‘ఆంధ్రభారతి’ రూపకర్త శేషతల్పశాయి

(గుప్తా ఫౌండేషన్ వారి మడువల్లి కృష్ణమూర్తి పురస్కారం-2021 వాడపల్లి శేషతల్పశాయిగారు అందుకున్న సందర్భంగా…)

చాలామందికి అభిరుచులనేవి జీవితానికి అనుబంధంగానే ఉంటాయి. కొందరికి మాత్రం అవే ఆయువుపట్టవుతాయి. ఇక ‘ఏంటి దీని వల్ల లాభం’ లాంటి ప్రశ్నలకు వారి వద్ద జవాబు దొరకదు. అది సమాజానికి, జాతికి ఉపకరించేదైతే చెప్పేదేముంది! ఈ కోవకు చెందినవారే శేషతల్పశాయి, నాగభూషణరావులనే ఇద్దరు మిత్రులు. వారు సొంత లాభం ఎంతో మానుకుని మరీ తెలుగు భాషకు, సాహిత్యానికి ఎంతో సేవ చేశారు..

బృహత్ కార్యాల్ని సాధించడానికి ప్రభుత్వాలు, సంస్థలే అక్కర్లేదు. అభిరుచి, పట్టుదల ఉన్న వ్యక్తులైనా చాలని నిరూపిస్తున్నారు. వాడపల్లి శేషతల్పశాయి, కాలిపు నాగభూషణరావులు. వీరిద్దరూ కలిసి ఇరవైయేళ్ళ క్రితం ‘ఆంధ్రభారతి‘ పేరుతో ఒక వెబ్ సైటుకు శ్రీకారం చుట్టారు. ఆదిపుడు తెలుగు భాషాభిమానుల పాలిట పెన్నిధిగా మారింది. అక్కడ పొందుపరిచిన ప్రాచీన సాహిత్యం అంతా ఒక ఎత్తయితే, వారు ఏర్పాటు చేసిన నిఘంటువుల సదుపాయం మరొక ఎత్తు.

ఇక్కడ పుటలు వెతికే అలసట లేదు. పుటలన్నీ వెతికినా అర్థం దొరకని ఆగత్యమూ రాదు. ఒక పదం టైపు చేస్తే చాలు, పదహారు నిఘంటువుల్లో దాని జాడ ఎక్కడున్నా అర్ధంతో సహా మన ముందు ప్రత్యక్షమవుతుంది. పదహారు నిఘంటువులన్నది ఇప్పటి సంగతి. రానున్న కాలంలో ఈ సంఖ్య పెరగనుంది. మరొక్క మూడేళ్లు గడిస్తే, తెలుగులో ఇప్ప టిదాకా వెలువడిన నిఘంటువులన్నీ (సుమారు డెబ్బై దాకా) మన సేవలో ఉంటాయి.

ఈ వెబ్ సైటు నడపటం వల్ల వీరికి నయాపైసా రాదు. ప్రకటనలకు కూడా వీరు చోటివ్వరు. పైపెచ్చు బోలెడు ఖర్చు. మరెందుకీ ప్రయాస అనే ప్రశ్న రావచ్చు. దీనికి జవాబు చెప్పినా అది అభిరు చుల విలువ తెలిసినవారికే అర్థమవుతుంది.
అభిరుచే కలిపింది…. నడిపింది ఈ ఇద్దరు మిత్రుల పరిచయం నిన్నామొన్నటిది కాదు. నాగభూషణరావు కాకినాడ నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడినవారు. శేషతల్పశాయి స్వస్థలం తెనాలి. హైదరాబాదు జె.ఎన్.టి.యులో బి. టెక్. చదివినపుడు మొదటిసారి కలిశారు. సాహిత్యం పట్ల అనురక్తి, భాషపై ప్రేమ… ఇలా ఉమ్మడి అభిరుచులు వారి మధ్య స్నేహానికి వంతెన వేశాయి. కళాశాల దాటారు. సాఫ్టువేరు ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ముప్పైయేళ్లయినా ఆ అభిరుచులు మాత్రం అలాగే నిలిచాయి. నిలవడమే కాదు, ఊడలు వేసి పాతుకుపోయాయి. ఏదో చేయమని పురికొల్పాయి. ఫలితమే ‘ఆంధ్రభారతి’, ఈ వెబ్ సైటు ఆలోచన 1998లో వచ్చింది. ప్రాచీన తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ రచనల్ని ఒక నెలవుకు చేర్చాలనుకున్నారు. తెలుగు నిఘంటువుని ఆంతర్జాలం వాడే వారందరికీ అందుబాటులోకి తేవా అనుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఇంకేమైనా జరిగాయా అని వెతికారు. తెలుగులో ఏమీ దొరకలేదు.

అడ్లూరి శేషుమాధవరావు నడుపుతున్న వెబ్ సైటు ఒకటి ఉంది. అందులో కొత్తగా చేర్పులేమీ లేవు. తమిళంలో మాత్రం ప్రాజెక్టు మధురై’ అనే ఒక వెబ్ సైటు తారసపడింది. అందులో ప్రాచీన తమిళ సాహిత్యం అంతా టైపు చేసి ఉంచుతున్నారు. కావాలనుకున్నవారికి వాటిని పుస్తక రూపంలో దించుకునే అవకాశం ఉంది. ఈ ప్రయత్నమూ, దీనికి తమిళుల నుంచి లభిస్తున్న తోడ్పాటు చూసి మిత్రులిద్దరూ ఉత్తేజితులయ్యారు. ఇలాంటిది తెలుగులోనూ ప్రారంభించాలని నడుంబిగించారు.
జులై 2001లో ‘ఆంధ్రభారతి.కామ్’ పేరు నమోదు చేశారు. పుస్తక దుకాణాల్లో పాత సాహిత్యం కొంత కొన్నారు. ఒక్కొక్కటిగా ఎక్కించడం మొదలు పెట్టారు. మొదట్లో గ్రంథాల టైపింగు వీరే చేశారు. దిద్దుబాట్ల బాధ్యత కూడా వీరిదే, వృత్తి జీవితం లోంచి మిగుల్చుకున్న సమయాన్నే దీనికి ఖర్చు పెట్టారు. ముందుకు సాగే కొద్దీ ప్రయత్న విస్తృతీ పెరిగింది. పని పెరగడంతో టైపింగుకు బయటివారి సాయం తీసుకోవడం ప్రారంభించారు. నిఘంటువుల చేర్పు ఈ సైటులో నిఘంటు సదుపాయం కల్పించాలన్నది మొదట్నించీ ఉన్న ఆలోచనే. కాని ఇన్ని నిఘంటువులు చేరతాయని అప్పట్లో అనుకోలేదు. ‘శబ్దరత్నాకరం’ ఒకటే పెడదామనుకున్నారు. ‘డిక్షనరీ. కామ్’ అనే ఇంగ్లీషు సైటు చూశాక ఆలోచన మారింది. అది ఒక పదానికి వేర్వేరు నిఘంటువుల్లో ఏ ఆర్థాలున్నాయో అన్నింటినీ చూపిస్తుంది. తెలుగుకి కూడా ఇటు వంటి సదుపాయం కల్పించాలన్న ఆలోచన వచ్చింది. శబ్దరత్నాకరం, రెండు బ్రౌన్ నిఘంటువులు, బూదరాజు ఆధునిక వ్వవహార కోశము – ఈ నాలుగింటితో ప్రారంభించారు. నెమ్మదిగా ఒక్కో నిఘంటువు జత చేస్తూ వచ్చారు. ఇపుడు మొత్తం పదహారు నిఘంటువులు సమకూ రాయి. ఇవి గాక, మరో ఇరవై టైపింగ్ పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. దిద్దుబాటు పని జరుగుతోంది. ఇంకో పది నిఘంటువులు టైపింగ్ దశలో ఉన్నాయి.

శ్రమ పంచుకునేవారు కావాలి…
‘ఆంధ్రభారతి’కి కార్యాలయమంటూ లేదు. టైపు చేసేవారు, ప్రూఫులు దిద్దేవారు… వీరంతా తమ తమ నివాసాల నుంచే పనిచేస్తారు. టైపు చేసేవారిలో హైదరాబాదు వారే కాదు, విజయవాడ, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏడెనిమిది మంది ఈ పని చేస్తున్నారు. దిద్దుబాటు పని ఇద్దరు తెలుగు పండితులు చూస్తున్నారు. దిద్దేవారు తగినంతమంది లేకపోవడం వల్ల పని ఆలస్యమవుతోందంటు న్నారు శాయి. “అదీగాక, మాకు ప్రూపులు దిద్దేవారు పండితులే గాని, సాంకేతిక అవగాహన లేనివారు. వారు పేపరు మీద దిద్దుతారు. దాని ఆధారంగా మళ్లీ ఎవరో ఒకరు కంప్యూటర్ మీద సరి చేయాలి. దీని వల్ల పని జాప్యం అవుతోంది. ఎవరన్నా అవగాహన అభిరుచి ఉన్నవారు ముందుకొస్తే సహాయకారి అవుతుంది. ఒక్క దిద్దుబాట్ల కోసమే కాదు. ఈ పని మీద ప్రేమ ఉండి, మాలాంటి శ్రద్ధ ఉన్నవారు మరో ఇద్దరు దొరికితే చాలు, ఎంతో పని చేయగలం.” అంటున్నారు.

తెలుగు భాషాభూషిత సేవకులైన వాడపల్లి శేషతల్పశాయిగారికి వారి మిత్రులు నాగభూషణరావుగారికి అభినందనలు తెలియజేస్తుంది 64కళలు.కాం పత్రిక.
_____________________________________________________________________
ఇక మీకు ఎలాంటి తెలుగు పదాలకు అర్థాలు కావాలన్న https://andhrabharati.com/dictionary చూడండి.

1 thought on “‘ఆంధ్రభారతి’ రూపకర్త శేషతల్పశాయి

  1. ఆంధ్రభారతి తెలుగు భాషకు, తెలుగు వారికి కలిగిన అయాచితవరం, ఇది కొన్ని సాంకేతిక సమస్యల వలన ఈ మధ్య కాలంలో కొన్ని పరికరాలలో పనిచేయడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap