అమృతాషేర్ గిల్ చిత్రాలు- తూర్పు పడమర చుట్టాలు

Boy_With_Lemons

ఆధునిక కళాసామ్రాజ్యంలో మొదటి స్త్రీ కళాకారిణిగా భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన మహిళ అమృతా షేర్ గిల్. అంతేకాదు, ఆమె చిత్రాలను భారత ప్రభుత్వం ఈనాడు మన వారసత్వ సంపదగా ప్రకటించింది. 1913, జనవరి 30న పంజాబ్ సిక్ తండ్రికి, హంగేరియన్ తల్లికి జన్మించి, తన బాల్యం బుదా పెస్ట్ లో గడిపింది. తండ్రి సంస్కృత, పార్శీ భాషావేత్త. తల్లి ఒపేరా గాయని. వారి సృజనాత్మకతను పుణికి పుచ్చుకుందేమో… ఈమె తన 5వ ఏటనే చిత్రాలు గీయటం మొదలు పెట్టింది. ఆపై వీరి కుటుంబం ఇండియాలోని సిమ్లా వలస వచ్చింది. ఆమె తన 7వ ఏట పియానో, వయొలిన్ నేర్చుకుని 9వ ఏట కచేరీలు చేసింది. 8వ ఏట చిత్రకళాభ్యాసం మొదలు పెట్టి, యూరోప్లోని ప్రఖ్యాత చిత్ర కళాశాలల్లో అభ్యాసానికి, భారతదేశానికి మధ్య ఎన్నో ప్రయాణాలు చేసింది.

1932వ సంవత్సరంలో ‘ఇద్దరు అమ్మాయిలు‘ అనే చిత్రం గీసి యూరోప్లో ప్రదర్శించినప్పుడు ఆమెకు స్వర్ణపతకం వచ్చింది. ఆ చిత్రంలో పాశ్చాత్య కలం ప్రభావమే ఆమెలో అప్పుడు పని చేసింది. కానీ ఆమెను వారు ఏసియన్‌గా పరిగణించారు. 1933లో ఆమెకు భారతదేశం వెళ్ళాలని, అక్కడి సంస్కృతి, సంప్రదాయ కళలను పరిశోధించి, అర్థం చేసుకోవాలని బలమైన కోరిక కల్గింది. తిరిగి వచ్చేసి, ‘పాశ్చాత్య దేశం అక్కడి కళాకారులదే… తన చిత్రానికి మూలం ఇక్కడే” అని చెప్పింది. అజంతా ఎల్లోరా వంటి మన ముఖ్య కళాస్థావరాలు చూస్తూ ఉత్తర భారతం నుండి దక్షిణానికి ఆమె ఎంతో ప్రయాణం చేసింది. మొఘల్, పహాడి లఘు చిత్రాల శైలిని అర్థం చేసుకుంది. గ్రామీణ ప్రజల జీవనాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. ఆపై ఆమె చిత్రాల సరళి మారింది.

Amrita Sher-Gil

ప్రఖ్యాతి పొందిన ఆమె చిత్రాల్లో “పెళ్ళికూతురి అలంకరణ‘, దక్షిణ భారతంలోని గ్రామంలో వేసిన చిత్రం, బాల్య వివాహం చేస్తున్న ‘చిన్ని పెళ్ళికూతురు’ చిత్రం మరొకటి. ఆమె చిత్రాల్లో స్త్రీల జీవితపు సంఘటనలే ఎక్కువ కనిపిస్తాయి. స్త్రీలైనా, పురుషులైనా ప్రతివారూ ఒక నెమ్మదితనంతో నిశ్శబ్దంగా, ఏచురుకూ లేనట్టు ఉంటారు. ‘ముగ్గురమ్మాయిలు’ చిత్రం ఆమె ముందరి శైలికి, తరువాత శైలికి తేడా తెలుపుతుంది.
తాతలు కథలు చెప్పటమూ, అందులోనూ ఆకలి వేస్తున్న పిల్లలకు కథలు చెప్పి కూర్చోబెట్టటం పల్లె ప్రజల సాధారణ దృశ్యం అని ఆమె చిత్రం ‘ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్’ చిత్రంలో అర్థం అవుతుంది. ఆదివాసుల చిత్రాలు, మార్కెట్లో మిరప విక్రయ చిత్రాలు, ఆమె ఏ చిత్రాలైనా కోలముఖాలతో, రంగుల ఆకర్షణతో అందంగా కనిపిస్తాయి. కానీ ఆమె పల్లె ప్రజల నిరాశా జీవనాన్ని పట్టి చిత్రంలో చూపించాలని ప్రయత్నించేదని చెప్పింది.

భారతదేశ పల్లె ప్రజల జీవనం ఆమె ఊహకు ఊపిరి అయింది. తూర్పు, పడమర దేశాల మధ్య వారధిలాంటి ఆమె ఊహలు, అడవి మొల్లకు, గులాబి పరిమళం కూర్చిన ప్రయత్నంలా అనిపిస్తాయి. 1941, డిసెంబర్ 5న 28 సంవత్సరాలకే జీవితం చాలించింది. 1978లో ఆమెను విజయవంతమైన చిత్రకారిణిగా ఎప్పటికీ నిలబెట్టే ప్రయత్నంలో భారత ప్రభుత్వం ఆమె ‘ఆదివాసీ స్త్రీలు‘ అనే చిత్రాన్ని స్టాంప్ గా విడుదల చేసింది.

-డా. ఎం. బాలామణి

Amrita-Sher-Gil
SA:

View Comments (1)

  • మంచి సమాచారం ఇచ్చారు సర్... ధన్యవాదములు అండీ