
నేటి పిల్లలే రేపటి పౌరులు. కేవలం పుస్తకాల చదువు సరిపోదని, చిన్నారులు చురుగ్గా జీవితంలో రాణించాలంటే సాహిత్య సాంస్కృతిక రంగాల్లోను ముందుండాలని 85 ఏళ్ల క్రితం రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు, రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి గారు గొప్ప ముందుచూపుతో ఏర్పాటు చేసిన అద్భుతమైన సంస్థ ఆంధ్ర బాలానంద సంఘం. ఆ సంస్థ 85 వ వార్షికోత్సవ వేడుకలు అత్యద్భుతంగా శనివారం (22-02-2025) హైదరాబాద్ శ్రీ సుందరయ్య విజ్ఞాన భవన్ లో జరిగాయి. బాలానందంలో పెరిగి సుడిగుండాలు సినిమాలో బాల నటిగా నటించి ప్రస్తుతం ఆస్ట్రేలియా లో ఉంటున్న బి.వి. లక్ష్మి ప్రసాద్ హాజరవడం విశేషం.
ఆంధ్ర బాలానందంతో నాకు మూడు దశాబ్దాల అనుబంధం వుంది. అక్కడ జరిగే ఎన్నో కార్యక్రమాలను ఆంధ్రజ్యోతి, వార్త పత్రికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాను. వివిధ సందర్భాలలో అక్కడ అభినందనలు, సత్కారాలు అందుకున్నాను. 85వ వార్షికోత్సవ వేడుకల్లో నేను ముఖ్య అతిధిగా పాల్గొనే అదృష్టం లభించింది. వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, వివిధ సందర్భాల్లో కలసి మాట్లాడుతున్నప్పుడు చాలామంది నోట ఆంధ్ర బాలానంద సంఘం గురించి చెప్పడం విన్నాను. బాల్యంలో బాలానందం వేసిన పునాది తమకు కెరీర్ పరంగా రాణించేందుకు సుగమం అయ్యిందని చెబుతుండే వారు. అంతటి ఘన చరిత్ర కలిగిన సంఘం బాలానందం.
క్రమశిక్షణ, సమయపాలన, జ్ఞాపకశక్తి, చురుకుదనం, తెలివితేటలు… ఇలా అన్నింట్లో ముందుండాలంటే చిన్నప్పుడు బాలానందంలో చేరి ఉండాలి. ఇష్టమైన సంగీత నృత్య నాటక సాహిత్య జానపద రంగాల్లో చేరి శిక్షణ పొందాలి. అలా చేరిన వాళ్ళు చదువుల్లో రాణించారు. వివిధ పోటీల్లో ర్యాంకులు సాధించారు. ఉద్యోగాలు పొందారు. జీవితంలో రాణిస్తున్నారు. ఈ విషయమే నాతో పాటు పాల్గొన్న గౌరవ అతిధులు బి.వి. లక్ష్మి ప్రసాద్ గారు, ప్రముఖ లలిత సంగీత గాయకులు కె.ఎస్.ఆర్. మూర్తి గారు, విఖ్యాత కార్టూనిస్ట్ సరసి గారు కూడా తెలిపారు. చిన్నప్పుడు బాలానందంలో వేసిన నాటికలు ఆయా పాత్రల గురించి గుర్తు చేసుకున్నారు బి.వి. లక్ష్మి ప్రసాద్ గారు.
ప్రస్తుతం బాలానందం అధ్యక్షురాలుగా కొనసాగుతున్న జె.వి. కామేశ్వరి అక్క అన్నీ తానై జీవితాన్ని బాలానందం కోసం అంకితం చేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా విశేష సేవలు అందిస్తూ ఉచిత లలిత సంగీత శిక్షణ ఇస్తున్న ప్రముఖ లలిత సంగీత దర్శకులు కలగా కృష్ణమోహన్, కార్యదర్శి డా. స్వర్ణ బాల అద్భుతంగా బాలానందం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కార్యవర్గ సభ్యులంతా వలంటీర్లుగా క్రమశిక్షణ గా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన తీరు అభినందనీయం, ఆదర్శనీయం. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన ఎలుక పెళ్ళి నాటిక, కూచిపూడి నృత్యాలు, లలిత శాస్త్రీయ సంగీత గీతాలు అందరినీ కట్టి పడేశాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారి విజేతలకు బహుమతులు అందిస్తున్నప్పుడు వారిలో కనిపించిన ఆనందం అబ్బురపరచింది. చిన్నారులకు పురస్కారాలను పూర్వ బాలానందం సభ్యులు, అభిమానులు గాయత్రి ఆత్మరామ్, అమృతవల్లి ఆనందకృష్ణ, వసంత సుబ్బలక్ష్మి శశికుమార్, శారద సాయినాథ్, జానకి ఈశ్వర్, శైలశ్రీ గోపీచంద్, మిడుతూరి ఫ్యామిలీ సౌజన్యం అందించడం విశేషం. కలగా కృష్ణమోహన్, యు. సతీష్ బాబు
సమన్వయం చేశారు.
–డా. మహ్మద్ రఫీ