భారతీయత ఉట్టిపడే ’నవీన బెంగాలీ సంప్రదాయ’’ ఆంధ్ర చిత్రకారుడు కౌతా ఆనందమోహన్. నవవంగ సంప్రదాయ చిత్రకళను అభ్యనించిన, కౌతా రామమోహన శాస్త్రి, కౌతా ఆనందమోహన శాస్త్రి సుప్రసిద్ధ కౌతా శ్రీరామశాస్త్రి గారి కుమారులు. శ్రీరామశాస్త్రి గారు లోగడ శారద పత్రిక స్థాపించి, సంపాదకులుగా పనిచేసి, తెలుగు సారస్వతానికి సేవ చేసినవారు. కౌతా సోదరులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. వీరు ప్రారంభదశలో మచిలీపట్నం జాతీయ కళాశాలలో చిత్రకళలో శిక్షణ పొందారు. పిమ్మట మైసూరులో సుప్రసిద్ద చిత్రకారుడు కె. వెంకటప్పతో కలిసి పనిచేశారు. నవవంగ చిత్రకళా సంప్రదాయాన్ని అభ్యసించిన ఈ యిద్దరు సోదరులు ‘రూపరేఖి చిత్రాలను మొఘలు -రాజన్థాన్ లఘు చిత్రాల శైలిలో పెన్సిలుతో చిత్రించుటలో సిద్దహస్తులు. వీరు రచించిన చిత్రాలన్నీ ఆహ్లాదకరంగా వుంటాయి. వ్యక్తులను ఎదుట ఉంచుకొనే చిత్రించేవారు.
1906 సం.లో పుట్టిన కౌతా రామమోహన శాస్తి బందరు జాతీయ కళాశాలలో 4 ఏళ్ళు చిత్రకళలో శిక్షణ పొందారు. తర్వాత 1931-1935లో లండన్ రాయల్ కాలేజి ఆఫ్ ఆర్ట్స్‌లో ప్రొఫెసరు మాల్మమ్ అసబర్చు సర్ విలియం రోతన్ స్టెయిన్‌ల వద్ద ‘డై పాయింట్ ఎచ్చింగ్‌లో ప్రత్యేక పద్ధతిని అభ్యసించారు. కావలిలో జవహర్ భారతి ఆర్జు స్కూలులో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. డైపాయింట్ ఎచ్చింగ్ పద్ధతిలో సర్వేపల్లి రాధాకృష్ణ సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ, రవీంద్రనాధ్ టాగూర్ వంటి ప్రముఖుల చిత్రాలను అత్యంత సహజంగా చిత్రించి, ప్రశంసలు పొందారు. రామమోహన శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం లోగోను (ముద్రికను) రూపకల్పన చేశారు. ఈయన చిత్రాలలో ‘కేశాలంకరణ, నిరీక్షణ టఫాల్లర్ స్వ్వేర్, ఆపిల్ సెల్లర్, సరస్వతి, ఓల్డ్ ట్రీ వంటి చిత్రాలు ప్రశంసలు పొందాయి. ఈయన 1976లో మరణించారు.
రామమోహన శాస్త్రి గారి సోదరుడు కౌతా ఆనందమోహన శాస్త్రి (1908-1940) 32 సంవత్సరాలే జీవించినా… ఆనేక భావ చిత్రాలు, ప్రకృతి దృశ్య చిత్రాలను నవవంగ సంప్రదాయ పద్ధతిలో రూపొందించి దేశ విదేశాల చిత్రకళా విమర్శకుల మన్ననలను పొందారు. డాక్టర్ జె.హెచ్. కజిన్సు వీరిని ప్రశంసిస్తూ ‘హిందూ దినపత్రికలో వ్రాశారు. “16 సంవత్సరాల వయస్సులో సుందరమైన అతని ఆత్మ మనోహరమైన చిత్రాలలోనికి పరివర్తనం పొందింది. భారతదేశ చిత్రకళ, ఏవిధంగా పునరుజ్జీవనం పొంది వికసించిందో, ప్రపంచంలో ఉన్నత స్ధానం పొందిందో, ఆనంద మోహన తన చిత్రాల ద్వారా తెలియజేశారు” అని కజిన్సు ప్రశంసించారు. ఈయన చిత్రాలు మైసూరు, త్రివేండ్రం ప్రదర్శనశాలల్లో వున్నాయి. త్రివేండ్రం ప్రదర్శనశాలలో వున్న చిత్రం “ఏకలవ్యుడు”. ఈ చిత్రాన్ని అత్యంత రమణీయంగా చిత్రించాడు. ప్రతిభాగంలోనూ భారతీయత ఉట్టిపడేలా, ప్రకృతి పరిసరాల మాధుర్యాన్ని అత్యంత సుందరంగా మిళితం చేసి, రూపొందించాడీ చిత్రాన్ని. ఆనాడు ఆ చిత్రాన్ని మెచ్చుకొనే పండితులు భారతదేశంలో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇతర దేశస్థులు మన గొప్పతనాన్ని చెప్పేంత వరకు మనవారు మనల్ని గుర్తించరు. అది ఈనాటికీ చెబుతున్న సత్యమే. అందుచేతనే ఆనంద మోహన శాస్తి చిత్రాలు యూరపు, అమెరికా ఖండాలలో ప్రశంసలు పొందాయి. అందుకే ‘నేటి కళాభిజ్ఞులు’ అనే శీర్షికతో (ఫెంచి దేశపు పత్రికలో ఈ భారతీయ చిత్రకళాకారుని కళా ప్రాధి, కళా విశిష్టతలు గురించి వ్రాశారు”. 1980 లోనే లండన్‌లో ప్రదర్శించిన ‘సామ్రాజ్య చిత్రవస్తు ప్రదర్శనలో ఈయన రచించిన రెండు చిత్రాలు చోటు చేసుకున్నాయి. అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రదర్శనాలయంలో భారతీయ చిత్రాలలో ఆరు కంటే ఎక్కువ వుంచుటకు అవకాశం లేదు. అయినా ఆనంద మోహన శాస్త్రి గారి రెండు చిత్రాలకు ఆ అవకాశం దొరకడం గొప్ప విశేషమే మరి.
“అతి పిన్న వయసులో ఇంత పెద్ద పేరు గడించిన శాస్త్రిగారి ఆయుర్ధాయం యింకా వున్నట్లయితే, ఎంత గొప్పవాడై తనకు, తన కుటుంబానికే కాక, భారతదేశమంతటికీ ఎంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చియుందెనో ఆలోచింతురుగాక. అంతేకాకుండా ఇతని చిత్రాలన్నింటినీ సేకరించి, ప్రధానమైన ఒక స్థలంలో ఇతని పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసి, భారతీయులు తమ కృతజ్ఞతలను తెలియజేసుకొందురని” డా. కజిన్సు పండితుడు అభిప్రాయపడ్డారు. ఈ కళాకారుడు భారతీయుడు కనుక, ప్రకృతిని చూచి తన కళానైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన దేశంలోనే అవకాశాలు ఎక్కువగా వున్నాయని, ప్రకృతిని చూచి చిత్రకళా విషయాలను అవగాహన చేసుకోవడంలో యితనికి సహజంగా కలిగిన విషయ గ్రహణ శక్తి ఆత్మ సౌందర్యం, విజ్ఞానం, సౌందర్య రస గ్రహణ శక్తి ఇతనికి ఎక్కువగా తోద్బడ్డాయి. ఇతని చిత్రాలు సజీవమైన చిన్న నాటకాలు. రాగోద్దీపితమైన తన దేశంలో దైనందిన జీవితానికి వాస్తవమైన అనువాదాలు ఈయన రచించిన నీడలు, కత్తి పదును పట్టువాడు అనే చిత్రాలు రచించిన విధానం అతి రమణీయమైనది. ఈ రెండు చిత్రాలలో అతని కళా నైపుణ్యం పరణతి పొందింది. ఇతనిలో ఇంత గొప్ప నైపుణ్యం ఉండుటచేతనే యితని చిత్రాలకు 1930లో లండన్ నగరమందు సామ్రాజ్య చిత్ర వస్తు ప్రదర్శనాలయంలో ప్రవేశం కల్లిందని పాస్మలెవీ గారు వ్రాశారు. ఆనంద మోహన్ చిత్రాలలో ఒకటి 1925లో లక్నో నగరంలో జరిగిన చిత్ర వస్తు ప్రదర్శనలో ‘రాజా మోతీ చందు పతకాన్ని బహుమానం పొందింది. ఆ సంవత్సరమే “తన్మయత్వం” అనే చిత్రం డైలీ ఎక్స్ ప్రెస్ అనే పత్రిక సంవత్సరాది సంచికలో ప్రకటితమయ్యింది. ఈయన చిత్రించిన జీవాత్మ గోపాలుడైన కృష్ణుడు చిత్రాలను “ఇలస్టేట్‌డ్ లండన్ న్యూస్ అనే పత్రికలో 1929లో ప్రచురించారు. కౌతా ఆనంద మోహన శాస్త్రి చిత్రించిన మరికొన్ని చిత్రాలు ‘ఊయల, గొల్లపిల్ల, రుద్రుడు, సంతనుంచి, అజంతా నర్తకి, తిక్కన సోమయాజి, గ్రామవీధి, వరూధినీ ప్రవరాఖ్యులు, సతీ శివుడు” ముఖ్యమైనవి. ఈయన అతి పిన్న వయసులోనే 1940లో మరణించారు.
–గబ్బిట దుర్గాప్రసాద్ (mob. 99890 66375)
ఆంధ్ర చిత్రకారులు శ్రీ కౌతా ఆనందమోహన శాస్త్రి గారి గురించి బాగా వివరించారు. అయితే ఆయనవి మరి కొన్ని చిత్రాలు పెట్టి ఉంటే ఆయన ప్రత్యేకత తెలిసి ఉండేది.
మరొక సూచన. ఫాంట్ మరీ సన్నగా ఉండి చదవడానికి కొంచెం కష్టంగా అనిపించింది. వీలయితే అది మార్చండి.
Thank you sir.