రాజ్యాంగ నిర్మాత – సమసమాజ నిర్ణేత

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 46

రాజ్యాంగ నిర్మాత – సమసమాజ నిర్ణేత

అణవణువునా మానవత్వం నిండిన తనువు. అంటరానితనం, అసమానతలపై ఎక్కుపెట్టిన ధనువు వీటన్నింటికీ ఒక్కటే పేరు అదే డా. భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. తాను పంచముడని కనీసం గుక్కెడు మంచి నీరివ్వకుండా ఆనాటి సమాజం అంబేద్కర్ ను వెలివేసినా తన అకుంఠిత దీక్షతో ప్రపంచం ముక్కు మీద వేలేసుకునే స్థాయికి ఎదిగిన అఖండ భారతీయ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. అడుగడుగునా తన అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిన అంటరానితనాన్ని నిర్మూలించాలని చిన్ననాటనే అంబేద్కర్ నిర్ణయించుకున్నాడు. మనదేశంలో నాటుకుని ఉన్న నాటి సామాజిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తన ప్రతిభతో తన కందిన సహాయ సహకారాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాడు. స్వతంత్ర భారతికి రాజ్యాంగ నిర్మాణ సారథ్యం వహించి, భారతదేశానికి తొలి న్యాయశాఖా మాత్యుడయినాడితడు. స్వతంత్ర భావాలతో అంటరానితనం నేరంగా పరిగణించే చట్టాన్ని తీసుకొచ్చి కుల మతాల కతీతమైన లౌకిక పాలనలోనే దేశ ప్రజలకు సౌఖ్యం లభిస్తుందని వాదించాడు. అణగదొక్కబడిన వారికి ఆలంబనగా నిలిచి అభినవ రామరాజ్యానికి ఆద్యుడై పేద ప్రజానీకానికి ఆరాధ్యుడయిన ఈ భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ నేటికీ మన ధృవతార.

(బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం 14 ఏప్రిల్ 1891)

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link