అంజని శ్రీత నాట్యం అదరహో!

అన్ని కుదిరితే అద్భుతాలు జరుగుతాయి. అదే జరిగింది ఆదివారం హైదరాబాద్, రవీంద్రభారతిలో సంగిరెడ్డి అంజని శ్రీత కూచిపూడి రంగప్రవేశం కనుల పండుగా... ఆ అమ్మాయి అందమైన శిల్పంలా ఉంది. నాట్యం 15 ఏళ్ళుగా నేర్చుకుంటోంది. అద్భుత సాధన చేసినట్లుంది. వాయిద్య సహకారం మరో అద్భుతం. బసవ రాజు రంగోద్దీపనం అదనపు ఆకర్షణ… వెరసి అంజని నాట్యం అదరహో అనిపించింది.
ప్రముఖ నర్తకీమణి, నాట్య గురు డాక్టర్ అలేఖ్య పుంజాల శిష్యురాలు అంజని శ్రీత ప్రదర్శించిన నాట్యాంశాలు కళాప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అరంగేట్రంలోనే క్లిష్టమైన అద్భుత అంశాలను ప్రదర్శించి ఔరా అనిపించింది. రెండు గబటలపాటు అవలీలగా అలుపు సొలుపు లేకుండా ఉల్లాసంగా వయ్యారంగా నర్తించిన తీరు చూపరులను విశేషంగా ఆకర్షించింది. త్రిష్ణ కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంగిరెడ్డి అంజని శ్రీత కూచిపూడి రంగ ప్రవేశం జరిగింది.

కామర్స్ లో పి.జి. పూర్తి చేసి ప్రస్తుతం చార్టెర్డ్ అకౌంటెన్సీ చేస్తున్న అంజని శ్రీత తొలిసారి సోలో ప్రదర్శనతో ముందుకు వచ్చారు. రుద్రమదేవి, మండోదరి నృత్య రూపకాల్లో తనదైన గుర్తింపు పొందారు. మహా గణపతిని స్తుతిస్తూ తన నాట్య ప్రదర్శనను ప్రారంభించి నాట్యం పై తనకున్న భక్తి ప్రేమను చాటి చెప్పారు. గంభీరవాణి రాగం లో అలేఖ్య సమాకూర్చిన త్యాగరాజ కృతి ‘సదా మదిన’కు ఎంతో వయ్యారంగా కోమలంగా ప్రదర్శించారు. అలాగే నాట రాగంలో జగదానంద కారక, రాగమాలికలో డాక్టర్ కె. ఉమా రామారావు రూపొందించిన మహాశక్తి అంశాలకు అంజని ప్రదర్శించిన అద్భుత హావ భావ గ్రీవాభినయ నాట్యానికి ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో పులకించిపోయారు. కృష్ణం కలయా సఖీ, ఎందాక నే జూతు, చివరగా ఫరాజ్ రాగంలో తిల్లానా ప్రదర్శించి అంజని శ్రీత అభినందనలు అందుకున్నారు.

సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన గురు పూజ సభలో ప్రముఖ నర్తకీమణి పద్మభూషణ్ స్వప్న సుందరి (ఢిల్లీ), కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళాకృష్ణ పాల్గొని అంజని శ్రీతను అభినందించారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ నాట్యం కొనసాగించాలని, నర్తకీమణిగా రాణించే సలక్షణాలు అంజనిలో ఉన్నాయని ఆశీర్వదించారు. నాట్య గురు అలేఖ్య గారు తనకు గొప్ప స్ఫూర్తి అని, అమ్మకు నాట్యం అంటే ప్రాణం అని, వీరిద్దరి ప్రభావంతో సంప్రదాయ కూచిపూడి నాట్యంపై మక్కువ పెంచుకున్నట్లు అంజని శ్రీత తెలిపారు. అలేఖ్యగారిని సాంప్రదాయ రీతిలో ఘనంగా సత్కరించి గురు భక్తిని చాటుకున్నారు.

నట్టువాంగం, నృత్య దర్శకత్వం శ్రీమతి అలేఖ్య పుంజాల చేయగా శ్రీ కె. చంద్రారావుగారు చక్కని గాత్ర సహకారం అందించారు. మృదంగంతో ఆర్. వినోద్ కుమార్, వయోలిన్ తో సాయి కుమార్, వేణువుతో రఘునందన్ రామకృష్ణ, వీణతో సాయి ప్రసాద్, పెర్కషన్ తో శ్రీధరాచార్య, డోలుతో నరేంద్ర కుమార్, నాద స్వరంతో మల్లికార్జున్ రసవత్తర వాద్య సంగీతంతో అంజని నాట్య ప్రదర్శనను రక్తి కట్టించారు. టెంపుల్ బెల్స్ కౌశిక్ రంగాలంకరణ, శ్రీవాణి వ్యాఖ్యానం సంపూర్ణతను చేకూర్చింది.

  • డాక్టర్ మహ్మద్ రఫీ
SA: