నా కోరిక నెరవేరింది – విజయచందర్

(టి.యస్.విజయచందర్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన కరుణామయుడు, ఆంధ్రకేసరి మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాసులో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. విజయచందర్ తల్లి పుష్పావతి, ప్రకాశం పంతులు కూతురు. తండ్రి తెలిదేవర వెంకట్రావు హోమియోపతి వైద్యుడు.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఎ.పీ.ఎఫ్.డి.సి.) ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు విజయచందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.పి. ఎఫ్. డి.సి. చైర్మన్ విజయచందర్ మాట్లాడుతూ – “2003లో ఫ్లెట్లో వెళ్తున్నప్పుడు వైఎస్ గారిని చూడ గానే ‘సార్.. ఈ సారి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. నాకు ఎడీసీ చైర్మన్ అవ్వాలని ఉంది? అన్నాను. ఆయన నవ్వి సరే అన్నారు. 2004లో సీఎం అయ్యాక మొదటిసారి నాకు ఇవ్వలేదు. 2009లో 150 సీట్లతో మళ్లీ సీఎంగా గెలిచారు. ఆయన ఆఫీసుకు వెళ్తూ నన్ను చూసి, షేక్ హ్యాండ్ ఇచ్చి, ‘ఎలా చెప్పావయ్యా 150 సీట్లు వస్తాయని?’ అన్నారు. ‘మూడు నెలల్లో నిన్ను ఎ.డీ.సీ. ఛైర్మన్ చేస్తా’ అన్నారు. కుదర్లేదు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్ గారి ద్వారా ఆ పదవిని నాకు ఇప్పించారనిపిస్తోంది. అందుకే వైఎస్ గారికి మరణం లేదనే మాట నేడు నిరూపితమైంది. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆయన ఉంటారు. ‘చెన్నైలో, హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా అభివృద్ధి చెందిందో అలా మన రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషిచేద్దాం’ అని జగన్ గారు నాతో అన్నారు.
తెలంగాణలో చిత్రరంగాన్ని అభివృద్ధి చేసినట్టు ఏ.పీ.లోనూ చేయాలని ఇండస్ట్రీ వారిని కోరుతున్నా. అందుకు కావాల్సిన అంశాలను ఇండస్ట్రీ పెద్దలందర్నీ అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోని ఇండస్ట్రీ పెద్దలందర్నీ కలుసుకుంటాను. సురేష్ బాబుగారు ఫోన్ చేశారు. ఏపీలో షూటింగ్ కు డైరెక్ట్ గా ఎఫ్డీసీ నుంచి అనుమతులు లభించేలా చూడాలని నిర్మాత వివేక్ కూచిభొట్ల అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొంత ఫిల్మ్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చి అక్కడ స్థిరపడిపోయేవారికి మరిన్ని సదుపాయాలు కల్పిస్తాం. ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం షూటింగ్లు మాత్రమే కాకుండా, నిర్మాణ సంస్థలు వారి ఆఫీసులను కూడా పెట్టాలని కోరుతున్నాం. ఏపీఎఫ్ డీసీ డైరెక్టర్స్ విభాగంలో తొలి సభ్యుడిగా సుజితన్ను ఎంపిక చేసుకున్నాం. మన కళామతల్లికి సేవ చేస్తున్న వారందరి ఫొటోలు, వివరాలతో విశాఖపట్నంలో ‘నందనవనం’ పేరుతో మన చరిత్ర చూపించే విధంగా ప్లాన్ చేద్దాం’ అని జగన్ గారు అన్నారు. అందుకు ఈ సందర్భంగా ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొత్త నిర్మాతలకు, చిన్న నిర్మాతలకు అండగా ఉంటాం. చిన్న సినిమాలు పరిమిత వ్యయంతో నిర్మించే చిన్న చిత్రాలకి వారం రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించు కునే వెసులుబాటు కల్పించాలనే ఆలోచనలో ఉన్నాం. చిత్రీకరణ కోసం ఎలాంటి వసతులు సమకూర్చడానికైనా, స్థలాలు కేటాయించడానికైనా ప్రభుత్వం సుముఖంగా ఉంది. సినిమా రంగానికి చెందిన అందర్నీ కలుపుకొని చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
-బి.ఏ. రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap