ఆంధ్రప్రదేశ్ లో అకాడమీలు పునరుద్ధరించండి …

అకాడమీలు ఎందుకు…?
దేశం యొక్క ఔన్నత్యం కళల పై ఆధారపడి ఉంటుందని సత్యం గ్రహించిన మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1955లో సంగీత, సాహిత్య, నాటక, లలితకళా అకాడమీలను ప్రారంభించారు. లలిత కళలల్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, పోటీలు, సదస్సులు ఏర్పాటు చేసేవారు. వీటివల్ల వివిధ సంస్కృతులు ఒకరివి మరొకరు తెలుసుకునే వీలు ఉండేది. క్రొత్త విషయాలు ఔత్సాహికులు తెలుసుకొని ప్రతిభకు మెరుగులు దిద్దుకునే వారు. అకాడమీకి అనుబంధంగా అన్ని రాష్ట్రాలు ప్రాంతీయంగా అకాడమీలను ఏర్పాటు చేసి, లలిత కళాకారుల్ని ప్రోత్సహించేవారు. మన రాష్ట్రంలో చిత్ర,శిల్ప, గ్రాఫిక్ కళల్ని ప్రోత్సహించడానికి 1961లో రాష్ట్ర లలితకళా అకాడమీని స్థాపించారు. పావు శతాబ్దం పాటు అకాడమీ రాజకీయాలకు అతీతంగా, ప్రతిభావంతులైన వారికి అనేక విధాలుగా తోడ్పాటును అందించాయి. అకాడమీ కార్యనిర్వాహక వర్గంలో ఆంతరంగిక గొడవలు రచ్చకెక్కడంతో 1985 లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అకాడమీల పై ఒక కమిటీ వేసి వారిచ్చిన నివేదిక ప్రకారం వాటిని రద్దు చేశారు. రాష్ట్రంలో అకాడమీలు లేకపోవడంతో కేంద్ర అకాడమీ నిధులు విడుదల నిలిపివేసింది. అంతేకాక అకాడమీ చేస్తున్న కార్యక్రమాల వివరాలు మనకు తెలియకుండా పోయాయి. కళాకారులకి దీని వల్ల తీవ్ర నష్టం కలిగింది. కేంద్రం అందించే గ్రాంట్ కూడా నిలిచిపోయింది. అప్పటినుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్ర, శిల్ప, కళా కార్యక్రమాలు నామమాత్రం అయ్యాయి. ఈ కళలు కూడా కాలక్రమంలో మసకబారింది. కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా ఈ పోటీలు, ప్రదర్శనలు సొంత నిధులతో కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నాయి. మన దక్షిణాది రాష్ట్రాలయిన తమిళనాడు, కర్నాటక లో అకాడెమీలు ఎంతో కృషిచేస్తున్నాయి కళాకారులకోసం.

ఆంధ్రప్రదేశ్ లో :  2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో లలితకళల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, దృశ్య కళల అకాడమీని పునరుద్ధరిస్తామని చెప్పినా ఆచరణలో అమలు కాలేదు. గత 35 సంవత్సరాలుగా రాష్ట్ర కళాకారులు అకాడమీలను పునరుద్ధరించాలని తరచు కోరుతూనే ఉన్నారు. అధికార పార్టీలు ఈ విషయం పట్టించుకోవడం లేదు. అకాడమీ లేకపోవడం వల్ల మన తెలుగు కళాకారులు జాతీయస్థాయి గుర్తింపు పొందలేక పోతున్నారు. ప్రతిభావంతులైన శిల్ప, చిత్రకారులు వందల్లో వున్న కేంద్ర లలితకళా అకాడెమీ గుర్తింపు పొందిన వారు బహుతక్కువగా ( సింగిల్ డిజిట్ లో) వున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర సాంస్కృతిక శాఖలు వున్నా, అవి నామ మాత్రమే. వాటి ఉనికి అంతంత మాత్రమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లలితకళా అకాడమీ లను పునరుద్ధరించాలని,  శిల్ప, చిత్రకారులు, ఆయా కళాసంస్థలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉంది. విశాఖపట్నం, విజయవాడలలో ఆర్ట్ గ్యాలరీలను ఏర్పాటు చేయాలి.

అకాడమీ చైర్మన్ గా ఎవరిని ఎన్నుకోవాలి..?
గతంలో ఏ.పీ. లలితకళా అకాడమీ లో అంతరంగిక గొడవల కారణంగా నే రద్దయిందని చెప్పుకున్నాము. పదవుల కోసం కీచులాట, ఆధిపత్యపోరు, అవినీతి, బంధుప్రీతి, అసమర్థత వంటి కారణాలవల్ల అకాడమీల రద్దు కు ప్రధాన కారణంగా ప్రభుత్వం ప్రకటించింది ఆనాడు. రాష్ట్రంలో ఉన్న చిత్రకారులు, శిల్పులు, చిత్ర కళాసంస్థలు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకొనేవి. ఏ.పి. విషయానికి వస్తే పేరుకు 50 సంస్థలు వరకు ఉన్నా, కార్యక్రమాలు నిర్వహిస్తున్నవి, రిజిస్ట్రేషన్ కల్గి వున్నవి పదికి లోపే వుండివుంటాయి.
గుర్తింపు పొందిన వారంతా ప్రతిభావంతులు కారు, ప్రతిభావంతులు అంతా గుర్తింపు పొందుతారని భావించనక్కరలేదు. అకాడమీ బాధ్యతలు నిర్వహించాలంటే కళాకారుల్లో ప్రతిభతో పాటు, కార్యనిర్వహణ సమర్ధ్యం కలిగి ఉండాలి. సమర్ధత ఉండాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, కళాసంస్థలు, కళాసమస్యలను గుర్తించ గలిగి, సమస్యల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అంతే కాక స్థానికత్వం కూడా ముఖ్యమే.ఇంకా రాజకీయ పలుకుబడి, నిస్వార్థ సేవాగుణం వుండాలి. కొంతమంది ఏమాత్రం అవగాహన లేకుండా, పదవుల కోసం పాకులాడుతున్నారు. వారి ప్రణాళిక ఏమిటనేది చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్కడ ప్రకటించలేదు. ముందుగా చిత్రకారులు, శిల్పులు, సంగీత కళాకారులు, నాటక కళాకారులు, నృత్యకారులు, కవులు ఇంకా ఆయా రంగాలకు చెంది కళాసంస్థలు … అన్ని సంఘటితంగా అకాడమీల పునరుద్ధరణ గురించి ఉద్యమించడం మంచిదని నా అభిప్రాయం. అకాడమీ ఏర్పడ్డాక అందరూ కలసి కూర్చుని కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవచ్చు. లేని పెళ్లి కి..! కానీ పెళ్లికి..! బయలుదేరడం ఎందుకు..? అందరూ ఆలోచించండి. ఏపీలో ఇప్పటికే గ్రూపుల గోల ఉంది. స్థానికంగా ఏమైనా కార్యక్రమాలు చేసి ముందు ప్రోత్సహించండి. కరోనా వల్ల ఎంతో మంది కళాకారులు ఆకలితో అలమటిస్తున్నారు. బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి అండగా నిలుద్దాం…
ప్రస్తుతం ప్రభుత్వం వివిధ వర్గాల వారికి ఎన్నో పథకాలను ప్రకటిస్తుంది, అమలు చేస్తుంది కూడా. మన కళాకారులకు కూడా అలాంటి సహకారం అందించేలా ప్రభుత్వ దృష్టికి మన సమష్యలను తెసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం.

-సుంకర చలపతిరావు (91546 88223)
చిత్ర కళాపరిషత్, విశాఖపట్నం

SA:

View Comments (9)

  • It's true... Sir...Sunkara Chalapathi Rao Garu....and thank you ... Mr.Kalasagar for posting this worthy article...
    Spoorti Srinivas

  • అకాడమీల గురించి నాకు అంతగా అవగాహన లేదు. చాలా వివరంగా ఆర్టికల్ రాసారు చలపతి రావు గారు. ప్రచురించిన కళాసాగర్ గారికి దన్యవాధాలు.
    చిదంబరం, ఆర్టిస్ట్

  • నిజమే.. నిజం గా మనకి అకాడెమీ వస్తే ..ఎంతవరకు దానికి న్యాయం చేయగలం కళాసాగర్ గారూ. ఆ విజన్, సునిశిత దృష్టి, కార్యదక్షత, ఐకమత్యం మన రాష్ట్రం లో ఉంటాయని నేను భావించడం లేదు.
    ఏం చేయగలం చెప్పండి. సాంస్కృతిక శాఖ అధికారులకి కనీస అవగాహన లేని రాష్ట్రం మనది. ప్రభుత్వానికి పట్టదు. కొంతమంది నకిలేలదే వైభవం. నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయి.
    రెండేళ్లుగా ..ఈ రోజుకి కూడా కేంద్ర లలితకళా అకాడెమీకి రెండు పేర్లు పంపలేని పరిస్తితి లో ఉన్నాం అంటే మీరు గమనించవచ్చు.
    యెం. జె. రావు

  • Manchi article Chalapathi Rao garu, this is necessary for represent to the Govt. Thanks to Kalasagar garu.
    AppaRao A. Artist

  • సార్ నా పేరు పెద్ది పోగు ఆనంద్
    రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.

    దాదాపుగా 35 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎన్ టి రామారావు గారు సంగీత నాటక అకాడమీ లను ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయడం జరిగింది
    అయితే అప్పుడున్న అకాడెమీ లోని కొంతమంది వ్యక్తులతోనూ అదేవిధంగా వారి వారి యొక్క పద్ధతులు తోనూ విసుగు చెంది ఉండవచ్చు. అంతమాత్రాన వ్యక్తుల కోసం వ్యవస్థ ఆగిపోకూడదు అని ఆయనకు తెలియదా ?
    ఏది ఏమైనా ప్రపంచం గర్వించదగ్గ ఓ గొప్ప కళాకారుడు అయిన శ్రీ ఎన్టీ రామారావు గారు సంగీత, నాటక అకాడమీ లను రద్దుచేసి కళాకారులకు కళారంగానికి కొంతవరకు అన్యాయం చేశారని చెప్పాలి.

    అయితే ముఖ్యంగా సంగీత నాటక అకాడమీ విధివిధానాలు ఎలా ఉండాలి.
    35 సంవత్సరాల క్రితం రద్దయిన అకాడమీ ఎలా ఉండేది అన్న విషయాల పైన ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి అవగాహన లేదనే చెప్పాలి గత ప్రభుత్వం నామమాత్రంగా అకాడమీని పునరుద్ధరించిన అప్పటికి కూడా కళాకారులకు కళారంగానికి ఒరిగిందేమీ లేదు అయితే మీరు చెప్పిన విధంగా సంగీత నాటక అకాడమీ విధివిధానాలపై నా కళాకారుల యొక్క సమస్యల పైన మరియు కళలను ఏవిధంగా భావితరాల వారికి తెలియ చెప్పాలి అనే అంశాల మీద ఎవరికైతే పూర్తి అవగాహన ఉంటుందో వారు కనుక అకాడమీ చైర్మన్ అయితే కొంత వరకు కళారంగం బాగుపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం
    అయితే నాకున్న అవగాహన మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
    సంగీత నాటక అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే కళలు డెవలప్ కావాలి మన సాంప్రదాయ కళలు మన సాంప్రదాయాలు మన భారతం మన రామాయణం మన ఇతిహాసాల తోపాటు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే విధంగా భావితరాలకు సంగీత నాటక అకాడమీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఐదు ప్రాంతాలలో, శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలి అందులో అనేక అంశాలను పొందుపరచాలి ఉదాహరణకి సంగీత నాటక అకాడమీ లో మొట్టమొదటగా నేటి యువతకు కళల పట్ల ఆ శక్తి పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి తరువాత సామాజిక అంశాల పైన అవగాహన కల్పించాలి నాటకం సంబంధించి దర్శకత్వం మీద శిక్షణ నటన మీద శిక్షణ మేకప్ మీద శిక్షణ నాట్యం మీద శిక్షణ ఇస్తూ, సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కూడా అవగాహన కల్పించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే విధంగా మన శిక్షణా తరగతులు ఏర్పాటు కావాలి.
    తద్వారా రాబోయే తరం వారికి కళల పట్ల కళారంగం పట్ల గౌరవం ఏర్పడతాయి.
    సమాజం పట్ల బాధ్యత గా ఉండడం తెలుసుకుంటారు ఆ తరువాత రాబోయే తరం వారికి మార్గదర్శకంగా నిలబడతారు.
    ఆ విధంగా కళారంగం అంతరించిపోకుండా ఉండేందుకు సంగీత నాటక అకాడమీ దోహదపడాలి.

    అయితే పైన చెప్పుకున్న అంశాల్లో కళారంగం గుదలకు ఉపయోగపడే అంశాలు మాట్లాడుకున్నాము

    ఇప్పుడు కళాకారులు కూడా బాగుండాలి కదా?
    కళాకారుల కోసం సంగీత నాటక అకాడమీ నిర్వహించే శిక్షణా తరగతుల్లో శిక్షణ ఇచ్చేటువంటి మాస్టర్ కు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున నాటక అకాడమీ ద్వారా జీతాలు ప్రకటించాలి. ఆ విధంగా చేస్తే కళాకారులు కడుపునిండా భోజనం చేయడానికి కళాకారుల కుటుంబంలో వెలుగు నింపడానికి కళాకారుల్లో ఆర్థిక భరోసా నింపడానికి సంగీత నాటక అకాడమీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి.

    తరువాత సంగీత నాటక అకాడమీ లో శిక్షణ తీసుకున్న యువ కళాకారులను, ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి చైతన్యవంతులను చేసే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించి వాటిని తమ తమ కళా ప్రదర్శన ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని పోయి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు అనేకం చేసుకోవచ్చు అలా ప్రజల్లోకి తమ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకుని వచ్చే యువ కళాకారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా ప్రత్యేకంగా వారికి గౌరవ వేతనాలు ప్రకటించాలి ఆ విధంగా చేసినప్పుడు ఇప్పుడున్న కళాకారులు బాగుపడతారు, రాబోయే తరం కళాకారులు కూడా బాగుపడతారు తద్వారా ఎంతో ఘన చరిత్ర కలిగిన అటువంటి మన సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా ఉండేందుకు ఈ సంగీత నాటక అకాడమీ లు ఉపయోగపడాలనేది నా అభిమతం.
    ఇంతవరకు మనం సంగీత నాటక అకాడమీ విధివిధానాలు ఎలా ఉంటే బాగుంటుందో అన్న విషయాలు చర్చించాం.
    అసలు సంగీత నాటక అకాడమీ బాడీ ఎలా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు చర్చించుకుందాం.
    నాటక రంగంలో నిష్ణాతులు, కళల పట్ల ప్రేమ, కళాకారుల పట్ల బాధ్యత నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వారిని సంగీత నాటక అకాడమీ చైర్మన్గా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం తరువాత నాటక అకాడమీ కి సంబంధించి గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అకాడమీ ఏవిధంగా ఉండేదో ఆ విధంగానే ఇప్పుడు కూడా అకాడమీలో 99 మంది సభ్యులు కళాకారులే అయి ఉండాలి అందరు కూడా కళాకారుల పట్ల మరియు కళా రంగం పట్ల ఎంతో అవగాహనతో ఎంతో బాధ్యత తో మెలిగేవారు అయి ఉండాలి.
    అయితే ఈ 99 మంది సభ్యులు 13 జిల్లాల నుండి ప్రతి జిల్లాకు సమానత్వం ప్రకటించాలి, ఈ 13 జిల్లాల నుంచి ఎన్నిక కాబడే సభ్యులు అందరూ కూడా కళా రంగం పట్ల మరియు కళాకారుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించే టువంటి వృత్తి కళాకారులు అయి ఉండాలి అప్పుడే ఈ సంగీత నాటక అకాడమీ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరుతుంది అనేది నా యొక్క ఉద్దేశం

    గత సంగీత నాటక అకాడమీల మీద ఉన్న చిన్న అవగాహనతో చెబుతున్న ఈ మాటలు... ఏవైనా తప్పులు ఉంటే క్షమించగలరు అని కోరుతున్నాను

    పెద్ది పోగు ఆనంద్
    రాష్ట్ర అధ్యక్షులు
    రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం (ఆంధ్ర ప్రదేశ్)
    సెల్ నెంబర్ : 99850 66521, 63025 95905
    email: surabhianand189@gmail.com

  • చాలా చక్కగా వ్రాసారు. ఏం సాధించాలన్నా ముందుగా కళాకారులందరు నిస్వార్ధంగా ఏకం అవ్వడం అవసరం. అర్థం చేసుకునే కళాకారులకు మీ ఆర్టికల్ బాగా ఉపకరిస్తుంది. ఇలాగే అప్పుడప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ వ్రాస్తూ కళాకారుల్లో ఉత్సాహాన్ని, ఏకమవ్వాలనే దృఢత్వాన్ని పెంపొందింప చేయాలని మనసారా కోరుకుంటున్నాను.
    G.V. Sagar, artist (Tirupati)