
ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిచే “అమరావతి చిత్ర కళావీధి” పోస్టర్ ఆవిష్కరణ
ఈరోజు అనగా 20 మార్చి 2025 ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటితో కలిసి “అమరావతి చిత్రకళా వీధి” పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్ లోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందని అన్నారు. ప్రతిభావంతులైన కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి మరియు గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
శ్రీమతి తేజస్వి పోడపాటి మాట్లాడుతూ, సంవత్సరాలుగా విస్మరించబడిన కళాకారులను ప్రోత్సహించడానికి సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కమిషన్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదని, కళాకారుల సాధికారతకు ఒక స్పష్టమైన చర్య అని, కళాకారుల సంఘం నుండి అపూర్వమైన స్పందన లభించిందని ఆమె పునరుద్ఘాటించారు.
2025 ఏప్రిల్ 4న రాజమండ్రి, లాలా చెరువు రోడ్డులో జరగనున్న “అమరావతి చిత్రకళా వీధి” కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం విశేషం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి, కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తుంది “అమరావతి చిత్రకళా వీధి”.
చిత్రకారులు ముఖ్యంగా తెలుగు చిత్రకారులు ఒక వేదిక గా కలుసుకోవడం , అలాగే తమ పెయింటింగ్స్ ప్రదర్శించడం మరియు అమ్మకాలు జరుపుకోగలగడం చాలా సంతోషించదగ్గది. దామెర్ల రామారావు గారిని గుర్తు చేసుకుంటూ రాజమహేంద్ర వరం లో ఈ తరహా కార్యక్రమం జరగబోతుండడం చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం జరగాలని ఆశిస్తున్నాను. ఆలోచన అలాగే అమలు చేస్తున్న అందరికీ వందనాలు.