అందమైన సమాజమే ‘కుందుర్తి’ కవితా లక్ష్యం

గుంటూరు, అమరావతి సాహితీ మిత్రులు సభలో డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

అందమైన సమాజం కోసం కుందుర్తి కవిత్వం రాశారని ప్రముఖ సాహిత్య విశ్లేషకులు డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి తెలియజేశారు. 21-04-24, ఆదివారం ఉదయం గుంటూరు బ్రాడీపేటలోని సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో “అమరావతి సాహితీ మిత్రులు” నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సరళ సుందర శైలి జన సామాన్యానికి అవసరం అని భావించారని వచన కవిత్వాన్ని ఒక ఉద్యమ స్థాయిలో ప్రచారం చేశారని ఆమె వివరించారు. కథలుగా నాటకాలుగా కూడ వచన కవిత రావాలని ఆశించారని ఆమె అన్నారు. అమరావతి సాహితీ మిత్రులు సంస్థ అధ్యక్షులు డా. రావి రంగారావు సభకు అధ్యక్షత వహించారు ఆయన రూపొందించిన వచన కవిత మూల్యాంకనం స్కేలును సభలో వివరించారు. వచన కవిత్వం రాయటానికి కవులు గమనించాల్సిన అంశాలను అందులోంచి ప్రస్తావించారు. ప్రముఖ సాహితీవేత్త డా. చిటిప్రోలు వెంకటరత్నం తుమ్మల రచించిన “అమర జ్యోతి” గురించి ప్రసంగించారు. గాంధీజీ చనిపోయినప్పుడు రాసిన ఈ కావ్యంలో విషాదాన్ని ప్రపంచ విషాదంగా అభివర్ణించారన్నారు. ఆనాటి స్వతంత్ర సమర విషయ పరిజ్ఞానంతో పాటు గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలు అందులో మనకు కనిపిస్తాయని, కరుణామూర్తిగా గాంధీజీని కమనీయంగా చిత్రించారని తుమ్మలను వెంకటరత్నం ప్రశంసించారు.

“ఈ మాసం” కవిగా డా. మైలవరపు లలిత కుమారి పాల్గొని వినిపించిన అనేక కవితలు సభను ఆకర్షించాయి. సంస్థ కన్వీనర్ పింగళి భాగ్యలక్ష్మి నిర్వహించిన కవి సమ్మేళనంలో గోలి హనుమత్ శాస్త్రి, వి వి రావు, బలభద్రపాత్రుని ఉదయ శంకర్, చల్లా సత్యవతి, యక్కంటి పద్మావతి, శేషు మాంబ, నల్లాన్ చక్రవర్తుల సుధా మైధిలి, పూసపాటి కృష్ణ సూర్యకుమార్ మొదలైన వారు కవితలు వినిపించారు. “నిక్కచ్చి కవిత”కు ఎంపికైన గోలి హనుమత్ శాస్త్రిని, ఈ మాసం కవిగా పాల్గొన్న డాక్టర్ లలిత కుమారిని, మూడు నెలల మినీ కవితల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ధనుంజయరెడ్డిని సంస్థ పక్షాన డా. రావి రంగారావు, చిటిప్రోలు వెంకటరత్నం, భాగ్యలక్ష్మి, డాక్టర్ టి. సేవకుమార్ మొదలైనవారు సత్కరించారు.

SA: