ఈ అడుగులు ఏ ప్రస్థానానికి?

వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించి ఆరు నెలల కాలం గడిచింది. ఈయన ప్రభుత్వం విద్యారంగంలో ప్రధానంగా 3 సంస్కరణలు చేపట్టడం జరిగింది. అవి అమ్మఒడిని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తింపజేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, పాఠశాలల భౌతిక వనరులను నాడు, నేడు పేరుతో అభివృద్ధి పరచడం, మొదలగునవి. ఇందులో అమ్మఒడిని ప్రైవేటు పాఠశాలలకు వర్తింపజేయడం, మాతృ భాషా మాధ్యమాన్ని రద్దు చేయడం వివాదస్పదంగా మారడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నదన్న విమర్శ బలంగా వినిపిస్తుంది. అయితే ఇది ఇప్పుడే ప్రారంభమైందని భావించడానికి వీలులేదు. 1980 దశకం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ వంటి సంస్థలతో షరతులతో కూడిన అప్పులు తీసుకోవడంతోనే దేశంలోనూ, రాష్ట్రం లోనూ విద్య, వైద్య రంగాలలో సంస్కరణలు మొదలు కావడం జరిగిందని మనం గుర్తించాలి.
మొదటి దశ విద్యారంగ సంస్కరణలు: 1986 జాతీయ విద్యావిధానం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (కాంగ్రెస్ ప్రభుత్వం) విద్యా సంస్కరణలు చేపట్టిన తరువాత ప్రైవేటు రంగంలో విద్య ఒక వైపు ప్రారంభం కాగా, మరో వైపు ప్రభుత్వ రంగంలోనూ జవహర్ నవోదయ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, అప్పటికే ఉనికిలో ఉన్న సైనిక, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కాబడ్డాయి. ఫలితంగా ఉన్నత, మధ్య తరగతి వర్గాలలోని పిల్లలు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ పాఠశాలలకు దూరం కావడం, వారిలోని తెలివైన విద్యార్థులు వీటిల్లో చేరడం జరిగినది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. కొరారీ కమీషన్ చెప్పిన కామన్ స్కూలు విధానాన్ని, చట్టబద్ధమైన విద్యా బోర్డులను, కామన్ కరిక్యులం ను ప్రక్కన పెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సి.బి.ఎస్.సి, ఐ.సి.ఎస్.ఇ, ఎన్.సి.ఇ.ఆర్.టి, ఎస్.సి.ఇ.ఆర్.టి మొదలగు బహుళ విద్యా నిర్వహణ సంస్థలను నెలకొల్పడం జరిగింది. ఇక 1990వ దశకంలో ఇది మరింత వేగవంతం కాబడి ప్రపంచీకరణ, సరళీకరణ ప్రైవేటీకరణలో భాగంగా ఇంటర్ నుంచి ఆ పైన ఉన్నత విద్య ప్రైవేటీకరించడం జరిగింది. ఉన్నత విద్య ప్రవేశాలు పూర్తిగా ప్రవేశ పరీక్షలతోనూ, కోచింగ్ సెంటర్ల తోనూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా తయారుచేశారు. ఈ విష సంస్కృతిని విద్యారంగంలో ప్రోత్సహించిన వారిలో మన రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం ఇరు ప్రభుత్వాలకు భాగస్వామ్యం ఉంది. ఇక్కడే 398 స్పెషల్ టీచర్ల వ్యవస్థ, అప్రెంటీస్ టీచర్ల వ్యవస్థ పుట్టుకొచ్చాయి. ఈ విష సంస్కృతి మన రాష్ట్రంలో ఎంతవరకు వెళ్ళిందంటే కార్పొరేట్ కాలేజీలలో ఇంటర్ లో తెలుగు సబ్జెక్టుకు బదులుగా మార్కుల స్కోరింగ్ కోసం సంస్కృతం ను తీసుకొనే విధంగా విద్యార్థులను మార్చారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూశాయి తప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. వామపక్ష విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నిరసనలను ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రెండవదశ విద్యారంగ సంస్కరణలు: మొదటి దశ విద్య సంస్కరణలు విజయవంతంగా కొనసాగుతున్నందువలన ప్రపంచ బ్యాంకు మరింత షరతులు పెట్టి ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో సంస్కరణలను ప్రోత్సహించింది. ఈ దశలో తెలుగుదేశం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగ సంస్కరణల కోసం ప్రపంచ బ్యాంకు నిర్దేశిత కన్సల్టెన్సీ అయిన మెకన్సీ అండ్ మెకన్సీ కంపెనీతో విజన్-2020 డాక్యుమెంటును తయారుచేయించింది. ఫలితంగా 2000 సంవత్సరం తరువాత పాఠశాలల హేతుబద్దీకరణ పేరుతో ఏకోపాధ్యాయ పాఠశాలల పెరుగుదల, రోలు తక్కువగా ఉన్న పాఠశాలల మూసివేత మొదలగు చర్యలు వేగవంతం కావడం జరిగింది. అంతవరకు విద్య ప్రైవేటీకరణను పట్టించుకోని వామపక్షేతర ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉపాధ్యాయ పోస్టుల కుదింపు, తరలింపులను వ్యతిరేకించసాగాయి. అయినప్పటికీ గత ప్రభుత్వాలు (కాంగ్రెస్, తెలుగుదేశం) పట్టించుకోలేదు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందడం లేదని, ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా పనిచేయడం లేదనే భావనను పాలక వర్గాలు, వాటి వార్తా పత్రికలు ప్రజలను నమ్మించే విధంగా ప్రచారం చేసారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఆంగ్ల విద్య వలనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రచారం చేసారు. దీనితో ఉన్నత మధ్య తరగతి వర్గాలతో పాటుగా కింది స్థాయిలోని వారు కూడా ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపారు. మరో వైపు బాలికా విద్య పేరిట కె.జి.బి.వి లు, ఆంగ్ల మాధ్యమం పేరిట మోడల్ పాఠశాలల వ్యవస్థను ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. ఈ దశలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో 6500 ఉన్నత పాఠశాలలలో మాతృ భాషా మాధ్యమంతో పాటుగా, ఆంగ్ల మాధ్యమాన్ని సక్సెస్ పాఠశాలల పేరిట ప్రవేశపెట్టింది. వీటికి అనుగుణంగా సాంకేతిక రంగంలో IIIT లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి అరకొర వసతులతో ఉన్నాయన్న విమర్శ కొనసాగుతుంది. మరో వైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పరిశోధనా గ్రాంటులు సరిపడినంత కేటాయించకపోవడం, అధ్యాపక ఖాళీలను భర్తీ చేయకపోవడం వలన విశ్వవిద్యాలయాలలో కూడా నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం జరిగింది. ఈ దశలోనే ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు సి.పి.ఎస్ విధానాన్ని ప్రపంచ బ్యాంకు షరతుల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
మూడవదశ విద్యారంగ సంస్కరణలు: గత 40 యేండ్ల విద్యారంగ సంస్కరణల కొనసాగింపే ఇప్పుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి, ఆంగ్ల మాధ్యమం, నాడు-నేడు పథకాలుగా చెప్పవచ్చు. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ను ప్రయోగశాలగా భావిస్తున్న ప్రపంచబ్యాంకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మాతృభాషా మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల భాషా మాధ్యమం ప్రవేశపెట్టడం, ఇక్కడ విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే కుట్ర చేస్తున్నారు. విద్య ప్రైవేటీకరణ జరిగినప్పటి నుంచి ఉపాధి అవకాశాలు రావాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరం అన్న విష ప్రచారం చేస్తున్న పాలక వర్గాలు, వాటి మీడియా మాయాజాలంలో మన రాష్ట్రంలోని ప్రజలు పడినందున ఈ ప్రభుత్వం ఈ సాహసానికి ఒడిగట్టిందని చెప్పవచ్చు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు ఉద్దేశ్యం ఏమంటే, ఆంగ్ల భాషా నైపుణ్యం గల పౌరులుగా తయారు చేయడం కాదు, వారి బహుళ జాతి కంపెనీల , వారి బహుళ జాతి కంపెనీల ఉత్పత్తులను అమ్మే వారిగానూ, కొనేవారిగానూ తయారుచేయడం, మరియు ప్రభుత్వ సంస్థలను తగ్గించి ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడంగా చెప్పవచ్చు.
అందుకు మన రాష్ట్ర పాలకులు నిస్సిగ్గుగా సహకరిస్తున్నారు. మరో అంశం ఏమంటే ఆంగ్ల మాధ్యమంతో పాటుగా మాతృభాషా మాధ్యమంను ఎందుకు కొనసాగించరాదో, కొనసాగించితే ప్రభుత్వానికి వచ్చే యిబ్బంది ఏమిటో ఇంతవరకు మన ప్రభుత్వం సరైన హేతుబద్ధ వివరణ ఇవ్వడం లేదు. పైగా ఈ సమస్య ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య వివాదంగా చూడడం దురదృష్టకరం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. గత 40 యేండ్లుగా దేశంలోనూ, రాష్ట్రం లోనూ కాంగ్రెస్, బి.జె.పి, తెలుగుదేశం ఇప్పుడు వై.ఎస్.ఆర్.సి.పి అధికారంలో ఉన్న పార్టీలు అన్నీ విద్య ప్రైవేటీకరణ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. వామపక్ష ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు డిమాండు చేస్తున్నట్లుగా కామన్ స్కూలు విధానాన్ని అమలుచేయడం లేదు. చివరకు 2017లో అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వీరు ప్రక్కన పెట్టి విద్య ప్రైవేటీకరణను కొనసాగిస్తున్నారు. ఇదే కాలంలో పురపాలక పాఠశాలల్లో తెలుగు మీడియం కు సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలను విభజించి పాలిస్తున్నారు. పేద, బడుగు బలహీన వర్గాలను భ్రమలకు గురిచేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నికి నిజంగా పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నా నిజాయితీ ఉన్నా, అమ్మఒడి పథకాన్ని ఒక్క ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేసి ఉండేవారు. కానీ కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడికి లోనై రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేటు పాఠశాలలకు కూడా వర్తింపజేయడంలోనే అసలైన కుట్ర దాగి ఉందని చెప్పవచ్చు.
ముగింపు: గత నాలుగు పదుల అనుభవం చెబుతున్నదేమంటే మన రాష్ట్ర పాలకులు ఏ పార్టీకి చెందిన వారైనా అనుసరిస్తున్న విద్య ప్రైవేటీకరణలో భాగంగానే క్రమక్రమం గా ప్రభుత్వ విద్యాలయాలను ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు అన్నవి భాషా మాధ్యమం వలన రావు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి వలన వస్తాయి. కానీ ప్రస్తుత ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానాల వలన దేశంలోనూ, రాష్ట్రంలోనూ వ్యవసాయ పారిశ్రామిక రంగం సంక్షోభానికి గురైన ఫలితంగా గ్రామీణ రైతులు, చేనేత రంగ కార్మికులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. చాలా మంది వలస కూలీలుగా అంతర రాష్ట్రాలకు వెళ్ళుచున్నారు. ఫలితంగా మొత్తం పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలు దూరం కాబడుతున్నాయి. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం ర్యాంకుల వేటలో ఉన్న త,మద్య తరగతికి చెందిన విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. ఇక ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పరభాషా మాధ్యమం వలన డ్రాప్ అవుట్స్ పెరిగి కొంత, ప్రైవేటు పాఠశాలల ప్రభావం వలన మరికొంత ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడున్న స్థితి కంటే మరింతగా రేషనలైజేషన్ కు గురై ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయి మూతపడే స్థితికి రానున్న దశాబ్ద కాలంలో చేరుతాయి. ఇప్పటికే బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగుల స్థితి, తెలంగాణ ఆర్.టి.సి ఉద్యోగుల స్థితి మనకు అనుభవం లోకి వచ్చింది. కావున రాష్ట్రంలోని ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు వారి మధ్య ఉన్న విభేదాలను ప్రక్కకు పెట్టి ఒక బలమైన ఐక్య వేదికలను ఏర్పాటు చేసుకొని ప్రైవేటు పాఠశాలల వ్యవస్థ రద్దు కోసం డిమాండు చేస్తూ కామన్ స్కూలు విధానం ఏర్పాటు కోసం పోరాడాలి. అందులో భాగంగానే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషిచేసే విధంగా ఒత్తిడి తీసుకొని రావాలి. ఆ దిశగా మనం పయనిద్దామని ఆశిస్తున్నాను.
పి.కృష్ణారావు,
ప్రధాన కార్యదర్శి, డి.టి.ఎఫ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap