సంగీత సాగరంలో ఓ బుడతడు ‘ఆవిర్భవ్’

ఈ బుడతడు పాడే పాటలు వింటే ఎంత చికాకులో ఉన్నా ఒక్కసారిగా ప్రశాంతత దొరికినట్టు అవుతుంది. అవిర్బవ్ నోట పలికే రాగాలు వింటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే సరిగమలు నేర్చుకున్నాడా? అనిపిస్తుంది. అంతెందుకు నేషనల్ ఛానెల్లో ప్రసారం అవుతున్న సింగింగ్ టాలెంట్ షోలో పాట పాడితే.. ఆ షో జడ్జి ‘ప్రపంచంలోని ఎనిమిదో వింత’ అంటూ అవిర్భవిని పొగిడిందంటే అతనిలోని పాటల టాలెంట్ గురించి చెప్పాలంటే మరో పాటను వెతుక్కోవాలి.

సరిగమప లిటిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ ఫాలోవర్స్కి అవిర్బవ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన రెండేండ్ల వయసులోనే అంటే 2018లో జీటీవీ తెలుగులో ప్రసారమైన ‘సరిగమప…’ షోలో అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. ఆ షోలో పాల్గొన్న కేరళ, కొచ్చికి చెందిన చిన్నారి అనిర్విణ్య తమ్ముడే అవిర్భవ్. ఆ షోలో యాంకర్ “నీ పేరు ఏంటి?” అని అడిగితే… ‘అవా…ఫో’ అంటూ ముద్దుగా సమాధానం చెప్పాడు. పేరు కూడా సరిగ్గా పలకడం రాని టైంలోనే టీవీ షోలో పాడాడంటే మామూలోడు కాదు.

అవార్డు కూడా..:
అవిర్భవ్ మాట్లాడే ముద్దు ముద్దు మాటలకు ఆ షోలో ఉన్నవాళ్లంతా హాయిగా నవ్వుకున్నారు. అవిర్భవ్ ‘సరిగమప’లో కంటెస్టెంట్ కాకపోయి నా.. పిల్లోడి టాలెంట్ వల్ల అప్పుడప్పుడు పాటలు పాడే అవకాశం దక్కింది. ‘సరిగమప లిటిల్ ఛాంపియన్స్ గ్రాండ్ ఫినాలే’ టైంలో అవిర్బవ్ ‘నాని’ సినిమాలోని ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’ పాట పాడాడు. అప్పుడు అక్కడున్న జడ్జిలు అంతా మెచ్చుకున్నారు. ‘భగవంతుడు లాలిపాట పాడితే ఇలా ఉంటుందేమో’ అంటూ పొగిడారు. అంతేకాదు.. రెండేండ్ల వయసులోనే ‘సరిగమప’లో బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డ్ కూడా అందుకున్నాడు. అయితే.. అప్పుడు తెలుగువాళ్ల ను అలరించిన ఈ బుడతడు ఇప్పుడు సోనీ ఎంట ర్టైన్మెంట్ టెలివిజన్లో వస్తున్న ‘సూపర్ స్టార్ సింగర్-3’లో పాడి దేశవిదేశాల్లో ఉన్న సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాడు. మరో ప్రత్యేకత ఏంటంటే.. రెండేండ్ల వయసులో సరిగమపలో పాడేంతవరకు ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. అక్క అనిర్విణ్య గురువుగా నేర్పిన పాటలే పాడాడు. అక్క పాడుతుంటే ఆమె ఒళ్లో కూర్చొని ఎనిమిది నెలల వయసు నుంచే సరిగమప అంటూ సంగీతాన్ని పలకడం మొదలుపెట్టాడు. అంటే.. అక్కే అతనికి మొదటి గురువు. వాళ్లిద్దరూ కలిసి పాటలు పాడుతూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అవి వైరల్ అవుతుంటాయి. చిన్న పిల్లలు పలకలేని చాలా పదాలను చాలా ఈజీగా పలుకుతాడు అవిర్భవ్.

మెచ్చుకున్న ఉదిత్ :

ఈ మధ్య ఒకసారి సూపర్ స్టార్ సింగర్-3 షోకి స్పెషల్ గెస్టుగా మెలోడీ కింగ్ ఉదిత్ నారాయణ్, అతని భార్య దీపా నారాయణ్ వచ్చారు. ఆ స్పెషల్ ఎపిసోడికి ‘ఉదిత్ నారాయణ్ మాస్టర్ క్లాస్’ అని పెట్టారు. అందులో ఆయన పాడిన పాటలను కంటెస్టెంట్లతో పాడించి ఉదిత్కి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్లో కూడా ఏడేండ్ల అవిర్బవ్ హైలైట్గా నిలిచాడు. “హమ్ దిల్ దే చుకే సనమ్” సినిమాలోని “చాంద్ చుపా బాదల్ మే” అనే పాట పాడాడు. అవిర్భవ్ పాడే విధానం చూసి, అతని గొంతు విని అందరూ ఆశ్చర్యపోయారు. “ఇంత చిన్న వయసులో అవిర్భవ్ చాలా బాగా పాడాడు. ఇంత ఎమోషన్తో ఈ పాట పాడడానికి నాకు చాలా ఏండ్లు పట్టింది. చాలా ఫీల్తో పాట పాడావు” అంటూ ఉదిత్ నారాయణ్ అవిర్భవ్ సింగింగ్ స్టయిల్ని మెచ్చుకున్నాడు. దీపా నారాయణ్ అయితే “నాకు మాటలు రావడం లేదు. నువ్వు చాలా అందంగా పాడావు. ఉదితే కంటే కూడా బాగా పాడావు”అంటూ మెచ్చుకుంది. ఇక జడ్జి నేహా కక్కర్ “అవిర్బవ్ ఏడేళ్ల వయస్సులోనే అద్భుతమైన ఎమోషన్, ఎక్స్ప్రెషన్, పాటని ఒక్కచోట చేర్చావు. ఏడేండ్ల పిల్లాడు ఇదంతా చేశాడనే నిజాన్ని నమ్మడం చాలా కష్టం. ప్రపంచంలో ఇప్పటివరకు ఏడు అద్భుతాలు ఉన్నాయి. కానీ అవిర్భవ్ ఎనిమిదో అద్భుతం” అంటూ పొగిడింది. ఏడేండ్లకే ఇంతగా పాడుతున్నాడని ఆశ్చర్యపోని మనిషి లేరంటే అతిశయోక్తి కాదు. ఉత్తర భారతంలో అవిర్భవ్ హెయిర్ స్టయిల్ కూడా ట్రెండింగ్ అవుతోంది. ఆ విషయాన్ని ఒక షోలో వీడియో వేసి మరీ చూపించారు.

అక్క(అనిర్విణ్య) తమ్ముడు (అవిర్భవ్) తో కలిసి నిర్వహిస్తున్న Anirvinhya & Avirbhav యూట్యూబ్ ఛానల్ కు ఎనిమిది లక్షల మంది సబ్ స్క్రైబర్స్ వున్నారు.
ఈ బుడతడి పాటలు ఇక్కడ వినవచ్చు: https://www.youtube.com/watch?v=siXR5d6t9kk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap