(ఐపిఆర్ కమిషనర్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల నిరసన డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రం సమర్పణ..)
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎపిబిజెఎ) ఆధ్వర్యాన సోమవారం(29-5-23) జర్నలిస్టుల డిమాండ్స్ డే జరిగింది. దీనిలో భాగంగా విజయవాడలోని ఆర్‌టిసి బస్టాండ్ కాంప్లెక్స్ సముదాయంలోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు, బ్యానర్‌ను చేతబట్టి జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అక్రిడిటేషన్ల కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్ ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీని నియమించాలని, కార్మిక బీమా వర్తింపజేయాలని, జర్నలిస్టు కమిటీలను, మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, మీడియా అకాడమీలో ఎపిడబ్ల్యుజెఎఫ్, ఎపిబిజెఎలకు ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టుల అవార్డులు ఇవ్వాలని, ఆరోగ్య బీమా అమలుపై సమీక్షకు కమిటీని నియమించాలని కమిషనర్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు.
దీనిపై కమిషనర్ విజయకుమార్ రెడ్డి స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విజయవాడలోని కలెక్టరేట్లో ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించి తర్వలో అక్రిడిటేషన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే విజయవాడ రూరల్ మండలం నున్నలోని ది విజయవాడ మ్యూచివల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాన్ని స్వాధీనం చేసేందుకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర నాయకులు ఎ. అమరయ్య, పరమేశ్వరరావు, ఎపిబిజెఎ రాష్ట్ర నాయకులు జి.వి.రంగారెడ్డి, విజయవాడ నగర అధ్యక్ష కార్యదర్శులు కె.కలిమిశ్రీ, ఎం.బి. నాథన్, కృష్ణాజిల్లా కార్యదర్శి వై.శ్రీనివాస్, నగర నాయకులు విహెచ్.రాజు, రాఘవేంద్ర శేఖర్ పాల్గొన్నారు.