ప్రముఖ వాయులీన విద్వాంసులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామి గారి వందవ జన్మదిన (మార్చి 26 న)సందర్భంగా 64కళలు 2013 లో ప్రచురించిన వ్యాసం మరోసారి…. మీకోసం….
గురుశిష్య పరంపరకు ప్రతీక మన భారతదేశం – గురుశుశ్రూషలో శిష్యరికం మన భారతీయ సంప్రదాయం. ఇదే త్రోవలో నడచి స్వరాజన – స్వరార్చన చేసి ఖండాంతర ఖ్యాతి సొంతం చేసుకున్న శిష్య శిరోమణి సంగీత విద్వాన్మణి శ్రీ అన్నవరపు రామస్వామి నేటి రేపటి తరాలకు ఓ సజీవ ఆదర్శం!
అన్నవరపు రామస్వామి పశ్చిమగోదావరి జిల్లా, సోమవరప్పాడు గ్రామంలో 1926 వ సం.లో నాదస్వర విద్వాంసులైన పెద్దయ్య, లక్ష్మీదేవి దంపతులకు కర్ణాటక సంగీత నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించిన రామస్వామికి వీరి అన్నగారైన శ్రీ గోపాలం ద్వారా వయోలిన్ అభ్యాసానికి ప్రేరణ దొరకడం ఆ తదుపరి వీరి నేటి వికాసానికి ఓ వరం.
వరాలు-వారాలు: అన్నగారి ప్రోద్బలంతో, అమ్మానాన్నల ఆశీర్వచనాలతో సద్గురుని అన్వేషణలో లలితకళలకు కాణాచి అయిన విజయవాడ వచ్చిన వీరు గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి కృష్ణయ్య గారి ఇంట చేరి, వారాలు చేసుకుంటూ గురుశుశ్రూషలో సంగీత సాధనకు శ్రీకారం చుట్టారు. “ఆటపాటల వయసులోనే ఆటుపోటులన్నట్లు” వారాలన్నీ కుదరక తరచూ కుళాయి నీళ్ళతో కడుపునింపుకుని, పస్తులుంటూ, సప్తస్వరాలనే ఆహారంగా ఆరగిస్తూ…. గురువుగారి సంగీతగానం ఆలకిస్తూ, తానూ అలానే ఆలపిస్తూ వయోలిన్ వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించారు. తనకు అన్నంపెట్టి పుణ్యంకట్టుకున్న అనేకమంది అమ్మల చల్లని వరాలతో ఆ సప్తస్వరాలతో ఈ ఏడు వారాలను మలచుకొని, క్షణక్షణం తన లక్ష్యాన్ని మదిలో నిలుపుకుని అనుకున్నది సాధించి గెలిచి నిలిచాడు. ఆకలిదప్పులనధిగమించి విశ్వవేదికలను ఆక్రమించాడు. అమెరికా, అబుదాబి వంటి దేశ విదేశాల్లో పర్యటించి, తనకు మనకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. అమెరికా, కెనడా, యు.కె. ఫ్రాన్స్, దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలలో తన సహధ్యాయి, బాల్యమిత్రుడు అయిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కచ్చేరీలు చేశాడు.
అపరావీణాపాణికి పాణిగ్రహణం: తనకోసమే పుట్టినట్టి పోతునూరి రంగనాయకులు, మాణిక్యంల గారాలపట్టిని చేపట్టినాడ. వీరి అన్యోన్య దాంపత్యానికి ఆనవాలుగా వీరికి అరుణకుమారి, మహాలక్ష్మి అనే ఇరువురు ఆడపిల్లలున్నారు.
అనుకూలవతి అయిన ఇంతి ఇంగితం కారణంగా ఇంటి నిండా శిష్యసమేతంగా నిరంతరం సంగీతం.
పరమావధిగా తలచిన తన వయోలిన్ విద్యతో జీవనోపాధికై అవకాశంగా తలుపుతట్టగా, విజయవాడ ఆకాశవాణిలో నిలయ విద్వాంసునిగా చేరి కృష్ణవేణి తరంగాలతో కలగలిపి, కనకదుర్గమ్మ సాక్షిగా తన వయోలిన్ వాయిద్యంతో శ్రోతల్ని దాదాపు నాలుగు దశాబ్దాలు అలరించిన సప్తస్వర శబ్దశాసనుడితడు.
ఎంతో కొంత జీతం, ఎంతో సంతృప్తికర జీవితం.
ఆశయం-అవకాశం-అదృష్టం అన్నీ కలగలిపితే ఈ రామస్వామి అన్నవరం.
చదివింది 1వ తరగతి-సాధించింది అపూర్వ ప్రగతి!
ఈ యాంత్రిక యుగంలోనూ లక్షలాది శ్రోతలను తన వయోలిన్ వాయిద్యంతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ సంగీత మాంత్రికుడు జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, విజయలక్ష్మి పండిట్, పి.వి. నరసింహారావు వంటి మహామహుల ద్వారా వందలు, వేలు బిరుదులు సన్మానాలు, సత్కారాలు అందుకున్న అన్నవరం కేవలం 1వ తరగతి వరకే చదివిన నెంబర్‌వన్ స్టూడెంట్ అంటే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు.
ఆంధ్రదేశంలో తనకు ముందు తరంవారైన తిరుక్కోడి కావల్, తిరిచ్చి గోవిందస్వామి, ద్వారం వెంకటస్వామి నాయుడుగార్ల సంగీత వారసత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ఆ ఆసక్తితో తన శక్తిగా మలచుకుని నేటికీ దేశం నలుమూలలా పర్యటించి తన వయోలిన్ వాయిద్య జలధిలో శ్రోతల్ని ముంచి తేలుస్తున్నాడు.
వీరి ‘ఆశయం’: పదిమందికి ఉచితంగా గురుకుల సంప్రదాయ రీతిలో ఉచితరీతిన సంగీతం నేర్పించటం. అమెరికా వంటి దేశాలకు వెళ్ళి పలుమార్లు ఉచితంగా ప్రవాస భారతీయులకు సంగీతం నేర్పించారు.
పలువురు మహామహులతో చేరి కచ్చేరీలు: గాయక సార్వభౌమ, పారుపల్లి రామకృష్ణపంతులు, అరియకుడి రామానుజ అయ్యంగార్, భీమ్‌సేన్ జోషి, సమ్మాంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్. మహాలింగం, బాలమురళీకృష్ణ వంటి ఎందరెందరో ప్రముఖులతో కలిసి కచ్చేరీలు చేసిన రామస్వామి 2000 లకు పైగా కచేరీలు చేసి “వింశతి సంగీత సభా సరస్వతి” గా గెంతికెక్కినాడు.
ఈ సద్గురు చరణదాసుడు ఎ.వి.ఎస్. కృష్ణారావు, డా॥ ప్రపంచం సీతారామ్, పాటిబండ్ల జానకి, సతీష్, మోదుమూడి సుధాకర్ (శిష్యుల పేర్లు) వంటి మేటి శిష్ట శిష్య హృదయ వాసుడు.
జలధితరంగం వీరి స్వరం. స్వరరత్నాకరం వీరి శరీరం. శారద నారద వరం ఈ సంగీత విశారదుని కరం. శ్రీహరి చరణ కమలాలందు సుర గంగోద్భవం-వీరి కర కమలాలందు సుస్వర గంగోద్భవం. నిత్య నూతన బాణీకి రామస్వామి పెట్టింది పేరు. నిత్య సంగీత సాధనే నేటికీ వీరి తీరు. ఇంటా బయటా వేలమంది శిష్యులను ఆకర్షించిన గురువు రామస్వామి. దిన దిన ప్రవర్ధమానమై ఎదిగి ఒదిగిన సంగీత మేరువు. పలు సంగీత ఉత్సవాలలో ఉత్సాహంగా పాలుపంచుకుంటూ వార్ధక్యాన్ని సార్థక్యం చేసుకుంటున్న నవ యవ్వనుడు. ఎన్నటికీ వసివాడని గానగంధర్వుడు.
సప్తస్వరాలే సర్వస్వం అనే తపస్సు నేటి ఈయన యశస్సు.
నిత్యం సురసరస్వతికి వయోలిన్ వాయిద్యమే వీరు సమర్పించే నైవేద్యం. అణకువన గురుసార్వభౌమునికి సామంతుడు, ఆదర్శ శిష్యరికంలో శ్రీమంతుడు. పద్మశ్రీ డా॥మంగళంపల్లి బాలమురళీకృష్ణునికి బాల్యమిత్రుడు ఈ రామస్వామి. మేటి గాయకులతో గట్టి పోటీలు, ప్రశంసలు, విమర్శలు అన్నీ వరాలే ఈ అన్నవరానికి!
ఆస్థాన విద్వాంసునిగా:
*శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానము, విజయవాడ.
*శ్రీ దత్తపీఠం, మైసూరు.
*శ్రీ విజయదుర్గా పీఠం, ఏదురుపాక, ప.గో.జిల్లా.
నిర్మించిన స్మారకాలు:
*గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జ్ఞాపకార్ధం విజయవాడ అలంకార్ సెంటర్‌లో కాంస్య విగ్రహ ప్రతిష్ఠ.
*అన్నగారైన గోపాలం, తొలి గురువైన మాగంటి జగన్నాథ చౌదరి గార్ల పేరిట నాలుగు గదుల పాఠశాలను నిర్మించి, వారిపై తనకు గల అపారమైన గౌరవాన్ని ప్రదర్శించారు.
*తాను జన్మించిన ప.గో. జిల్లా, సోమవరప్పాడులో గురువుగారిపై తనకు గల ప్రతీకగా ఓ దేవాలయంలో రామ, కృష్ణ విగ్రహాల ప్రతిష్ఠ చేశారు.
*వీరి ఇంటి తలుపు తడితే వినిపిస్తుంది తబలావాయిద్యం. ఇంట కాలుపెడితే వినిపిస్తుంది వయోలిన్, వయోలా వాయిద్యం.
*ఈ అన్నవరం వారి వంటింట జతిలయలతో నాట్యం చేస్తూ అన్నం మెతుకులు ఉడికినా మనకు వినిపిస్తాయట తదికిట, తదికిట, తరికిట, తరికిట.
ఈ సంగీత హిమగిరి తెలుగువారి లలితకళాసిరి.
సప్తస్వరాలకు మానవాకారం ఈ రామస్వామి అన్నవరం.
వీరి ఇంటా బయటా నిండివున్న బహుమానాలు కిటకిట.
ఈ అన్నవరపు రామస్వామి పదుహారణాల తెలుగుతనానికి ప్రతీక.
వీరి నిజనివాసం వలన ధన్యత చెందినది విజయవాటిక.
వీరి సంగీత సాధనం మరో వందేళ్ళు…. యిలాగే సాగాలని ఆకాంక్షిస్తూ….
–బి.యం.పి. సింగ్
……………………………………………………………………………………
వీరిని వరించిన తరించిన అవార్డులు:
జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు, న్యూఢిల్లీ, రాష్ట్రసంగీత అకాడమీ అవార్డు, హైదరాబాద్, హంస అవార్డు, ఆంధ్రప్రదేశ్, దత్తపీఠం అవార్డు, నాదసుధార్ణవ, నాదనిధి, నాద చింతామణి, సంగీత విద్యానిధి వంటివి దేశంలోని పలు రాష్ట్రాల వారు యిచ్చిన బిరుదులు, కనకాభిషేకాలు, గండపెండేరాలతో ఘనమైన కీర్తినార్జించాడు.
పురస్కారాలు
*భారత ప్రభుత్వం ద్వారా పద్మ శ్రీ అవార్డు (2021)
*భారత ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన సంగీత నాటక అకాడమీ అవార్డు (2021)
*మద్రాస్ మ్యూజికల్ అకాడమీ ద్వారా ఇవ్వబడిన టి.టి.కే మేమొరియల్ అవార్డు (2019)
*ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన కళారత్న అవార్డు (2001)
సృజన: వయోలిన్, వయోలా, వీణ; గాత్రం (వోకల్), వేణునాదం వంటి వాయిద్య సాధనాలలో ఆరితేరిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి వందన, శ్రీదుర్గ అనే రెండు నూతన రాగాలను సృజించి కొన్ని వందల వర్ణాలు, కీర్తనలను కూడా రచించిన ఆధునిక వాగ్గేయకారుడు అన్నవరపు రామస్వామి.
20 వేల కచేరీలు చేసినందుకుగాను ఈ మధ్య ఈ సంగీత జలధిని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన తెలుగు బుక్ ఆఫ్ అవార్డ్స్ వరించి, తరించింది.
అలంకరించిన పదవులు:
బోర్డ్ ఆఫ్ స్టడీస్ యిన్ మ్యూజిక్, తెలుగు యూనివర్సిటీ మెంబరు, ఎ.ఐ.ఆర్. ఎడ్వయిజరీ కమిటీ మెంబరు, నాద నీరాజనం (టిటిడి, తిరుమల), ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వంటి వాటిలో మెంబరు.
……………………………………………………………………………….
