‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి అరవై యేళ్ళు

అన్నపూర్ణా పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు కు బెంగాలి సాహిత్యం పట్ల, బెంగాలి సినిమాలపట్ల ప్రత్యేక అభిరుచి, అభిమానం మెండు. ‘వెలుగునీడలు’ సినిమా కూడా 1956లో అసిత్ సేన్ నిర్మించిన బెంగాలి చిత్రం ‘చలాచల్’ ఆధారంగా నిర్మించిందే. ‘వెలుగునీడలు చిత్ర విజయం తరవాత మరో చిత్రం నిర్మించేందుకు దుక్కిపాటి మరలా బెంగాలి చిత్రసీమను ఆశ్రయించారు. మంగళ చట్టోపాధ్యాయ 1957లో నిర్మించిన బెంగాలి సినిమా ‘తాషేర్ ఘర్’ సినిమా దుక్కిపాటికి నచ్చింది. అలా ‘తాషేర్ ఘర్’ సినిమా హక్కులు దుక్కిపాటి కొనుగోలు చేశారు. ఈ చిత్రానికి డప్నే-డు-మారియర్ నవల ‘ది స్కేప్ గోట్’ కు దగ్గరి పోలికలు ఉండడంతో, ‘తాషేర్ ఘర్’ సినిమా కథకు సమూలంగా మార్పులు చేశారు. ‘తాషేర్ ఘర్’ చిత్రంలోని ప్రధాన పాత్రలను మాత్రమే తీసుకొని, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, సహకార దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్, సీనియర్ జర్నలిస్టు గోరా శాస్త్రి (గోవిందు రామశాస్త్రి), నిర్మాత దుక్కిపాటి తో కూడిన అన్నపూర్ణా చిత్ర యూనిట్ అనేక ఇతర పాత్రలను, సంఘటనలకు సృష్టిస్తూ నూతన కథకు రూపం కల్పించారు. ఆ చిత్రమే అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి ద్విపాత్రాభినయం చేసి సూపర్ హిట్ గా నిలిపిన ‘ఇద్దరు మిత్రులు’. ఈ చిత్రం 29, డిసెంబర్ 1961 న విడుదలై శతదినోత్సవం చేసుకుంది. అన్నపూర్ణా వారి తొలిచిత్రం ‘దొంగరాముడు’ (1955) నుంచి ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’, ’వెలుగునీడలు’ చిత్రాల్లో నాయికగా నటించి మెప్పించిన సావిత్రి కి ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో పాత్ర లేకపోవడం విశేషం. అయితే హైదరాబాద్ దీపక్ మహల్ లో జరిగిన శతదినోత్సవ వేడుకకు సావిత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుక కోసం నటీనటులు, సాంకేతికవర్గం మద్రాసు నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో రావడం విశేషం.

ఈ సందర్భంగా ఇద్దరుమిత్రులు చిత్రంలో “హలో హలో ఓ అమ్మాయి… పాత రోజులు మారాయి… ఆడపిల్ల అలిగినచో… వేడుకొనడు అబ్బాయి” పాట పుట్టుక గురించి చెప్పుకుందాం

అన్నపూర్ణా పిక్చర్స్ వారి రెండు చిత్రాలు ఒకే సంవత్సరం విడుదలయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 7, 1961 న ‘వెలుగునీడలు’ విడుదల కాగా సంవత్సరాంతానికి ‘ఇద్దరు మిత్రులు’ విడుదల చేశారు. వెలుగు నీడలు సినిమాకు పెండ్యాల సంగీతం సమకూర్చగా, ఇద్దరు మిత్రులు సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇద్దరు మిత్రుల్లో పాటలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఆరుద్ర రాసిన ‘హలో హలో ఓ అమ్మాయి’ పాటకు సంబంధించిన నేపథ్యం గురించి చెప్పుకోవాలి. ఈజిప్టులో పుట్టి పెరిగిన పాలస్తీనీయుడు బాబ్ అజ్జాం (అసలు పేరు వాడీ జార్జి అజ్జాం) అరవై దశకంలో మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతడు బాణీ కట్టి రికార్డుగా విడుదల చేసిన ‘యా ముస్తఫా యా ముస్తఫా అనవయే బడియా ముస్తాఫా’ అనే టర్కిష్ గీతాన్ని పారిస్ నగరంలో మొదట విడుదల చేశాడు. ఈ ‘ముస్తఫా ఆల్బం’ అటు ఫ్రాన్స్, ఇటు ఇంగ్లాండ్ లో అత్యంత ఆదరణ పొందిన ఉత్తమశ్రేణి ఆల్బంగా రికార్డు నెలకొల్పి, చాలాకాలం ప్రధమ ర్యాంకింగ్ ను నిలబెట్టుకుంటూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఇటాలియన్, ఇంగ్లీష్, గ్రీక్, సెర్బియన్ తదితర ప్రపంచ భాషల్లోకి అనువాదమై బాబ్ అజ్జాం కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. బాబ్ టర్కీ భాషలోనే కాకుండా, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జ్యూవిష్ భాషల్లో నిష్ణాతుడు కావడంచేత అన్ని భాషల్లోనూ అతడే ఈ పాటను అనువదించి ఆల్బంలుగా విడుదల చేశాడు. ఆ తరవాత బాబ్ అజ్జాం ఈ పాటను ఆలపిస్తూ ప్రపంచ పర్యటన చేసి జెనీవా(స్విట్జర్లాండ్)లో ఒక నైట్ క్లబ్ స్థాపించాడు. అనేక ఆల్బంలను విడుదల చేస్తూ మిలియనీర్ గా అక్కడే స్థిరపడ్డాడు. ‘యా ముస్తఫా’ పాటను ఈజిప్షియన్ నటుడు ఇస్మాయిల్ యాస్సిన్ తన సినిమాల్లో ఎక్కువగా పెట్టించేవాడు. వార్కొప్ అనే కామెడీ ట్రూప్ ఈ పాటను పేరడీగా మలిచి ‘మనా తహాన్’ అనే ఇండోనేషియన్ సినిమాలో జొప్పించింది. మెల్లగా ‘యా ముస్తఫా యా ముస్తఫా’‘ పాట ప్రభావం సాలూరు రాజేశ్వరరావు మీద పడింది. ఆరోజుల్లో అర్ధరాత్రి బి.బి.సి లో వచ్చే ఇంగ్లీషు, తదితర భాషల పాటల్ని క్రమం తప్పకుండా వినడం రాజేశ్వరరావుకు అలవాటు. ఆ పరంపరలో వినిన ‘యా ముస్తఫా’ పాట ట్యూను రాజేశ్వరరావుకు ఎంతగానో నచ్చింది. తొలుత ఈ ట్యూనును ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి ‘భార్యాభర్తలు’ (మార్చి1961) సినిమా టైటిల్స్ లో వాడుకున్నారు. తరవాత ఇద్దరు మిత్రులు సినిమా కోసం దుక్కిపాటి మధుసూదన రావుకు, అక్కినేనికి ఈ ట్యూను వినిపించి, ఆమోదం పొంది, అదే ట్యూనుకి ఆరుద్ర చేత ‘హలో హలో ఓ అమ్మాయి’ పాటను రాయించారు. చిన్నచిన్న మార్పులతో ‘యా ముస్తఫా’ పాటను వెస్టరన్ బీటుతో యుగళ గీతంగా మలచి ఘంటసాల, సుశీల చేత పాడించి మంచి హిట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు ఇ.వి. సరోజను ఆటపట్టిస్తూ పాడే ‘హలో హలో ఓ అమ్మాయి’ పాట యాభై ఐదేళ్ళు దాటినా ఇప్పటికీ నిత్యనూతనంగా వినవస్తూనేవుంది. అంతేకాదు ‘యా ముస్తఫా’ పాట బాలీవుడ్ మీద కూడా ప్రభావం చూపింది. 1962లో శక్తి సామంత నిర్మించిన ‘చైనా టౌన్’ సినిమాలో ‘యా ముస్తఫా’ బాణీని సంగీత దర్శకుడు రవి వుపయోగించుకున్నాడు. షమ్మికపూర్ క్లబ్ లో హెలెన్ తో డ్యాన్స్ చేస్తూ రఫీ పాడే ‘క్యా తేరీ మెహఫిల్ హై సనమ్ ఖో గయే హమ్ అల్లా కి కసమ్… హోయ్… మేరీ బహకీ ధున్ పే న జా సాథ్ మేరె తూ భీ గా…యా…దిల్ రుబా… యా.. దిల్ రుబా దిల్ కొ లే గయి తేరి అదా…’ పాటలో యా.. ముస్తఫా బాణీని చక్కగా వాడుకున్నారు. ఇదే సినిమాను 1969లో అట్లూరి పుండరీకాక్షయ్య తెలుగులో ‘భలే తమ్ముడు’ గా నిర్మించినప్పుడు సంగీత దర్శకుడు టి.వి. రాజు “గుమ్మా గుమ్మా గుమ్మ గుమ్మెత్తించే ముద్దుల గుమ్మా” పాటలో కూడా ఇదే బాణీని వాడుకున్నారు. మరలా 1994లో సంజయగుప్త దర్శకుడిగా పరిచయమైన ‘ఆశిష్’ చిత్రంలో నదీమ్-శ్రావణ్ ‘యా ముస్తఫా’ పాటను ‘ఓ మేరి మోహబ్బత్ కా తూ గవా కోయి’ అనే పాటలో ‘యా ముస్తఫా యా ముస్తఫా క్యా ముస్తఫా యా ముస్తఫా’ గా వాడుకున్నారు. అలా ‘యా ముస్తఫా’ పాట దశదెసలా వ్యాపించి ప్రాచుర్త్యాన్ని సంతరించుకుంది.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి అరవై యేళ్ళు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap