి ప్రజ్వలనతో అంగరంగ వైభవంగా ఆంధ్రుల ఘనకీర్తి చాటే రోజు అతి చెరువులో ఉందని ధీమా వ్యక్తం చేశారు. “రసధుని రాజధాని” అంటూ అమరేశ్వరుని చెంతనున్న రాజధాని రాకను అద్భుతంగా కీర్తించారు. సోభాయమానంగా అలంకరించుకొని ఊరు వాడతో సమాయత్తమై చిరునవ్వుల దరహాసాలు చిందిస్తూ రస రమ్యంగా వచ్చిందని అంత గొప్ప రాజధానిలో తెలుగింటి తీయందనాల వంటకాలను ఆరగించండి రండి, రారండి అంటూ తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఆంధ్రులందర్నీ ఎంతో అభిమానంతో ఆహ్వానించారు నందిపాటివారు.

“మార్గ త్రయం-ఒకటి” కవితలో పరవళ్ళు తొక్కుతూ గలగల పారే గోదారమ్మ రాముని పాదంతాకి పునీతమైందని కొనియాడారు. సకల ప్రాణులకు జీవధార అయిన ఈ నదీమ తల్లి పుష్కర వేళ పుణ్య లోకాలను ప్రాప్తింపజేస్తుందని స్తుతించారు. అలాగే “యాత్రాత్రయం-రెండు” కవితలో యేసు ప్రభువుకి అద్భుతంగా అక్షర నిరాజనాలు అర్పించారు. యేసుని నమ్ముకుంటే కఠినాత్ముల మనసు కూడా కరుగుతుందని, యేసు సూక్తులు వింటూ ప్రేమని పంచుకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుందని చక్కని పదజాలంతో చెప్పారు. “మార్గత్రయం-మూడు”లో రంజాన్ ప్రాసత్యం పై చక్కని కితాబునిచ్చారు నందిపాటి వారు. పేదల ఆకలి కేకలను తన ఆకలిగా భావించిన రంజాన్ దాన ధర్మాలు చేసి చూపిన వైనాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఈ రంజాన్ స్నేహబంధాన్ని ఎలుగెత్తి చాటి సరికొత్త వెలుగుల్ని నింపిందని రంజాన్ పండుగ విశిష్టతని చాలా చక్కగా తెలియజేశారు.

“భక్తిశ్రద్ధలు” కవితలో శ్రద్దా భక్తులు లేకుండా ఏ పని చేసిన వ్యర్ధమని, మానవ సేవే మాధవ సేవగా భావించి తళుకు బెళుకుల బాహ్య సౌందర్యం కన్నా స్వచ్ఛమైన పాలమీగడ లాంటి భక్తి మార్గంలో పయనిస్తుంటే పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని సవినయంగా తెలియజేశారు రచయిత. “నిరాడంబరుడు” కవిత అబ్దుల్ కలాంలోని మేధోసంపత్తిని సవివరంగా తెలియజేసింది. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం గారు అందించిన సేవలకు నీరాజనాలర్పించారు రచయిత. “భారతావని” కవితలో అవినీతి, అరాచకాలు, విద్యారంగం, నిర్భయ చట్టాలకి న్యాయం చెయ్యలేక భారతమాత చెందుతున్న ఆవేదనని ఎంతో హృద్యంగా చెప్పారు. “కనకపు మెరుపు” కవిత మనసులోని బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం మిన్న అంటూ ఎంతో స్వచ్ఛందంగా చెప్పారు. “అనుభూతి అసామాన్యం” కవితలో మనిషి మస్తిష్కంలో దాగి ఉన్న భావజాలానికి అక్షర తోరణం కట్టారు. అలాగే “లేదు! లేదు! లేదు!” కవిత మనిషిలోని అత్యాశా వాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. “చిరునామా లేని ఉత్తరం” కవితలలో మనసుపెట్టి చెయ్యని ఏ పని, ఏ అంశం అయినా చిరునామాలేని ఉత్తరం లాంటిదని చాలా చక్కగా తెలియజేశారు. “ప్రకృతి – వికృతి” కవిత మనుషులోని వికృత చేష్టలకు అద్దం పట్టింది. ప్రకృతి అన్నివేళలా, అన్ని ఋతువుల్లో, అన్ని కాలాల్లో నిత్య నూతనంగా విరాజిల్లుతుంటే మనిషి మాత్రం నాగరికత పోకడలు పోతూ “వినాశకాలే విపరీత బుద్ధి” అన్న చందాన పర్యావరణ విధ్వంసంతో సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్న వైనాన్ని చాలా చక్కగా తెలియజేశారు.

“నేను వృక్షాన్ని నీ ప్రాణ భిక్షాన్ని” కవితలో సకల ప్రాణికోటి మనుగడకు రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నవృక్షం తీరుతెన్నుల్ని చాలా చక్కగా తెలియజేశారు నందిపాటివారు. అలాగే “దాహం! దాహం! దాహం!” కవిత నీటి విలువ తెలుసుకోక నీటిని వృధా చేస్తూ ఇంకా కొండకోనల్ని హరించి వేస్తుంటే ఉన్న నీరు అపరిశుభ్రమై కొత్తనీరు లేక పచ్చదనం మటుమాయమవుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోని వైనాన్ని కళ్ళకు కట్టినట్లు తెలియజేశారు. “ప్రాణధార” కవితలో జీవకోటికి ప్రాణాధారమైన నీటి విలువ తెలుసుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీటిని సంరక్షించుకొంటుంటే డబ్బు దాచుకున్న చందాన నీటిని కూడా భూమాత ఒడిలో దాచుకోవాలని చక్కని సూచన చేశారు రచయిత.

“పచ్చనైన పల్లె వదిలి” కవిత పచ్చదనానికి మారుపేరైన పల్లెను వదిలి కాలుష్యమైపోయిన పట్టణానికి వెళ్లి ఢాంబికాలు పోతే ఎలా ఉంటుందో చాలా చక్కగా కవిత్వీకరించి చెప్పారు. “సంపాదన! సంపాదన!” కవిత బంధాలు అనుబంధాల్ని కూడా త్యజించి డబ్బే పరమావిడిగా భావించి జీవిస్తూ పడుతున్న ఇక్కట్లను చక్కగా చెప్పారు. “ఇదే ప్రపంచం” కవితలో మానవుడు చరవాణికి వ్యసనపరుడై జీవచ్ఛవంగా బతుకుతున్న వైనాన్ని తెలియజేశారు. “తానంటే తందానందురు” కవిత నేటి రాజకీయ నాయకులు అధికారం ఛేదించుకోవడానికి పడే ఇక్కట్లని చురకల తెలియజేశారు. నాయకులు ప్రభుత్వానికి తానా అంటే తందానా అంటూ ప్రజల ఇక్కట్లను పట్టించుకోక అధికార దాహంతో వక్రమార్గాన పయనిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడకపోతే గ్రహపాటు తప్పదని హెచ్చరిక చేశారు నందిపాటి వారు.

“అనాగరికత” కవితలో మానవత్వం మంటగలిసిన వైనాన్ని చాలా చక్కగా అభివర్ణించారు. కులమతాల కుమ్ములాటలో కొట్టుమిట్టాడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటారు? అని ప్రశ్నించారు రచయిత. బుద్ధుడు నడిచిన, గాంధీ పుట్టిన దేశంలో ఎప్పుడు మారణకాండలేనా, ఇకనైనా నిజాలు తెలుసుకొని అజ్ఞానాన్ని వీడండంటూ హితవు పలికారు. చివరిగా “వినండి! వినండి!” కవిత ఆవేదనా భరితంగా ఉంది. దేశంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు, ఈర్ష్య ద్వేషాలతో ప్రగతి కుంటుపడింది. ఎక్కడ మహాత్మ? ఎక్కడ అంబేద్కర్? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. పెద్దలంతా మేల్కొని మంచి మార్గం చూపి దుష్టశక్తులను తరిమికొట్టి దేశ గౌరవాన్ని కాపాడటానికి “రండి కదలి రండి” అంటూ ప్రగతి పథంలో నడిపించే విధంగా మార్గం సుగమం చేశారు. ఇలా అన్నీ కవితలు ఎంతో ఆశక్తి దయకంగా సాగిపోతూ సాహితీ ప్రియుల మెదడుకు పదును పెట్టే విధంగా మంచి చేసేవిగా ఉండి అందరిని చదివింపజేస్తాయి.

ఇంకా ఈ కవితా సంపుటిలో “మీ ఊరు – నీరు”, “బ్రతుకు భారమే”, “దరికి చేరని ప్రాణులు”, “ఇదేం ప్రపంచం”, “అదును కోసం, సాగి కదలాలి”… లాంటి కవితలు కూడా మళ్లీ మళ్లీ చదివింపజేస్తాయి. సాహితీ ప్రియుల మనసు దోచుకున్న ఇంత చక్కని “అమరావతి” కవితా సంపుటిని సాహితీపు తోటలో మల్లెల గుభాళింపుతో అందంగా విరబూయించిన ఆచార్య నందిపాటి సుబ్బారావు గారికి అభినందనలు, జేజేలు అర్పిస్తున్నాను.

పేజీలు: 84, పుస్తక వెల : రూ. 50/-
ప్రతులకు : ఆచార్య నందిపాటి సుబ్బారావు, మొబైల్ నెంబరు: 9848486967,

పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు రచయిత్రి (ఫ్రీ లాన్స్ జర్నలిస్టు),
ఫోన్ నెంబర్ 9704725609

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap