సోషలిజం నేటికి సఫలం కాలేదు – అరసవిల్లి

“నిద్ర నా ప్రియమైన శత్రువు కాదు
నిద్రలోనే కవి ఆత్మహత్య
నిద్రలోనే ఎదురు కాల్పులు
నిద్రలోనే ఆదివాసి ధిక్కారం
నిద్రపోయేదెపుడని “
నిద్ర చాలక కవితలో అంటారు… అరసవల్లి కృష్ణ గారు.

నిరంతర జాగూరుకుడైన కవి అతడు. తనదైన సంతకాన్ని తెలుగు కవిత్వపుటల్లో చెక్కిన కవిగా… రాజకీయాలకు కూడా కవిత్వ పరిమళాన్ని అద్దే ‘తడి ఆరని’ వాక్యమతడిది.
బాల్యంలోనే ఉత్తరాంధ్ర పల్లె నుండి నగరానికి వలస వచ్చిన ఒక కవిగా, చారిత్రాత్మకమైన ‘విరసం’ అధ్యక్షునిగా ఎదిగిన క్రమాన్ని, కవిత్వంలో అందుకున్న శిఖరాలను పరిశీలిద్దాం…! ‘అనేక’ పుస్తకాల సాక్షిగా కృష్ణ గారిని పలకరిద్దాం.

ప్రశ్న: ఒక కవిగా, విమర్శకునిగా, ముఖ్యంగా విరసం అధ్యక్షులుగా తెలుగు సాహిత్యంలో మీకొక ప్రత్యేక స్థానం వుంది. మీ చిన్ననాటి విశేషాలు, చదువు సంధ్యల గురించి వివరిస్తారా?
జవాబు: విశాఖపట్నంలో నగరపాలెం గ్రామంలో నగరపాలెంలో 8వ తరగతి వరకు చదువుకున్నాను. 10వ తరగతి వరకు భీమిలీలో చదువుకొన్నాను.

ప్రశ్న: ఇప్పుడు మీరిలా కవిత్వం రాయడానికి మీ బాల్యంలో ప్రేరణ ఏమైనా ఉన్నదా?
జవాబు: గ్రామీణ వాతావరణంలో పుట్టడం వలన చిన్నప్పుడే రాయడం, చదవడం అలవడింది. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు చదివేవాడిని. చిన్నప్పుడు నాటకాలు వేసే మిత్రులతో స్నేహం చేయడం వలన ఒక అభిరుచి ఏర్పడటం, మాకు చదువుచెప్పే మేష్టారు పిల్లల కథలు చెప్పేరీతిలో ఒక సృజనాత్మకత ఉండేది. అప్పటినుండి ఏదైనా చెప్పాలనుకొనే ఊహ అలవడింది.

ప్రశ్న: మీరు విశాఖపట్నం నుంచి విజయవాడకు ఎందుకు రావలసి వచ్చింది? ఇలా వలస వచ్చినందు వలన మీ జీవితం ఎలా ప్రభావితమయింది?
జవాబు: 1982లో నాకు 15 ఏళ్ళ వయసులో విజయవాడ వచ్చాను. వ్యవసాయం దండగ మారి వృత్తిగా మారడం, అధిక సంతానం కారణంగా చాలామంది ఉత్తరాంధ్ర నుంచి వలసలు వచ్చారు. గ్రామాల్లో ఉపాధి లేకపోవడం వలన, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వలన, 5, 10 ఎకరాలున్న రైతులు కూడ 40వ దశకం నుంచి వలసలు రావడం మొదలయింది.

ప్రశ్న: గ్రామీణ నైపథ్యం నుంచి వచ్చిన మీరు ఒక ప్రశ్నించే కవిగా మారడానికి ఇక్కడ పరిస్థితులు ఎలా దోహదం చేసాయి?
జవాబు: ఇక్కడ గ్రంథాలయాల్లో దినపత్రికలు అందుబాటులో వుండడం, అలంకార్ సెంటర్లో పాతపుస్తకాల షాపుల్లో దొరికే మార్కిస్టు సాహిత్యం, లెనిన్ కూడలిలో దొరికిన ‘భారతదేశంలో నా జైలు జీవితం’ లాటి పుస్తకాలు, విజయవాడలో సాహిత్య, రాజకీయ వాతావరణం, నేను రచయితగా మారడానికి, కొత్తతరం రచయితగా కలం పట్టడానికి పునాది వేసింది. ఒక కవిగా, రచయితగా రూపొందడానికి ఈ వాతావరణం ఎంతో దోహదకారి అయింది.

ప్రశ్న: మీరు ‘విరసం’లో ఎప్పుడు చేరారు? ఎన్నో సాహిత్య సంస్థలుండగా ‘విరసం’లోనే ప్రవేశించాలని ఎందుకనిపించింది?
జవాబు: అరసం, విరసం, జనసాహితి, సాంస్కృతీ సమాఖ్య ఇవన్నీ వామపక్ష భావజాలాలతో పనిచేసే సంస్థలు. కొంతకాలం నేను ప్రజాసాహితి కన్వీనరుగా పని చేసాను. కొంత నేను చదివిన వామపక్ష భావజాల సాహిత్యం సంస్థలు పనిచేసిన తీరు బట్టి నేను ఎటువైపు నిలబడాలని ఆలోచన వచ్చినప్పుడు ప్రజాసాహితి కన్వీనరుగా పని చేసాను.
90ల నుంచి విప్లవ రచయితలతో పరిచయం, స్నేహం ఏర్పడ్డాయి. అప్పుడే మొలకెత్తుతున్న స్త్రీవాద, దళిత, మైనారిటీ, దళిత అస్తిత్వ సాహిత్యం వస్తున్నప్పుడు ఎటువైపు ఉండాలి అని ఆలోచన వచ్చినపుడు విరసంలో ఉంటే బాగుంటుంది అని 2008లో గుంటూరు విరసం సభల్లో సభ్యునిగా చేరాను. 2014లో వరంగల్ మహాసభల్లో కార్యవర్గ సభ్యునిగా, 2020లో 50 ఏళ్ల మహాసభలు హైదరాబాదులో జరిగినపుడు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను. రెండేళ్ళుగా ‘అరుణతార’ సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

ప్రశ్న: ‘విరసం’పై ప్రభుత్వం ఎప్పుడు నిఘానేత్రాలు తెరచి వుంటుంది కదా! విరసంలో చేరాక మీరేమైనా సమస్యలు ఎదుర్కున్నారా?
జవాబు: నిర్బంధం, అరెస్టులు. జైళ్ళు విరసం సభ్యుల అనుభవాల్లో ఉన్నప్పటికీ, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2021లో విరసాన్ని నిషేదించారు. 3 నెలల తర్వాత తొలగించారు.

ప్రశ్న: దానికి కారణమేమిటి?
జవాబు: తెలంగాణా చీఫ్ సెక్రటరీకి 30 పేజీల మెమోరాండం ఇచ్చారు. విరసం సాహిత్యానికి 3 తరాల వారసత్వాన్ని ఇచ్చింది. విరసం హింసాత్మక రాజకీయాలు మాట్లాతుంది అనడం వాస్తవం కాదు. విరసం ఎప్పుడూ హింసను ప్రచారం చేయలేదు. తనదైన రచనా శైలిని సున్నితంగా వెల్లడించింది. ‘విరసాన్ని నిషేదించడమంటే తెలుగు సాహిత్యంలో ఒక పాయను నిషేదించడమే అని విరసం సభ్యులు ప్రభుత్వానికి వివరించారు.
ప్రశ్న: చాలామంది భార్యలు తమ భర్తలు భద్ర జీవితం గడపాలని, బాగా డబ్బు సంపాదించాలని అనుకొంటారు కదా! విరసంలో చేరాక మీ కుటుంబసభ్యులెలా స్పందించారు?
జవాబు: నా రాజకీయాలతో నా కుటుంబ సభ్యులకు ఏకీభావం లేకపోయినా, నన్ను వ్యతిరేకించలేదు, నిరుత్సాహ పరచలేదు. నా సహచరి, నా కూతురు. మధ్యతరగతి కుటుంబంలో వుండే చిన్న చిన్న కోరికలు ఉన్నాయికానీ, అవేవీ నన్ను అడ్డగించలేదు.

ప్రశ్న: టైలరు వృత్తిలో ఉంటూ సాహిత్య సేవ చేస్తున్నారు గదా! ఈ రెండింటికి పొంతన ఎలా కుదురుతుంది మీకు?
జవాబు: వృత్తికీ, సాహిత్య రచనకు సంబంధం ఉండదు. అత్యంత దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించిన గోర్కీ నుండి శారద వరకు కార్మిక రంగంలో పని చేస్తూనే విలువైన రచయితలుగా రాణించిన వారు సమకాలీన కాలంలో ఎంతోమంది ఉన్నారు. వారిలో నేనూ ఒకణ్ణి.

ప్రశ్న: మీరు సాహిత్య సృజన చేస్తూనే ‘అనేక’ అనే పుస్తకాల షాపును ప్రారంభించారు. మీ షాపులో ఎలాటి సాహిత్యం ఉంటుంది?
జవాబు: 2016లో నేను విజయవాడలో ‘అనేక’ పుస్తకాల షాపును ప్రారంభించాను. ప్రజలకు అందుబాటులో లేని కేవలం వామపక్ష బావజాలానికి సంబంధించిన సీరియస్ లిటరేచర్ను విజయవాడ పాఠకులకు అందించాలని నేను ఈ షాపు పెట్టాను. ఇప్పటికి ఎనిమిదేళ్ళు పూర్తయింది.

ప్రశ్న: పాఠకుల గురించి చెప్పండి.. పెరిగారా? తగ్గారా?
జవాబు: కమర్షియల్ పాఠకులు తగ్గారు. కానీ సీరియస్ లిటరేచర్ అధ్యయనం చేసేవాళ్ళు తగ్గలేదు. ఇతర రాష్ట్రాల పాఠకులు కూడా పుస్తకాలు కావాలని అడుగుతారు. వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఎగ్జిబిషన్లు పెట్టాను.

ప్రశ్న: మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందలేదు. కారణమేమిటంటారు?
జవాబు: మనకు 47లో స్వతంత్ర్యం వచ్చిందని అంటారుకానీ, స్వతంత్రం కాదది. అది కేవలం అధికార మార్పిడి. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఏ విదానాలు వలస పాలనలో అమలయ్యాయో అవే విధానాలు వలస పాలన అనంతరం కూడా అమలవుతున్నాయి. సోషలిజం నెహ్రు ఊహాస్వప్నమైనప్పటికీ అది సఫలం కాలేదు.
95లో వచ్చిన ప్రపంచీకరణ మధ్యతరగతిని ధనవంతులుగా చేయగలిగిందే కానీ రైతుల్నీ, చేతివృత్తుల వారినీ ఆత్మహత్యల వైపు నెట్టింది. “ఆగస్ట్ 15 ద్రోహం చెప్పకపోతే అన్నంగూడా సహించదు” అని చెరబండరాజు చెప్పింది ఇప్పటికీ వాస్తవమే.
75 ఏళ్ళలో జరిగిన విధ్వంసం, కోట్లాది ప్రజలను భూమినుంచి దూరం చెయ్యడం లాంటి అమానుష కృత్యాలు ఇప్పటికీ మరచిపోలేము. ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోకపోవడమే దీనికి కారణం.

ప్రశ్న: ‘చినుకు’ పత్రికలో మీ కవిత ‘రూపాయి కలం’ వచ్చింది. మీరు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నపుడు మీ మాష్టారు మీకొక కలం ఇస్తారు. కవిత బాగుంటుంది. నేపథ్యం చెప్తారా?
జవాబు: నేను మీ ఊరి బడిలో చదివేటప్పుడు మా ఇంటి పక్కన గానుగ ఆడే కుటుంబం ఉండేది. అక్కడే అప్పారావు అనే మేష్టారు ఉండేవారు. ఆ రోజుల్లో పోలియో, క్షయ జబ్బులతో బాధ పడేవారు. బాగా చదువుకున్న వ్యక్తి. వూళ్ళో వున్నవాళ్లు తమ పిల్లల్ని ఆయన దగ్గరకు పంపించడానికి సందేహించేవారు. ఈ గ్రామంలో మా అమ్మ నన్నక్కడకు పంపింది. నేను చేరాక 20 మంది పిల్లలు ఆ ట్యూషన్లో చేరారు. ఆయన జానపద కథలు చెప్తూ తరగతిలో పాఠాలు చెప్పేవారు. అలా అక్కడ నేర్చుకున్నవాళ్లు చదువులో రాణించారు. మేష్టారు 2 రోజుల్లో చనిపోతారనగా ఆస్పత్రికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక సిరా పెన్ను కొనిచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆయన మరణించారు. ఆయనిచ్చిన కలం రూపాయి కలం గుర్తుండి ‘రూపాయి కలం’ కవిత రాసాను.

ప్రశ్న: మీరు మొదట రాసిన కవితా సంపుటి ‘తడి ఆరని నేల’, ఇటీవల ‘ఈ వేళప్పుడు’ వచ్చింది. ఈ రెంటికీ వస్తు శిల్పాలల్లోనూ, కవితా నిర్మాణ పద్ధతుల్లో చాలా తేడాలున్నాయి. కారణాలు వివరిస్తారా?
జవాబు: ప్రాథమిక స్థాయిలో రాసింది ‘తడి ఆరని నేల’. శిల్పం, కవిత్వ పరిభాష తెలీని కాలంలో రాసింది. ఐతే మొదటి పుస్తకం కాబట్టి సాంద్రత, రాజకీయ వ్యక్తీకరణలో తీవ్రత లేకపోవడం వలన ఒక తాజాదనంతో వచ్చింది.
‘ఈ వేళప్పుడు’ పూర్తిగా రాజకీయ కవిత్వం. రాజకీయ ఆంగాలను కవిత్వం చెయ్యడం చాలా కష్టమైన పని. అలా ‘ఈ వేళప్పుడు’ పుస్తకంలోని కవిత్వాన్ని అంచనా వెయ్యవలసి వుంది. నా రెండు పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, తెలుగునాట జరుగుతున్న రాజకీయ ఘటనల చారిత్రకతను నమోదు చేసే కవితా రచన అవుతుంది.

ప్రశ్న: ఉత్తమ కవిత్వానికి నిర్వచన మేమిటంటారు?
జవాబు: కవిత్వ రచనలో ఉత్తమ కవిత్వమంటూ ఏమీ ఉండదు. కవి తను తీసుకున్న వస్తువును మొదలు పెట్టడం, కొనసాగించడం, ముగించడం ఈ మూడింటి మధ్య సమతుల్యతను పాటించి, సాంద్రతగా, శిల్పంగా రూపొందించగలిగితే మంచి కవిత్వం నిర్మితమౌతుంది. చదిమే క్రమంలో పాఠకుడు పొందే భావోద్వేగాలకు సరితూగే కవిత పరిమితులకు, కవిత కవియొక్క మేలిమిని, నైపుణ్యాన్ని తెలియచేస్తుంది. ఉత్తమ కవిత, ఉత్తమ రచన అనే మాట సృజనాత్మక ప్రక్రియలకు ఒక అదనపు మాటే గానీ కవి రచన మాత్రమే, కవి రాసిన కవిత్వం మాత్రమే కవికి అనువర్తింపబడిన బాధ్యత.

ప్రశ్న: కవిత్వం ఒక జీవనది. తెలుగు కవిత్వ ప్రయాణం గురించి వివరించండి.
జవాబు: తెలుగు కవిత్వానికి సంబంధించినంత వరకు తొలి దశలో భావకవిత్వ యుగమైనప్పటికీ, 1925లో కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలోకి రావడం, కొత్త భావజాల ప్రపంచం రూపుదిద్దుకొని ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినవారు విద్యావంతులు కావడం, నూతన ఆలోచనలకు స్వాగతించడం, ఈ కారణాలన్నీ తెలుగు కవిత్వాన్ని అభ్యుదయ మార్గల్లో నడిపించింది. 50వ దశకం చివరకు అభ్యుదయ భావజాలం స్తబ్దతకు గురయింది. 60వ దశకంలో దిగంబర కవులు స్తబ్దతను తొలగించే ప్రయత్నం చేసారు. 70ల్లో విరసం ఆవిర్భవించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు విప్లవ కవిత్వం ప్రాధాన్యతను సంతరించుకుంది. 80వ దశకం చివర స్త్రీవాద, దళిత కవిత్వం, బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత మైనారిటీ వాద కవిత్వం మొత్తంగా 100 ఏళ్ల కవిత్వాన్ని అంచనా వేస్తే అభ్యుదయ, విప్లవ, ప్రగతిశీల భావజాలం వైపు ప్రయాణం చేసింది.

ప్రశ్న: మీరు కవిత్వం, విమర్శ తప్ప మిగిలినవి రాయలేదు. కారణమేమిటి?
జవాబు: ఏదో ఒక ప్రక్రియలో కృషి చేస్తే మనదైన ముద్రను వేయగలము అని కవిత్వమే రాస్తున్నాను.

ప్రశ్న: వర్తమాన సంక్షోభ పరిస్థితుల్లో కవుల కర్తవ్యం ఏమిటి?
జవాబు: పాలక పక్ష విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి కవులు, కళాకారులు సంఘీభావం ప్రకటించాలి. ప్రభుత్వం ఒక మెట్టు దిగేటట్లుగా కవులు రచనలు చేయాలి. రచయిత బలం, పోరాటశక్తి దీని మీద ఆధారపడి వుంది. ఫ్రెంచి విప్లవమైనా, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమైనా రచయితల, కళాకారుల తోడ్పాటుతోనే సఫలీకృతమైనాయి. కళ్ళముందు కనిపించే ఉదాహరణలివి. ఆయా ఉద్యమాలను పోరాటాలను కవులు, రచయితలు తమ రచనలతో సఫలీకృతం చేస్తారు.

మందరపు హైమవతి
(94410 62732)

SA:

View Comments (2)

  • ఇంటర్వ్యూ బాగుంది. అయితే సాహితీవేతలతో ఉన్న పరిచయాలు లేకపోవడం సమగ్రత అన్పిచ్చుకోలా

  • మీ సాహితీ ప్రయాణం దిశ నిర్దష్టంగానే ఉన్నాయి తప్పటడుగులు,తప్పు అడుగులు మాత్రం కన్పించలే! మొత్తానికి మీ జన్మ ధన్యమే!