అరసవిల్లి కృష్ణ ఆర్బమైన కవి. కవిత్వం పుట్టుగడి తెలిసిన కవి. ఆయన ఈ ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూస్తారు. కవిత్వంతోనే అర్థం చేసుకుంటారు. కవిత్వాన్ని వెంటేసుకొని ఈ సంక్షుభిత సమాజమంతటా తిరుగుతుంటారు. కవిత్వపు కంఠస్వరంతోనే మాట్లాడుతుంటారు. స్వప్నాలను, విలువలను, ఆశయాలను, విప్లవాలను ఆయన కవిత్వీకరించి సొంతం చేసుకుంటారు. సకల దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేకతలను, దాస్టీకాలను, రాజ్యపు దౌర్జన్యాలను, సాంస్కృతిక హింసలను కవిత్వంలోంచి నిలేస్తుంటారు. కవిత్వపు అండతోనే నిత్యం వేదికలు ఎక్కీ దిగుతుంటారు. దేనికైనా ఆయనకు కవిత్వమే మాధ్యమం. కవిత్వమే ఆయన భాష. కవిత్వమే అభివ్యక్తి. ‘ఈ వేళప్పుడు‘ ఇటీవల కృష్ణ వెలువరించిన కవితా సంపుటి.
ఆయన రాజకీయాలను మానవ జీవిత ఉద్వేగాలన్నిటిలోంచి చూసి కవిత్వం చేస్తారు. రాజకీయాల్లోకి వెళ్లగల మార్గాలన్నిటినీ తెలుసుకుంటారు. అట్లా తెలుసుకుంటూ విప్లవ సాహిత్యోద్యమంలోకి చేరుకున్నారు. కవిత్వ రచనలో కనిపించే ఆయన నిశిత దృష్టి జీవితానికి సంబంధించింది. అంటే రాజకీయాలకు చెందినది. కవిత్వం రాయడం ఆరంభించినప్పటి నుంచి విప్లవ రాజకీయాలను గమనిస్తూ వచ్చారు. తన కవితా యానంలోంచే రాజకీయాలను అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుందిగాని నిజానికి ఆయన ప్రజా రాజకీయాలను పసిగట్టే క్రమంలోనే తన కవిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. తనలోని కవి వ్యక్తిత్వానికి ఒక బలమైన రాజకీయ పునాది అవసరం అని గుర్తించి దాన్ని నిర్మించుకుంటూ వచ్చారు.
ఆ రకంగా రెండు దశాబ్దాల విప్లవ కవిత్వంపై ఆయనది ఒక ప్రత్యేకమైన సంతకం.
విప్లవ రచయితల సంఘంలో ఆయన 2008లో చేరారు. అప్పటికే ఆయన ప్రముఖ కవి. మిగతా ప్రక్రియల్లో ప్రవేశమున్నప్పటికీ కవిత్వమే ప్రధానం. పాలపిట్ట ప్రచురణగా ‘తడి ఆరని నేల’ తొలి కవిత్వ సంపుటి 2011లో వెలువడింది. 2012 నుంచి ఇప్పటి దాకా రాసిన కవిత్వం ‘ఈ వేళప్పుడు’ ఈ కవితా సంపుటి.
తడి ఆరని ఆయన వ్యక్తిత్వమే ఈ కవిత్వానికి మాతృభూమి. విరసంలో చేరేనాటికే ఆయన సాహిత్య కార్యకర్తృత్వం కూడా కొనసాగించేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన కవి గొంతుక పదునెక్కింది. విప్లవ సాహిత్యోద్యమంలోకి రావడం వల్ల మానవ జీవితంలో కవిత్వమే చేయగల పనులన్నీ తెలుసుకున్నారు. ఈ తెలివిడితో ఆయన కవిత్వం మారుతూ వచ్చింది. ఈ కవితా సంపుటి నుంచి దాన్ని వివరించవచ్చు.
ఆరసవిల్లి కవిత్వ పరిణామం చాలా ఆసక్తికరం. ఏ కవిలో అయినా ఐదేళ్లలో, పదేళ్లలో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది. అలాగే అరసవిల్లి కవిత్వం కూడా చాలా అంతర్లీనంగా, సుతిమెత్తగా ఒక ముఖ్యమైన మార్పుకు లోనైంది.
ఈ పది పన్నెండేళ్లలో ఆయన కవిత్వం మీద మిత్రులు కొన్ని పరిశీలనలు చేశారు. విరసంలో చేరాక అరసవిల్లి కవిత్వం క్వాంటిటీ తగ్గిందని వాటి సారాంశం. ఇది కేవలం కవితల సంఖ్యకు సంబంధించిందే కాదు. ఆయన తన కవిత్వ సమయాన్ని కోల్పోతున్నాడనో, వేరే పనులకు వెచ్చిస్తున్నాడనో, ఆ మేరకు సృజన శక్తి బలహీన పడుతున్నదనో కూడా కావచ్చు. అట్లాగే వస్తు వైవిధ్యం తగ్గిందా? అని సందేహించిన వాళ్లూ ఉన్నారు. నిజంగానే ఇవి ఆసక్తికరమైన పరిశీలనలు.
‘ఈ వేళప్పుడు’ సంపుటాన్ని ఈ వైపు నుంచి కూడా చూడవచ్చు. “ఈ వేళప్పుడు’లో 62 కవితలు ఉన్నాయి. ఇవన్నీ చదివితే… జీవితాన్ని అపారంగా అనుభవిస్తూ, సమాజాన్ని అనుక్షణం పరిశీలిస్తూ కవిత్వం కాగల సమయాలన్నిటినీ ఒడిసిపట్టుకున్నట్లు తెలుస్తోంది. కవి ప్రత్యేక జీవి కాదుగాని కవిత్వంగా మారే అనుభవ కోణం ప్రత్యేకమైనదే. కవిగా అరసవిల్లికి ఈ కోణం మొదటి నుంచీ ఉన్నదే. కానీ విప్లవ సాహిత్యోద్యమంలోకి వచ్చినందు వల్ల, నిర్మాణ బాధ్యతలు చేపట్టడం వల్ల ఆరసవిల్లికి ప్రజా జీవితం పెరిగింది. పాఠకులు పెరిగారు. శ్రోతలు పెరిగారు. వాళ్లంతా ఒక తరహా సమూహం కాదు. భిన్న స్థాయిలకు, భిన్న నేపథ్యాలకు చెందినవారు. ఒక మామూలు కవికి ఉండనంత వైవిధ్యభరిత సమూహాలవి.
-పాణి
‘ఈ వేళప్పుడు’
రచయిత: అరసవిల్లి కృష్ణ (9247253884)
వెల: రూ. 120/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ.
Great 🙏🙏🙏
కవి అంతరంగాన్ని ఆవిష్కరించారు..