“ఆంధ్రగీతి” తెలుగు భాషా జాగృతి

“ఆంధ్రగీతి” తెలుగు భాషా జాగృతి”, స్మృతిగీతి, శ్రీ మండలి వెంకట‌కృష్ణారావు గారి సంస్మరణగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రచురణ చేసిన కవితల సమాహారం. కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రధాన కార్యదర్శి జి.వి.పూర్ణచంద్ గారు రచించిన వచన గాన కావ్యం. స్మృతి గీతితో మొదలైన ఈ పుస్తకం తెలుగు భాషా పరిమళాలను వెదజల్లే పూల సమాహారం అనవచ్చు. 7 అధ్యాయాలు కల ఈ పుస్తకంలో డా. మండలి బుద్ధ ప్రసాద్ గారు, శ్రీ విహారి గారు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు, డా. గుమ్మా సాంబశివరావు గారు, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు ఆప్త వాక్యంగా ముందు మాటలు వ్రాసారు.

ఉపక్రమణిక జి.వి.పూర్ణ చంద్ గారు వ్రాసారు. కేవలం దీర్ఘ కవిత మాత్రమే కాదు, “భాషా గౌరవం-మన అస్తిత్వం” అనే నినాదంతోనే తెలుగు ఆత్మ మేల్కొంది. అని మండలి బుద్ధప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు.
శ్రీ విహారి గారు ‘కీర్తి కేతనం-ఆర్తి నికేతనం’ అజరామరమై నిలిచే కావ్యం ఆంధ్రగీతి అన్నారు. అసలైన తెలుగు సంస్కృతిని అణువణువునా జీర్ణించుకొని, ఆచరణ సాధ్యం చేసి చూపిన ధన్యజీవి మండలి వెంకట కృష్ణారావు గారు అని వ్రాసారు.
ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు నిలువుటద్దం లో తెలుగు భాష-దశ,దిశ అన్నారు. 4 దశాబ్దాల కాలంలో తెలుగు భాషా, సంస్కృతి, అస్తిత్వ స్పృహతో ఎన్నో కవితలు వచ్చాయి, ఆ తానులో పోగు డాక్టర్ జి.వి.పూర్ణచంద్ గారి నుంచి వచ్చిన “ఆంధ్రగీతి”అనే దీర్ఘ కవిత అన్నారు. కావ్యంలో వేద ప్రసక్తి విరివిగా వస్తుంది అన్నారు. భాషా ప్రాచీనత గురించి కవికి భాషా శాస్త్రవేత్తల కన్నా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి అంటారు.

“కొమ్మలకు వేలాడే తేనె పట్టులా అవుపిస్తాయి
అడ్డగీతను అంటి సాగే దేవనాగరి అక్షరాలు
మంచి ముత్యపు రాశులు దొర్లి నోట్లు
సుడి వేసిన బొమ్మరిల్లు లా
తీరి ఉంటాయి తెలుగు అక్షరాలు”
ఈ కావ్యంలో చరిత్ర, విశ్వాసం కలగలిసి ఉంటాయి.
“సంస్కృత ముత్యాల హారంలో మధ్య మణి తెలుగు”.
“ఆంధ్ర ద్రవిడాది జాతులెందరో అరసిన అందరి పదాల కలబోతే ఆంధ్రము”
బోధిసత్వుని వెలుగు మురియక ముందే
కన్నడ మరాఠీ తెలుగు మూలధ్వనులు
ఒకే ఊపిరితో పలికిన గొంతుక లానాడు
ఆంధ్ర మాతృకకు ‘అక్షర సంతకాలు’ అవన్నీ”.
“అంధక శబ్దం నుంచి ఆంధ్ర అనే పదం పుట్టింది” అని గుర్తించారు.

గుమ్మా సాంబశివరావు గారు ఆంధ్ర గీతి తెలుగు కవితలు ఇంద్రధనుస్సు అన్నారు.
సప్తస్వరాలు పల్లవించిన ఆంధ్ర గీతి అన్నారు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు
“క్షీర కన్య కు చల్ల పురుషుడితో పెళ్లి” చేసిన అద్భుతమైన ఊహ ఈ కావ్యంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది అంటారు. ఈ తరహాలో ఇదే తొలి గ్రంధం, మలితరానికి ఆధార గ్రంధం, ఆలపించండి ఆంధ్ర గీతి అన్నారు.

“తెలుగమ్మా….! నీకు వందనాలు ఆంధ్ర మాతా…మంగళ గానాలు” అంటూ శుభారంభం చేశారు.
“నీ పాటలు మ్రోయు తుమ్మెద నాదాలు
నీ మాటలు మందార మకరందాలు”
అంటూనే “అన్నమయ్య ఆలాపనే నీ శ్వాస,
త్యాగయ్య గానమే నీ ధ్యాస”
“మంగళంపల్లి స్వరమే నాద సారంగం
ఘంటసాల గానమే రసగంగా తరంగం”
అంటూ తెలుగు భాషా వైభవం ఎంతటి ప్రసిద్ధుల
గొంతులో నిండుగా పలికింది చెపుతూ ప్రశంశలు చేశారు.

నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన కావ్యాలు పద్యధార రూప వైభవం కొనియాడారు. “సోమన ద్విపదలు,వేమన నిత్యధర్మాలు తెలుగు భాషా వైభవం సాంస్కృతిక చిహ్నాలు.”
స్వేచ్ఛగా సాగే మాటలే జీవం. శాస్త్ర మైనా, కవిత్వం అయినా, సామాన్యుని బాస అయినా తెలుగు భాషా సౌందర్యం, అనుభవ జ్ఞానం.
కొత్త పదాలను అంగీకరించారు ఆనందంగా తెలుగు తల్లీ అంటారు కవి. “అక్షరమే ఆత్మ గా పదమే జ్ఞాన దీపంగా ఆంధ్రగీతి పాడుదాం. ఆత్మ గర్వంగా”. భాష అంటే సమాచార స్రవంతి. అచ్చ తెలుగు పదాలు జాజివన పరిమళాలు.
‘శ్రీ గంధపు జారీ అంచులు అల్లుకుని తెలుగు దనం మెరిపించే పంచెకట్టు పైన, వెన్నెల చొక్కాయి తొడుక్కుని పదబంధ పారిజాతాల తేరుపై వచ్చాడు’ అంటారు.

శబ్దం నుండి శాస్త్రం దాకా, సంకేతం నుండి సంభాషణ దాకా
బోధన నుండి భావన దాకా భాషా పరిమళాలను తెలుగు స్వర తేజం.
భాషాభిమానం పలికిన ప్రణవ నాదం అన్నారు.
“పలికిన ప్రతి పదమూ ఓ మంత్రోచ్ఛారణ మే
ప్రతి అక్షరం వేదగానమై స్పందించింది” అని భాషా వైభవం చాటారు.
“ఒక శబ్దం హృదయపు గవాక్షాన్ని తాకగానే
ఆలోచనల మేఘం వాక్యమై వర్షిస్తుంది.”
“నుడి అమ్మ గుండె సవ్వడి,
తేనె పలుకులు హరివిల్లు.”
“భాషకు ఎగ్గు తలపకు- ఒగ్గు కాదు”
“పలుకులు. తేజమే జాతి ఔన్నత్యం చాటేది.”
తెలుగన్న తన పేరన్నారు యయాతి చరిత్ర వ్రాసిన కవి.
శుద్ధాంధ్ర కవిని అన్నారు ఆడిదము సూరన్న గర్వంగా.
జాను తెనుగు కావాలన్నారు కవిత కు పాల్కురికి సోమనాథుడు, జనం కవి.
“ఒక భాష వేల పదాలుగా విరబూసింది
ఒక్కమాట చైతన్య జ్వాలగా ఎగసి
లోకమంతా వెలుగులీని వికసించి నట్టు,”
ఈ భావం భాషా సౌందర్య వైభోగాన్ని చెపుతుంది కదా!
“ఆమె భాష మనకో జావళి
పాలలోంచి నీళ్ళను వార్చే మరాళి
నిజానిజాల మధ్య నడిచే నిశ్శబ్ద రవళి
జ్ఞానం తో అల్లిన మాటల తారావళి”
ఇందులో కవి ఊహే కాదు, అంత్య ప్రాస అందం కనిపిస్తుంది.

‘వాల్మీకి కౌసల్య ను మహాంధ్రీ ‘అని సంభోధించాడట.
“శబ్దాలే శ్వాసలు, పదాలే నాడీ ప్రవాహం, వాక్యాలే
రక్తకణాలు, భావాలే రస ధాతువులు,
భాషా శరీరం సజీవ భావ రూపం
ప్రతి పదమూ ఓ హృదయ గానం”
అని భాషను శరీరంతో పోల్చటం లో
కవి వైద్యులు అని చెప్పక చెబుతుంది.
‘తెలుగు వాక్యాల తామర కొలను లో ఆంగ్ల పదం
ఒక సందర్శకుడు’ అంటారు.

“సంధి కుదిరితే శబ్దం అలరిస్తుంది” అంటారు కవి.
భాష లో మాండలిక శోభ చెపుతూ అమ్మ తో పోల్చటం సముచితంగా ఉంది. పల్లె బాస అమ్మ కదా అవును.
‘పల్లె గీత యాత్ర పదాలు పల్లకీ లలో పలికిన గానం
మౌనం భావాలను తాకిన విశ్వ విపంచి.’
‘అగ్ని కోణాలు చెకుముకులు, ఒరుసుకుంటే
అంటుకునే దీపం శిఖలు’ ఇందులో జానపద జాణ తెలుగు గొప్పదనాన్ని గురించి వర్ణించారు.
‘ఆరుసార్లు పొంగి చల్లారిన పాలు… తెలుగు లో అచ్చమైన పేరు ఆనవాలు.’
ద్రావిడ భాషా మూలపుటమ్మ ఇచ్చిన కమ్మని పదం పాలు.
శాస్త్రం దూరమైనా పదాలే దారులు చూపిస్తాయి అంటారు రచయిత.
‘వ్యామోహపు ఉప్పెనల అలజడి లో అక్షరపు దీపం స్తంభం
దీక్ష గా దారి చూపింది అంటారు రచయిత.

“మార్పులు మెరుపులు మెరిసే వేళ, కొత్త కంఠాలు గొంతెత్తి సందడిస్తే
స్వరమై రసమై భాష మురిసే వేళ మేల్కొలిపే ఆలోచనలు
ఎగసెత్తే సమయాన, మౌనం అనర్గళ గళం గా మారిన సమయాన, స్వర రేఖలు ఆశగా ఉదయించాయి.”
తెలుగు కోసం పరితపించిన పి.వి. నరసింహారావు గారు, మండలి వెంకట కృష్ణారావు గారు, నందమూరి తారక రామారావు గారు తరువాత మనిషే లేడిప్పుడు అంటూ వ్యధ చెందారు రచయిత.

సాంకేతిక పరిజ్ఞానం కోసం కూడా తెలుగు పదాలు ఉండాలి అంటారు, సంస్కృత పదాలను అరువు తెచ్చుకుని, తెలుగు చేసే కన్నా, ప్రజా సమూహాల నోటి నుంచి వాడుకలోకి వచ్చిన పదాలు తీసుకోవటం మేలు అంటారు.
తెలుగు భాషా మాతను సాంకేతిక పదాలను తనలో చేర్చుకోమని కోరతారు రచయిత.‌ మార్పులను అంగీకరించి, ఆధునిక పదాలను, తెలుగు లో చేర్చమని, ప్రజా నానుడి లో ఉన్న పదాలే మేలని చెప్పారు. పాత పదాలు పోయినవి పోగా తెలుగు భాష ను బ్రతికించటానికి మార్పు లను అంగీకరించి, సాంకేతిక పదాలు, ప్రజాబాహుళ్యంలో ఉన్న వాడుక పదాలు చేర్చి తెలుగు భాష ను బ్రతికించటానికి కృషి చేయాలని రచయిత తీవ్రంగా కోరుతున్నారు.

‘ఒక్క మాటైనా బతికిన చాలును ఆమె ఉనికి నూరేళ్ళు నిలిచి తీరును.’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
చక్కని భావావేశం తో కూడిన రచన, మండలి వెంకట కృష్ణారావు గారి స్మృతి గీతి గా కలకాలం నిలిచేను ఈ”ఆంధ్రగీతి” అని తప్పక చెప్పవచ్చు.

మన తెలుగు భాషా వైభవం సౌందర్యం, సంస్కృతి అస్తిత్వ సంపద సాహిత్యం కలకాలం నిలవాలని కోరుకుందాము. అందరూ చదివి మెచ్చే పుస్తకం అని చెప్పవచ్చు.

-సిరిపురపు అన్నపూర్ణ

ప్రతులకు :
ఆంధ్రగీతి” తెలుగు భాషా జాగృతి,
పేజీలు 148, వెల: రూ. 200/-
కృష్ణాజిల్లా రచయితల సంఘం
చరవాణి: 9440172642 / 9440167697

Share via
Copy link
Powered by Social Snap