(ఫిబ్రవరి 23న భీమవరంలో అంకాల ఆర్ట్ అకాడెమీ-నూతన భవనం ఆవిష్కరణ)
తన నీటి రంగుల వర్ణ చిత్రాల ద్వారా దేశ-విదేశాలలో ప్రఖ్యాతి చెందిన చిత్రకారుడు అంకాల వెంకట సుబ్బారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1964 సం.లో ఆవిర్భవించిన సంస్థ అంకాల ఆర్ట్ అకాడెమీ. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రతీ సంవత్సరం చిత్రకళా పోటీలు నిర్వహిస్తూ ఎందరో ఔత్సాహిక చిత్రకారులను ప్రోత్సహిస్తూ… చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించింది.
భీమవరంలో తొలి చిత్రకళోపాధ్యాయులు:
అంకాల వెంకట సుబ్బారావు గారు (1901-1970) భీమవరంలో LVM హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తూ A.V.S. School of Arts సంస్థను స్థాపించి ఎంతో మందికి చిత్రకళలో శిక్షణ ఇచ్చి డ్రాయింగ్ పరీక్షలకు పంపించేవారు.
అంకాల వెంకట సుబ్బారావు గారు మొదట పాశ్చాత్య శైలిలో చిత్రరచన చేసేవారు. తర్వాత దామెర్ల రామారావు గారి పరిచయంతో సంప్రదాయ శైలిని అవలంభించారు. ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద వంగ శైలిని అధ్యనం చేశారు. వీరి చిత్రాలలో తులసీ దాస్, తక్షకుడు, శ్రీ మహా విష్ణువు, నాగార్జున ముఖ్యమైనవి.
అకాడెమీ అభివృద్ది:
1968 సం. నుండి 1981 వరకు 13 యేళ్ళపాటు భీమవరంలో మహేంద్ర ప్రెస్స్ యజమాని ఆకుల సత్యనారాయణ గారు అధ్యక్షులుగా, గోపా ఉమామహేశ్వర రావు (శ్రీ వాణి ట్యుటోరియల్స్ కాలేజి)గారు కార్యదర్శిగా మిగిలిన కార్య వర్గ సభ్యుల సహకారంతో అంకాల ఆర్ట్ అకాడెమీని ముందుకు నడిపించారు.
1981 సం. నుండి ప్రముఖ న్యాయవాది నూకల రామానుజ రావుగారి అధ్యక్షతన గోపా ఉమామహేశ్వర రావు గారు, చల్లా కోటివీరయ్య గారు (చిత్రకళ ఉపాధ్యాయులు), ఈడురి రామచంద్రరావు గారు(లెక్చరర్), పట్నాల భాస్కర్ (డ్రాయింగ్ టీచర్) గారు తదితర పట్టణ ప్రముఖుల సహకారంతో, కేంద్ర లలిత కళా అకాడెమీ, రాష్ట్ర లలిత కళా అకాడెమీల ప్రోత్సహంతో పదేళ్లకు పైగా కార్యక్రమాలు నిర్వహించారు.
48 ఏళ్ళ చరిత్ర గల అకాడెమీకి సొంత భవనం లేక పోవడం వల్ల ప్రతీ సంవత్సరం వార్షిక ప్రదర్శనలు, కార్యక్రమాలు ప్యాడి రైస్ మర్చంట్స్ అసోసియేషన్ లేదా భీమవరం మెడికల్ అసోసియేషన్ భవనాలలో నిర్వహించేవారు.
మూడు దశాబ్దాల కల:
1991 సం. భీమవరం మున్సిపల్ చైర్మేన్ గా వున్న సమయం లో కీ.శే. గ్రంధి వెంకటేశ్వరరావు గారు ఆనాటి కౌన్సిల్ సభ్యుల సహకారంతో వీరమ్మ చెరువుకు ఉత్తరం వైపు, మారుతీ టాకీస్ దగ్గరలో అకాడెమీకి స్థలం కేటాయించడం జరిగింది. దీనితో అకాడెమీ సబ్యుల మూడు దశాబ్దాల కల నెరవేరింది.
భవణ నిర్మాణ ధాతలు:
గోపా సత్యనారాణ ( గోపా ఉమామహేశ్వర రావుగారి కుమారుడు), న్యాయవాది నూకల రామానుజరావు గారు మరియు మరో 20 మంది ధాతలు భవన నిర్మాణానికి సుమారు 75 లక్షల రూపాయలు అందించి దశాబ్దాల కలను సాకారం చేశారు. కీ.శే. ఘంటా కృష్ణహరి నేతృత్వంలో ఈ భవన నిర్మాణం పూరయ్యింది.
ఈ రెండస్థుల భవనంలో శ్రీ నూకల రామానుజరావు – రంగ సుందరీ దేవి ఆర్ట్ స్కూల్, గోపా ఉమామహేశ్వరరావు ఆర్ట్ గ్యాలరీ విభాగాలు ప్రారంభంకానున్నాయి.
శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు, భీమవరం శాసన సభ్యులు గ్రంధి శ్రీనివాస్ గారు పాల్గొంటున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అకాడెమీకి సుధీర్ఘ కాలం పాటు కార్యదర్శిగా తన సేవలందించిన సీనియర్ చిత్రకారులు చల్లా కోటివీరయ్య గారిని సత్కరించనున్నారు. 18 సం. లోపు బాల-బాలికలకు ప్రముఖ చిత్రకారుడు కె. శ్రీనివాస్ గారి అధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.
–ఉదయ్ శంకర్ చల్లా