స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

హిమశైల శిఖరం ఎలుగెత్తి పిలిచింది
సాగరం ఎదపొంగి స్వాగతం పలికింది
ఓ భారతీయుడా స్వాతంత్ర పౌరుడా
ఏ జన్మ పుణ్యమో ఈ తల్లి నీదిరా…

స్వేచ్ఛాభారతిని కాంక్షించి, లక్షలాదిమంది ప్రాణాలర్పించిన మహోజ్వలమైన ఘట్టం
భారత స్వాతంత్ర పోరాటం. ఆంగ్లేయుల పాశవికమైన పాలన నుండి, మన
మాతృభూమిని విముక్తం చేయాలని, మనసారా విశ్వసించి తమ జీవితాలను
తృణప్రాయంగా ధారపోసిన వీరులు ఎందరో…వీరనారీమణులు మరెందరో.
వందేమాతరమంటూ చెరసాలల్లో చిత్రహింసలు అనుభవించిన దేశభక్తులు,
జాతీయపతాకాన్ని చేతబూని మండుటెండల్లో బ్రిటీష్ పాలకుల కొరడా దెబ్బలకు
శరీరమంతా రక్తం ధారలు కట్టిన త్యాగధనులు ఎందరో.. ఎందరెందరో..
చేతిలో భగవద్గీతతోఉరికంబాల పై ప్రాణాలనర్పినూ, ఏనాటికైనా ఈ భారతదేశం
స్వతంత్రం కావాలని మనసారా వాంఛించిన మహితాత్ములు ఇంకెందరో…
ఈ దేశభక్తుల, ఈ ధర్మమూర్తుల, ఈ కర్మవీరుల, ఈ త్యాగధనుల త్యాగాల
ఫలమే, పోరాటాల ఫలితమే, ప్రపంచ చరిత్రలోనే తిరుగులేనిమహోజ్వలమైన
అధ్యాయం భారత స్వరాజ్య సంగ్రామం. ఈ త్యాగధనులకు, ఈ కర్మధనులకు,
ఈ పుణ్యపురుషులకు, ఈ సహృదయమూర్తులకు నివాళి సమర్పించడం మనందరి
కర్తవ్యం. గురుతరమైన బాధ్యత, ఇది నిస్సందేహం.  ఈ 72వ స్వాతంత్ర్య
దినోత్సవాల సందర్భంగా,ఈ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి,
ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. డా. దీర్దాసి విజయభాస్కర్. ఆంధ్రప్రదేశ్భా
షా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, ఓ గొప్ప కార్యక్రమానికి సంకల్పించారు.
స్వరాజ్యవీరులకు ఘననివాళి సమర్పించాలని నిశ్చయించారు.

అదిగో… అలా.. డా.విజయభాస్కర్ సంకల్పం నుండి ఉ ద్భవించింది. “స్వాతంత్ర భారతికి చిత్రకళాహారతి” అనే విశిష్టమైన కార్యక్రమం. అజ్ఞాతులైన ఎందరో స్వాతంత్ర్య వీరుల, దివ్య రూపాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన గొప్ప ప్రయత్నం ఇది. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన, చిత్రకారుల్నిఒక్కచోట చేర్చి, వారందరికీ, విజయవాడలో మూడురోజులు వసతి సౌకర్యాలు కల్పించి, వారందరి హృదయాలలో స్వాతంత్ర్య స్ఫూర్తిని మేల్కొలిపి, స్వరాజ్యవీరుల చిత్రాలను రూపుదిద్దించిన, సంపూర్ణమైన ప్రయత్నం ఇది. ఈ సంకల్పానికి అండదండలంధించింది విజయవాడ ఆర్ట్స్సొసైటీ. అందమైన చిత్రాలు గీయడంలో, మన రాష్ట్రంలోని 30 మంది అందెవేసిన చిత్రకారుల్ని ఎంపిక చేసుకొని, వారికి ఈ బాధ్యతను అప్పజెప్పి వారందరికీ అవసరమైన సౌకర్యాలను అందించి, స్వరాజ్య పోరాట వీరుల్ని మన కళ్ళముందు నిలపడంలో విజయవాడ ఆర్ట్స్ సొసైటీనిర్వహించిన పాత్ర ఎంతో… మరెంతో ప్రశంసనీయం. ఈ కళాప్రాంగణంలో రూపుదిద్దుకొన్న చిత్రాలన్నీ, నిస్సందేహంగా గొప్ప కళాఖండాలు. ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క వీరుడి కథని మన కళ్ళముందు నిలుపుతుంది. స్వాతంత్ర్యపోరాటంలోని ఒక్కో ఘట్టాన్ని మనముందు, అద్భుతంగాదర్శింపచేస్తుంది.
ఒక చిత్రం ప్రథమ స్వాతంత్ర్య పోరాటాన్ని మహావీరుడు “తాంత్యాతో పేని (ఆర్టిస్ట్-ఎ. అప్పారావు)ఎంతో స్ఫూర్తివంతంగా చూపిస్తే, మరోచిత్రం “జలియన్ వాలాబాగ్ మారణకాండని” (ఆర్టిస్ట్-చిదంబరం) ఈ తరంముందు అద్భుతంగా ఆవిష్కరించింది.

“స్వరాజ్యం నా జన్మహక్కు అని ఎలుగెత్తి చాటిన బాలగంగాధర్ తిలక్”ని
ఎంతో హృద్యంగా తన చిత్రంలో ప్రదర్శించాడు ఓ చిత్రకారుడు. దేశ
స్వాతంత్ర్యం కోసం, అండమాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించిన
వీరసావర్కర్ ని ఎంతో శక్తివంతంగా చూపించాడు మరో చిత్రకారుడు.
ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో తొలి వీరుడు, బ్రిటీష్ పాలకులను
ఎదిరించి, ఉరికంబం ఎక్కినధీరుడు “మంగళ పాండే”(ఆర్టిస్ట్-దివాకర్)ని
ఎంతో గొప్పగా చిత్రించాడు ఓ చిత్రకారుడు, రణరంగంలో వీర విక్రమంతో
శతపోరుసల్పి, దేశం కోసం ప్రాణాల నర్పించిన వీరనారి “ఝాన్సీలక్ష్మీబాయిని
-శ్రీనివాసరెడ్డి), ఆనాటి ఆమె పోరాట సన్నివేశాన్ని ఎంతో సమర్ధవంతంగా
ప్రతిఫలింపచేశాడు ఇంకో చిత్రకారుడు. నా పేరు “ఆజాద్” అంటూ,
గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో బదులు పల్కిన, భారత యువకిశోరం
చంద్రశేఖర్ ఆజాద్” (ఆర్టిస్ట్-ప్రశాంత్) వీరత్వంమూర్తీభవించి
కన్పిస్తాడు ఓ చిత్రంలో..

ఉక్కుమనిషి సర్దార్ పటేల్ (ఆర్టిస్ట్-శ్రీనివాస్), జాతిపిత మహాత్మాగాంధీ(ఆర్టిస్ట్-జీవన్ గోషిక), నేతాజీ సుభాష్ చంద్రబోస్ (ఆర్టిస్ట్-సోమశేఖర్), ఆంధ్ర వీర అల్లూరి సీతారామరాజు (ఆర్టిస్ట్-సుబ్రహ్మణ్యం కొలుసు), వీరపాండ్య కట్టబొమ్మన్ (ఆర్టిస్ట్-అల్లు రాంబాబు)… ఇలాఎందరో మహితాత్ములు ఈ చిత్రాలన్నిటా దర్శనమిస్తారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయమైన, చీరాల పేరాల ఉద్యమానికి రూపకర్త, సుప్రసిద్ధ సత్యాగ్రహ యోధుడు, గాంధేయవాది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య(ఆర్టిస్ట్-వెంపటాపు) చిత్రం చూస్తే, స్వయంగా గోపాలకృష్ణయ్య మనని చూస్తున్నట్టు అన్పిస్తుంది.

మహాత్ముడికి అత్యంత ఆత్మీయుడు, కాంగ్రెస్ గ్రంథ రూపకర్త “డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య” (ఆర్టిస్ట్-మధు)చిత్రం, త్రివర్ణ పతాక రూపకర్త, స్వరాజ్య సంగ్రామానికి స్ఫూర్తి ప్రదాత “పింగళి వెంకయ్య”(ఆర్టిస్ట్-యం, కాంతారావు), జెండావీరుడు తోట నర్సయ్యల (ఆర్టిస్ట్-వేణుగోపాల్), మరాఠ వీరుడు చత్రపతి శివాజీ (ఆర్టిస్ట్-శ్రీమతి రమ) చిత్రాలు జీవకళతో దర్శనమిస్తున్నాయి.

ఇలా… ఈ చిత్రకళా ప్రదర్శనలోని చిత్రాలన్నీ చిత్రకారుల అద్భుత ప్రతిభ నుండి ఉద్భవించిన కళారూపాలు. చిత్రకారుల హృదయం నుంచి వెలికి చూసిన రసజ్ఞతా పూర్వకమైన అద్భుత ప్రదర్శనలు. విజయవాడ ఆర్ట్స్ సొసైటీ నిర్వహణా సామర్థ్యానికి మచ్చుతునక ఈకళాప్రదర్శన..

72వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా, విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, సహృదయమూర్తి, గాంధేయవాది, తెలుగుభాషాభిమాని అయిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖఆధ్వర్యంలో రూపు దిద్దుకొన్న ఈ ప్రదర్శనని, ఈ ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులని, వారి కృషిని అభినందించి, చిత్రకారులందరినీ పేరు పేరునా సత్కరించి, గౌరవించారు.

ఈ మంచి ప్రయత్నంలో మరొక అనుబంధ కార్యక్రమం కూడా నిర్వహించింది విజయవాడ ఆర్ట్స్ సొసైటీ. వందలాది మంది, పిల్లల్ని ఆహ్వానించి, వారందరికి స్వాతంత్ర పోరాటంలోని ఘట్టాలను వివరించి, వారిచేత చిత్రాలను వేయించి, పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రత్యేకబహుమతులను ప్రదానం చేసింది ఆర్ట్ సొసైటీ. వందలాదిమంది పిల్లల హృదయాలలో స్వాతంత్ర పోరాట త్యాగాలను స్థిరం చేసే, ఈ సంకల్పం నిస్సందేహంగా గొప్పది. ఎంతగానో ప్రశంసనీయమైనది. పోటీల నిర్వహణ కార్యక్రమాన్ని శ్రీనివాస్ నిర్వహించారు. విశాఖపట్నం నుండి వచ్చిఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జయదేవ్, స్వరాజ్య గీతాలను గానం చేస్తూ, మంచి ప్రసంగం చేశారు. విజయవాడ కల్చరల్ సెంటర్, సి.ఇ.ఓ. శ్రీ ఈమని శివనాగిరెడ్డిగారు, అందర్నీ మనసారా అభినందించారు.

ఆగష్టు 14న ప్రారంభమైన ఈ చిత్రకళా ప్రదర్శనని 14, 15 తేదీలలో ఎందరో విద్యార్థినీ విద్యార్థులు దర్శించారు. మనకోసం, మన

స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తమ జీవితాల్ని బలిదానం చేసిన ఈ త్యాగధనులకు ఘననివాళి సమర్పించారు. ఇదొక గొప్ప ప్రయత్నం… ఇదొక ప్రశంసనీయమైన కార్యక్రమం. ఇదొక విశిష్టమైన, శక్తివంతమైన, స్ఫూర్తివంతమైన చిత్రకళాప్రదర్శనం. ఈ ప్రోగ్రాంని కోర్డినేట్ చేసిన కొలుసుసుబ్రమహ్మణ్యం గారికి, ఆ చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఆర్టికల్ రాయించిన ఎడిటర్ కళాసాగర్ గారికి దీనికి, కారణభూతమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, డా. దీర్ఘాసి విజయభాస్కర్ గారికి, విజయవాడ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు అల్లు రాంబాబు గారికి, సొసైటీ కార్యవర్గసభ్యులకు, చిత్రకారులందరికీ నా అభినందనలు. శుభాభినందనలు.

వాద్రేవు సుందర రావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap