లివింగ్ మ్యూజిక్ లెజెండ్ – రెహమాన్

జనవరి 6 ఏఆర్ రెహమాన్ జన్మదిన సందర్భంగా …

అల్లా రఖా రెహమాన్ అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ ఏఆర్ రెహమాన్ అంటే మాత్రం లోకం వెంటనే గుర్తు పడుతుంది. చిన్నగా మొదలైన ఈ సంగీతపు శిఖరం గురించి ఎంత చెప్పినా తక్కువే. 1967 జనవరి 6 న జన్మించాడు ఈ దిగ్గజం. రెహమాన్ అసలు పేరు ఏ.ఎస్. దిలీప్ కుమార్. స్వరకర్త. గాయకుడు. సంగీత దర్శకుడు. గీత రచయిత. నిర్మాత. సంగీతకారుడు అంతే కాదు జగమెరిగిన భక్తుడు.దానకర్త కూడా. భారతీయ సంగీత ప్రపంచాన్ని తన ప్రతిభతో గుర్తింపు తెచ్చినవాడు. ఎందరో కొత్త గాయనీ గాయకులను పరిచయం చేశాడు. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలోనే ఫాదర్ ను కోల్పోయాడు. తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పని చేశాడు.
వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమ కూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ సినిమా ఇండియన్ సినీ సంగీత ప్రపంచాన్ని కుదిపేసింది. మొదటి సినిమా తోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కించుకున్నాడు. అలా రోజాతో స్టార్ట్ అయినా రెహమాన్ సంగీతపు ప్రయాణం కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నది. లోకం అంతటా నిద్రలోకి జారుకున్నప్పుడు ఇతడు ఒక్కడే మేల్కొంటాడు. అప్పుడు పాటలకు స్వరాలు సమకూరుస్తాడు. రంగీలా సినిమా మ్యూజిక్ బాలీవుడ్ ను ఊపేశారు.
రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి.
నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చు కున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు పేదరికం.11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్ వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారి నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు. పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది.
దీంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టి పెట్టమని చెప్పింది. మొదట్లో చదువు కోలేక పోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోష పడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయట పడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు. తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు. రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతో పాటు మేరీ మాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చని పోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులైంది.
వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లామ్‌లోకి మారింది. ఇది జరగక మునుపే చెల్లెలు పెళ్ళి కోసం ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చు కోవాలని ఉందని ఆయన్ను అడిగాడు. ఆయన అబ్దుల్ రహీమ్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు. రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే పేరు మార్చుకున్నాడు. తల్లి ఆ పేరు ముందు అల్లా రఖా అనే పేరును చేర్చింది. ఆమె కూడా తన పేరును కరీమాగా మార్చుకుంది. అంతే కాదు ఎంత ఎత్తుకు ఎదిగినా, లోకంలో ఎక్కడున్నా సరే కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, వేనాడు దర్గాలను తప్పకుండా దర్శించు కోవడం చేస్తాడు ఈ సంగీత దిగ్గజం.
సినిమా ల్లోకి రాక మునుపు బాపు సహకారంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అక్షరమాల ప్రాజెక్టుకు సంగీతం సమ కూర్చాడు. తెలుగులో రెహమాన్ మొదటి ప్రాజెక్టు అదే. బాపు కుమారుడు వేణుగోపాల్ వ్యక్తిగతంగా రెహమాన్ కు మంచి స్నేహితుడు కూడా.తన సంగీత జీవితాన్ని రాజ్, కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్ శివన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వారా దేశమంతటా పేరు పొందాడు. మణిరత్నం సోదరి కుటుంబం నిర్వహించే ఓ వాణిజ్య ప్రకటనల సంస్థకు రెహమాన్ సంగీతం సమకూర్చే వాడు.

అలా మణిరత్నంతో పరిచయం ఏర్పడింది. స్లమ్‌డాగ్ మిలియనీర్, జై హో అనే పాటకు  గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ గౌరవం తనకు మాత్రమే దక్క లేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. రెహ్మాన్ ప్రభావానికి తను కూడా లోను కాక తప్ప లేదని, తనకు రెహ్మాన్ అంటే భయమనీ, జలసీ అని ప్రఖ్యాత స్వరకర్త ఎస్ ఎల్ వైద్యనాథన్ అన్నాడు. రెహ్మాన్‌లా తను కూడా వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చే కౌంటర్స్‌తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలా సార్లు విఫలమయ్యానని ఒప్పుకున్నాడు. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ సంప్రద్రాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహ్మాన్.
అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారు చేశాడు. టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్‌ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు. 2005 లో టైం మ్యాగజీన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్ లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది. 2009 లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది. రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు. రెహమాన్ భార్య సైరా బాను. సైరా కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిర పడింది.
తడ దర్గా ఖాద్రీ ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు. అలా వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్‌. రెహమాన్ పుట్టిన రోజునే కుమారుడు అమన్ కూడా పుట్టాడు. రెహమాన్ స్వంతంగా సంగీత పాఠశాల స్టార్ట్ చేశాడు. అదే కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీని 2013 ఆగస్టు 9న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్టార్ట్ చేశాడు. ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవానికి అంబానీతోపాటు ఆయన సతీమణి నీతూ అంబానీ కూడా హాజరయ్యారు. రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27 వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్య బృంద సంగీత కళాశాలను పేద పిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు. రెహమాన్ వ్యక్తి కాదు ఓ వ్యవస్థ. జీవితంలో ఎదగాలని అనుకునే వాళ్ళు, తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చు కోవాలని అనుకునే వాళ్లకు రెహమాన్ ఓ రోల్ మోడల్. ఈ అద్భుతమైన వ్యక్తి జీవిస్తున్న కాలంలో మనమూ ఉండటం అదృష్టమే అని చెప్పక తప్పదు. అల్లా రఖా రెహమాన్ జీ మీ సంగీత స్వర మాధుర్యాన్ని ఇలాగే పంచుతూనే ఉండాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap