అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ పర్యాటన వజ్రోత్సవ ‘వర్ణచిత్ర ప్రదర్శన ‘ విజయవాడలో…
అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వ కార్మికమంత్రిగా 1944, సెప్టెంబర్ 22న చేపట్టిన దక్షిణ భారత దేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్, మద్రాసు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం లను సందర్శించి దళిత చైతన్యాన్ని నింపారనీ, తీరాంధ్రలో దళితుల పిల్లలు విద్యావంతులై సమాజాన్ని నడపాలని ఉద్బోధించారని కృష్ణా జిల్లా కలెక్టర్, ఎ.ఎండి. ఇంతియాజ్, అన్నారు. అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ సందర్శన వజ్రోత్సవ సందర్భంగా, ప్రముఖ చిత్రకారుడు, ప్రాతీయ పర్యాటక సంచాలకులు రేగుళ్ల మల్లికార్జున రావు చిత్రించిన అంబేద్కర్ వర్ణచిత్ర ప్రదర్శనను, మంగళవారం నాడు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సీసీవిఏ) లో ఆయన ప్రారంబించారు. కులమతాలకు అతీతంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని, నందన హరిశ్చంద్రుడు, ఈలి వాడపల్లి, కుసుమాధర్మన్న, జావ రంగస్వామి ఈ పర్యటనలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. మాజీ ఎమ్మెల్సీ,
జల్లి విల్సన్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 30న తొలిసారిగా ఏలూరు పట్టణానికి వచ్చిన అంబేద్కర్ ను, పుర ప్రజలు ఊరేగింపుగా తీసుకొని రాగా, జూనియర్ కాలేజీలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో నిమ్న జాతీయులను సంఘటిత పరిచే సూచనలిచ్చారన్నారు. ఈ పర్యటన దళితుల్లో ఆత్మాభిమానాన్ని నింపి, అనేకమంది నాయకులను తయారు చేసిందన్నారు. చిత్రకారుడు రేగుళ్ల మల్లికార్జున రావు మాట్లాడుతూ, అంబేద్కర్ ఏలూరుకు వచ్చి 75 ఏళ్ళైన సందర్భంగా, దళిత సంఘాలన్నీ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయనీ , వేడుకల్లో భాగంగా, ప్రదర్శించిన వర్ణ చిత్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు, రాజేంద్ర ప్రసాద్ కు రాజ్యాంగాన్ని అందించడం, అంబేద్కర్ జ్ఞానిగా పద్మం గుర్తుతో ఉన్న చిత్రం, రాజ్యాంగ పీఠిక – చుట్టూ అన్ని కులాలను ప్రతిబింబించేలా పూలు, విజ్ఞానఖని, మహద్ చెరువు నీటిని అందరూ తాగొచ్చుని చేసిన పోరాట చిత్రం, సర్వ మానవ సౌభ్ రాతృత్వం, సర్వ సత్వాకాన్ని ప్రతిబింబిస్తున్న అంబేద్కర్ పార్లమెంట్ భవనం, రకరకాల పక్షులు, ఆత్మ స్టైర్యంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించిన ఫలాలను పొందినవారు మిగతా వారికి పంచాలన్న సందేశం, భారతదేశంలో అంటరానితనం – బానిస వ్యవస్థ కంటే హీనమన్న ఆవేదన, కాలారం దేవాలయ ప్రవేశం, వివిధ భంగిమల్లో ఉన్న అంబేద్కర్ మనుధర్మ శాస్త్రం అంటరానివారి పట్ల వ్యక్తపరిచిన దైన్యస్థితి, ఆయన ఆశయాలను విద్య, వసతి గృహాలు, సమాజంలో బలహీనులను బలిపశువులను చేయటం, స్వేచ్ఛ, సమానత్వం ఉద్వేగభరిత ప్రసంగం, మహిళల స్వాతంత్ర్యం కోసం బిల్లులు, ఇప్పటికీ కొనసాగుతున్న అంటరానితనానికి బౌద్ధమే నివారణోపాయం అని, సాహు మహారాజ్ స్కాలర్ షిప్ తో విదేశాల్లో చదివిన అంబేద్కర్ స్పూర్తితో ప్రభుత్వాలు దళితులకు ఇస్తున్న చేయూత మొదలైన చిత్రాలను ప్రదర్శించారు.
అంబేద్కర్ ఏలూరు సందర్శన వజోత్సవాన్ని దళిత సంఘాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాయి. వంగాయగూడెంలో గౌ. శ్రీ గోడె జాన్ డేవిడ్, గొడె థామసమ్మల జ్ఞాపకార్ధం, వజోత్సవ వేళ, డా. బి.ఆర్. అంబేద్కర్ గారి స్తృతి చిహ్నంగా, ఏలూరు పట్టణంలోని వంగాయగూడెం సెంటరులో నమూనా (అర్ధచంద్రకారం) ఆ హాలులో గ్రంధాలయం అదేవిధంగా అంబేద్కర్ జీవిత ఛాయచిత్ర మాలిక మరియు తైలవర్గ చిత్రాలు భవనం పై భాగంలో 12 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం, శాశ్వత ప్రాతిపదికన వీక్షకులు వీక్షించే విధంగా ఆ నిర్మాణాన్ని వారి కుటుంబ సభ్యులు నిర్మించడం జరిగింది. ఈ వజోత్సవ వేళ డా. అంబేద్కర్ స్తృతి మనమదిలో ఆయన ఆలోచన విధానం, ఆచరణలో మనల్ని ఎల్లప్పుడ జాగృతం చేస్తూ, స్ఫూర్తినిస్తుందని మల్లికార్జునరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో కల్చరల్ సెంటర్, సీఈవో, ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్, నగర ప్రముఖులు పాల్గొన్నారు.