ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామంగారు 11 ఫిబ్రవరి 2021 నాడు హైదరాబాద్లో గుండెపోటుతో పరమపదించారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త పేరు రామం ను తన పేరుతో జతపరిచి జీవితాంతం ‘ఆనందరామం’ గా ప్రసిద్ధి చెందారు. తెలుగు సాహిత్య రంగంలో పాఠశాభిమానాన్ని పొందిన అతికొద్ది రచయితల్లో ఆనందరామం అగ్రస్థానంలో ఉంటారు. 1935, ఆగస్ట్ 20 నాడు ఏలూరులో జన్మించిన ఆనందరామంగారు 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శగ్రంథాలు రాశారు.
ఆనందరామం గారు రాసిన ఆత్మబలి అనే నవల సంసార బంధం పేరుతో, అదే నవల జీవన తరంగాలు పేరుతో సీరియల్ గా, జాగృతి నవల త్రిశూలం సినిమాగా వచ్చాయి. మమతల కోవెల అనే నవల జాగృతి సినిమాగా వచ్చింది. ఉస్మానియా
యూనివర్శిటీలో తెలుగు ఎమ్మే చదివారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు గైడ్ గా పీహెచ్ డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. హెం సైన్స్ తర్వాత నవజీవన్ నవజీవన్ కాలేజీలో కొంత కాలం పనిచేశారు. 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
సుమారు 30 మంది విద్యార్థులు ఆమె ఆధ్వర్యంలో పీహెచ్ డీ చేశారు. 2000వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు.
ఆనందరామంగారికి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. 1972లో గృహలక్ష్మి స్వర్ణ కంకణం, 2013లో మాలతీ చందూర్ స్మారక అవార్డు, 1979లో తుఫాన్ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, 1997లో మాదిరెడ్డి సులోచన బంగారు పతకం తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, గోపీచంద్ పురస్కారం, అమృతలత జీవన సాఫల్య పురస్కారాల లాంటి వెన్నో ఆమెకు లభించాయి.
‘ఆమె మృతితో ఒక శకం ముగిసిందని.. శాశ్వతంగా గుర్తుండిపోయే రచనలు చేసిన ఆనందరామం గారికి అశ్రునివాళి..’ అని పలువురు కవులు, రచయితలు పేర్కొన్నారు.