అక్కినేని నాగేశ్వరరావు ప్రాభవానికి మూలాధారమైన దుక్కిపాటి మధుసూదనరావు, సొంత సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పదలచి అక్కినేని చైర్మన్ గా, తను మేనేజింగ్ డైరెక్టరుగా సెప్టెంబరు 10, 1951న “అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” పేరుతో నూతన చిత్రనిర్మాణ సంస్థను యేర్పాటు చేశారు. దుక్కిపాటి తల్లి చిన్నతనంలోనే కాలంచేస్తే మారుతల్లి అతణ్ణి పెంచి పెద్దచేసింది. ఆమె పేరు ‘అన్నపూర్ణ’. ఆమె పేరుతోనే “అన్నపూర్ణా’ సంస్థ వెలిసింది.
నవయుగ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు, టి.వి.ఎ.సూర్యారావు, కొరటాల ప్రకాశరావు ఈ సంస్థలో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. కళాదర్శకులు టి.వి.యస్. శర్మ అజంతా శిల్పానికి ధీటుగా ఉండేలా ధాన్యలక్ష్మి రూపంలో వుండే చిహ్నాన్ని సంస్థ ‘లోగో’ గా తీర్చిదిద్దారు. తొలిప్రయత్నంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘దొంగరాముడు’ (1961)సినిమా నిర్మించి విజయాన్ని నమోదు చేసుకున్న అన్నపూర్ణా సంస్థ వరసగా ’తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించి ఒక ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగింది. ‘మాంగల్యబలం’ సినిమా విజయవంతంగా ఆడుతున్న రోజుల్లోనే దుక్కిపాటి తదుపరి సినిమా నిర్మాణానికి పునాదులు వేశారు. ఆ చిత్రమే ‘వెలుగు నీడలు’. ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా ఒకేసారి తమిళంలో కూడా ‘తూయ ఉళ్లం’(అర్థం: పవిత్ర హృదయం) పేరుతో నిర్మించి విజయం సాధించారు. ప్రతి మనిషి జీవితం వెనుక వెలుగు, చీకటి రెండూ వుంటాయని, వెలుగులో వున్నప్పుడు పొంగిపోయి, ఆ వెలుగు నీడను ఆవరించగానే భీరువై పోకుండా ధీరోదాత్తంగా ఎదుర్కొనాలని హితవు చెప్పే నేపథ్యంలో నిర్మించిన ఈ ఆదుర్తి మార్క్ సినిమా ఇది. 07 జనవరి 1961 న విడుదలై షష్టిపూర్తి చేసుకున్న ‘వెలుగు నీడలు’ చిత్ర విశేషాలు.
ఈ సినిమాలో అక్కినేని, సావిత్రి హీరో, హీరోయిన్ లు కాగా జగ్గయ్య, ఎస్.వి. రంగారావు, రేలంగి, పేకేటి, పద్మనాభం, సూర్యకాంతం, గిరిజ, సంధ్య, బేబీ శశికళ, టి.జి. కమలాదేవి సహాయక పాత్రలు పోషించారు. దుక్కిపాటికి ఎదురైన ఒక సంఘటన ఈ సినిమా కథకు నేపథ్యంగా అమరింది. దుక్కిపాటికి బాగా సన్నిహితంగా వుండే ఒక కుటుంబ దంపతులకు సంతు కలుగలేదు. వారు ఒక ఆడపిల్లను దత్తత తీసుకొని గారాబంగా పెంచారు. ఆ పాప వీరి ఇంటిలో అడుగిడిన వేళావిశేషమేమో వారికి సంతానప్రాప్తి కలిగి ఒక ఆడపిల్ల జన్మించింది. దాంతో పెంచుకున్న అమ్మాయిని వారు నిర్లక్ష్యం చేశారు. అదే స్పూర్తితో దుక్కిపాటి ఆచార్య ఆత్రేయతో సంప్రదించి కథను కూర్చి, ఏకాగ్రతకోసం ఆత్రేయను కేరళ లోని పీచీ ఆనకట్ట వద్ద వున్న హోటల్లో మకాం ఏర్పాటుచేసి, సహాయకుడుగా కె.వి. రావును తోడుగా వుంచి సంభాషణలు రాయించారు. ఆత్రేయ సంభాషణలు అర్ధవంతంగా, అద్భుతంగా అమరాయి. అందులో ప్రతి సంభాషణ ఒక ఆణిముత్యమే. కామెడీ ట్రాక్ ను ప్రముఖ నాటక రచయిత కొర్రపాటి గంగాధరరావు పూర్తిచేశారు. వైద్యవృత్తి నేపథ్యంలో కథ సాగుతుంది. అక్కినేని, జగ్గయ్య, సావిత్రి ముగ్గురూ వైద్యులే. ఈ వృత్తికి సంబంధించిన సాంకేతిక అంశాలకోసం డాక్టర్ శ్యామలారెడ్డి అనే వైద్యురాలి సలహాలు తీసుకున్నారు. ఆవిడ షూటింగ్ జరిగినన్ని రోజులు ఆసుపత్రి సన్నివేశాల చిత్రీకరణ సమయంలో స్వయంగా స్టూడియోకు వచ్చి సూచనలు ఇచ్చి సహకరించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే నిర్మాత డి.వి.ఎస్ రాజు తాతినేని రామారావు దర్శకత్వంలో ‘మాబాబు’ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆ సినిమా హిందీ మాతృక దేవేంద్ర గోయల్ నిర్మించిన ‘చిరాగ్ కహా రోషిణి కహా’ (1959) ను దుక్కిపాటి చూడడం జరిగింది. ఆత్రేయ రచించిన పతాక సన్నివేశాలకు హిందీ సినిమా పతాక సన్నివేశాలకు కొంత సారూప్యం వున్నదని గ్రహించిన దుక్కిపాటి ‘వెలుగు నీడలు’ చిత్ర క్లైమాక్స్ ను ఆత్రేయ చేత మార్పించి తిరగరాయించారు. ‘దొంగరాముడు’ చిత్రానికి సంగీతం సమకూర్చిన పెండ్యాల ఇతర సినిమాల పనిలో బిజీగా వుండడంతో, ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’ చిత్రాల సంగీత బాధ్యతలు అప్పట్లో మాస్టర్ వేణుకు అప్పగించారు. ‘వెలుగు నీడలు’ చిత్రంతో పెండ్యాల అన్నపూర్ణా సంస్థలో పునఃప్రవేశం చేశారు. ఆదుర్తికి హృషికేశ్ ముఖర్జీ స్పూర్తి. ‘’సినిమాలో దర్శకుడు కనిపించకూడదు. కానే ప్రతి ఫ్రేమ్ లోనూ దర్శకుడు ఉన్నాడనే భ్రమ కలిగించాలి’’ అనేది హృషికేశ్ ముఖర్జీ పద్ధతి. ఆదుర్తి కూడా తన సినీప్రస్థానంలో అదే పంధాను అనుసరించారు. ఇందులో అక్కినేని నాగార్జున నాగేశ్వరరావు- గిరిజ ల కుమారుడుగా, ‘’చల్లని వెన్నెల సోనాలు తెల్లని మల్లెల మాలలు’’ అనే పాట చిత్రీకరణలో చిన్న పాపడుగా కనిపిస్తాడు. పాట సాగుతూవుండగా మూడుచక్రాల సైకిల్ తొక్కుతూ కనిపిస్తాడు. ఆ పాత్రను సహాయదరసకుడు కె.వి. రావు రెండవ కూతురు ఛాయ పోషించింది. ఇందులో పద్మనాభం అక్కినేనికి కాలేజ్ మెట్ గా నటించాడు. ఈ మ్పాత్ర పద్మనాభానికి చల్లా విచిత్రంగా దక్కింది. వాహినీ స్టూడియో చూపించడానికి కొందరు నాటక కాంట్రాక్టర్లను పద్మనాభం తీసుకెళ్ళినపుడు కాకతాళీయంగా అక్కినేని, దుక్కిపాటి లను కలవడం జరిగింది. అదే స్టూడియోలో అప్పుడు ‘’కర్నూలు ఎక్కడా, కాకినాడెక్కడా’’ అనే పాటను ఆదుర్తి సుబ్బారావు చిత్రీకరిస్తున్నారు. వెంటనే దుక్కిపాటి పద్మనాభాన్ని మేకప్ చేసుకొని రమ్మన్నారు. ఆ గ్రూప్ సాంగ్ లో ప్రధాన పాత్రధారునిగా, తర్వాత సినిమా కు సహాయ దర్శకునిగా కూడా వ్యవహరించడం జరిగింది. ‘’సరిగంచు చీరగట్టి’’ అనే కొసరాజు పాటకు నృత్యం చేసిన ఇ.వి. సరోజ కు అన్నపూర్ణా వారు నిర్మించిన తదుపరి చిత్రం ‘ఇద్దరు మిత్రులు’ లో హీరోయిన్ పాత్ర లభించడం విశేషం. వెలుగు నీడలు సినిమా శతదినోత్సవ వేడుకలు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం పట్టణాలలో ఘనంగా నిర్వహించారు. విజయవాడలో శతదినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఈ చిత్రయూనిట్ విశాఖపట్నం వెళ్లాల్సివుండగా, వారికి రైలు తప్పిపోయింది. ఇక వేరే మార్గం లేక యూనిట్ సభ్యులు, అక్కినేని, సావిత్రితో సహా అందరూ నటీనటులు ప్యాసింజర్ రైలులో సాధారణ బోగీలో ప్రయాణం చేసి విశాఖపట్నం చేరుకున్నారు (అప్పట్లో విజయవాడలో విమానాశ్రయం లేదు).
తమిళ భాషలో…
అన్నపూర్ణా వారు వెలుగు నీడలు సినిమాను పవిత్ర హృదయం అనే అర్ధం వచ్చేలా ‘తూయ ఉళ్లం’ పేరుతో తమిళంలో సమాంతరంగా నిర్మించారు. అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు, సంధ్య, టి.జి. కమలాదేవి, బేబీ శశికళ తెలుగు, తమిళ వర్షన్ రెండిటిలో తమతమ పాత్రలు పోషించారు. తమిళ చిత్రానికి ప్రముఖ దర్శక నిర్మాత సి.వి. శ్రీధర్ సమకూర్చగా, ఉడుములై నారాయణకవి, కణ్ణదాసన్ పాటల సాహిత్యం సమకూర్చారు. రెండుభాషల్లోనూ పెండ్యాల సంగీత దర్శకత్వం వహించారు. తమిళ వర్షన్ జనవరి 14, 1961 న చెన్నై శాంతి థియేటర్ లో విడుదలైంది. కానీ పెద్దగా విజయవంతం కాలేదు. రెండు నెలల తర్వాత ఆ సినిమా హాల్ ను ప్రముఖ తమిళ హీరో శివాజీ గణేశన్ కొనుగోలు చేశారు. అక్కినేనికి శివాజీ మంచి స్నేహితుడు. దాంతో ‘తూయ ఉళ్లం’ చిత్రం అక్కడ శతదినోత్సవం చేసుకుంది.
అలరించిన పాటలు…
వెలుగు నీడలు సినిమాలో పెండ్యాల స్వరపరచిన పాటలన్నీ శాశ్వతకీర్తిని సంపాదించిపెట్టినవే. ఈ క్భిత్రంలో మొత్తం తొమ్మిది పాతలుండగా మహాకవి శ్రీశ్రీ ఆరు పాటలు, కొసరాజు రాఘవయ్య చౌదరి మూడు పాటలు రాశారు. శ్రీశ్రీ రచించిన అభ్యుదయగీతం ‘’పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయగీతికా’’ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవాలలో, గణతంత్ర దినా వేడుకలలో తప్పకుండా వినిపిస్తూనే వుంటుంది. ఈ పాటకు అక్కినేని, రాజసులోచన అభినయించారు. రాజసులోచన నాట్యం అద్భుతంగా వుంటుంది. తదనంతర కాలంలో నృత్య దర్శకుడుగా,నిర్మాతగా పేరుతెచ్చుకున్న కె.ఎస్. రెడ్డి గ్రూప్ డ్యాన్సర్ గా కనిపిస్తాడు. అత్యంత వెఃగంగా పాటలు రాసేవారని పేరు తెచ్చుకున్న శ్రీశ్రీ ఈ పాత రచనకు పదిహేను రోజులు వెచ్చించారు. పల్లవి శంకరాభరణ రాగంలో, ‘’పదవీ వ్యామోహాలు కులమత భేదాలు’’ అనే చరణానికి మాత్రం శివరంజని రాగాన్ని, మిగతా చరణాలకు మోహన రాగాన్ని పెండ్యాల వాడుకున్నారు. అన్నీ కాలమాన పరిస్థితులకు అడ్డంపడుతుంది ఈ పాట. ఆకాశవాణి సిబ్బంది ఈ పాటను ప్రసారం చేసేందుకు కొంతకాలం వెనుకంజవేసినా, తదనంతర కాలంలో ఈ పాట ఆకాశవానిలో విస్తృతంగా ప్రసారమైంది. శ్రీశ్రీ రచించిన మరొక పాట ‘’ఓ రంగయో పూల రంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో’’ను ఘంటసాల, సుశీల బృందం ఆలపించారు. అక్కినేని, సావిత్రి పడవ విహారం చేస్తున్నప్పుడు కూలిపనులు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్న శ్రమజీవులు పల్లవి పాడుతుంటే దాని కొనసాగింపు హీరో. హీరోయిన్లు గళం కలపడంతో ప్రశ్న, సమాధానాల ఈ పాట సాగిపోతుంది. ఇక ఘంటసాల ఆలపించిన శ్రీశ్రీ మూడవ పాట ‘’కలకానిది విలువైనది’’ తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోతగిన పాట. ఈ పాటతో సంబంధం వున్న ప్రతి ఒక్కరూ జీవితాంతం గర్వంగా ఈ పాటనుగురించి చెప్పుకోవాలి. పదసంపదకు, భావపరిణితికి అద్దం పడుతుంది ఈ పాట. పెండ్యాల నాగేశ్వరరావు ఈ పాటను పీలూ రాగచాయాల్లో స్వరపరచారు. ఈ పాటను అక్కినేని నాగేశ్వరరావు రేడియో స్టేషన్ రికార్డింగ్ రూమ్ లో పాడుతున్నట్టు చిత్రీకరించగా, సంగీత దర్శకుడు పెండ్యాల ఆ పాటను కండక్ట్ చేస్తూ కనిపించడం ప్రత్యేకత. అవకాశం దొరికినప్పుడల్లా తన సినీ గేయాల్లో మనసుకు హత్తుకొనే సూక్తులు, సందేశాలు, హితోక్తులు సంధించడం శ్రీశ్రీ నైజం. ఈ పాట ఆత్మహత్యకు పూనుకున్న ఒక యువకుని ఆలోచింపజేసి ఆ ప్రయత్నాన్ని విరమింపజేసి పూర్ణాయువును పోసింది. ఆ విషయాన్ని ఈ యువకుడు ఉత్తరం ద్వారా శ్రీశ్రీకి తెలపడం విశేషం. ఈ పాట ముక్తాయింపులో మనిషికి ప్రయత్నం ముఖ్యమని, ఏదీ తనంత తాను దరికిరాదని, శోధనతోనే సాధన సాధ్యమౌతుందని శ్రీశ్రీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. శ్రీశ్రీ రాయగా అక్కినేని, గిరిజ మీద చిత్రీకరించిన తొలిరేయి పాటను చంద్రుడి వెలుగు కిరణాలను వెండి దారాలతో పోల్చి గొప్ప ప్రయోగం చేశారు. కళ్యాణిరాగం బేస్ చేసుకొని స్వరపరచిన ఈ పాటలో అవసరమైనచోట పెండ్యాల యామన్ రాగాన్ని కలుపుతూ గొప్ప ఎఫెక్ట్ తీసుకొచ్చారు. చిత్రగుప్త సంగీతంలో వచ్చిన ‘నయా సంసార్’ ఇందీ సినిమాలో ‘’చందా లోరియా సునాయే’’ అనే పాటను పెండ్యాల స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘’చల్లని వెన్నెల సోనాలు తెల్లని మల్లెల మాలలు’’ అనే శ్రీశ్రీ పాటను సుశీల, జిక్కి ఆలపించగా బిడ్డ మీద వుండే మాతృహృదయాన్ని ఈ పాట గుర్తుచేస్తుంది. ఈ పాటకు పెండ్యాల వకుళాభరణ, చక్రవాక రాగాలను వాడుకున్నారు. ఇక చివరగా శ్రీశ్రీ రాసిన ‘’చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు’’ పాటలో అక్కినేని నాగార్జున చిన్న పిల్లవాడిగా ట్రైసికిల్ నడుపుతూ కనిపిస్తాడు. మోహనరాగంలో స్వరపరచిన ఈ పాట మనోహరంగా వుంటుంది. కొసరాజు రాసిన మూడు పాటలు …. హరికాంభోజి రాగంలో పెండ్యాల స్వరపరచిన ‘’శివగోవింద గోవింద హరి గోవింద గోవింద’’ పాటను మాధవపెద్ది, ఉడుతా సరోజినీ ఆలపించగా రేలంగి, బేబీ శశికళ, టి.జి. కమలాదేవి మీద చిత్రీకరించారు. రెండవది… ‘’కర్నూలు ఎక్కడ?, కాకినాడెక్కడ? ఏలూరు, సాలూరు, ఆలూరు ఎక్కడ?’’ పాటను మెడికల్ స్టూడెంట్లు పాడుకునే పాటగా చిత్రేకరించారు. అక్కినేనితోబాటు పేకేటి, పద్మనాభం, కొమ్మినేని శేషగిరిరావు, రామచంద్రరావు, తోబాటు కొందరు జూనియర్ కళాకారులు పాల్గొన్నారు. ‘’సరిగంచు చీరగట్టి, బొమ్మంచు రైక తొడిగి’’ కొసరాజు రాసిన సందేశాత్మక పాట.
–ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)