గోఖలే గారితో చిత్రానుబంధం- కళాధర్

సినీ కళాదర్శకులు కళాధర్ జన్మదిన సందర్భంగా…

పాతాళ భైరవి, గుండమ్మకథ లాంటి సినీమాలకు కళాదర్శకుడిగా పనిచేసిన కళాధర్ గారు వారి అనుభవాలను గ్రంథస్తం చేసారు. తెలుగు సినీమా కళాదర్శకత్వానికి సంభంధించిన వివరాలతో వచ్చిన మొదటి పుస్తకం ‘సినిమా కళలో కళాధర్ ‘ . ఇందులో వారు కళా దర్శకులు మాధవపెద్ది గోఖలే గారితో వారి ఆనుభవాలను రాసుకున్నారు… మీ కోసం…
గోఖలేగా పాపులర్ అయిన వారి పూర్తి పేరు మాధవ పెద్ది గోఖలే. కళాసంపద వారికి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి. ఆయన ఉత్తమ చిత్రకారుడే గాక పరిణితి చెందిన రచయిత. పల్లెటూరు మాటల తీరును పరిశీలించి సహజధోరణిలో ఉండేలా పాత్రలు సృష్టించి రచన చేసేవారు. అవి చదువుతూ ఉంటే పాత్రలు మన చుట్టూ ఉన్న అనుభూతి కలిగేలా ఎంతో ఆనందాన్ని అందించేవారు. ఆదర్శవాదిగా రచనలు చేస్తూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఎన్నో రకాల కార్టూన్లు వేసేవారు. ఎంతో కార్యదీక్షతో పనిచేసేవారు. నాగిరెడ్డి, చక్రపాణి గార్ల నిర్వహణలోని ‘చందమామ’ మాసపత్రికకు చిత్రకారుడిగా ఉద్యోగంలో చేరి, వారే 1949లో ప్రారంభించిన విజయా ప్రొడక్షన్స్ లో వారినీ, నన్ను కళాదర్శకులుగా నియమించారు. అప్పటినుంచి గోఖలేగారు, నేనూ కలిసి సుమారు 20 సంవత్సరాలు మా సేవలను విజయా సంస్థకు అందించాము.

ఆ రోజుల్లో విజయా, వాహిని సంస్థల నుంచి చిత్రాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూసేవారు. అందుకు కారణం ఆ చిత్రాల్లో సంగీత సాహిత్యాలే కాకుండా సాంకేతిక విలువలు కూడా ఉన్నతస్థాయిలో ఉండేవి. ఒక సందర్భంలో గోఖలే గారితో “మనం ఫలానా హిందీ చిత్రం చూద్దాం” అంటే ఆయన “వద్దు, దాని ప్రభావం మన మీద పడితే మన సృజనాత్మకశక్తి కల్తీ అవుతుందని” అన్నారు. రీమేక్ చిత్రాలకు పనిచేయవలసి వచ్చినప్పుడు సృజనాత్మకకు అవకాశం తక్కువ అనే ఉద్దేశ్యంతో తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. డ్రాయింగ్ వేయటానికి ఎంతో శ్రమ, శ్రద్ధ తీసుకునివొళ్ళు మరచి పనిచేశేవారు. అదే ఆయనకి సంతృప్తి, నేను అనుకున్న పద్ధతిలో పనిచేయగలిగితేనే నేను ఒప్పుకుంటాను. లేకపోతే పనిచేయను అనే నియమానికి కట్టుబడి ఉండేవారు. ఆ కారణంతో చాలా పిక్చర్లు మానుకున్నారు కూడా. అది ఆ జీవితానికున్న ఆదర్శం. ఆ జీవితం అలాగే వెళ్ళిపోయింది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు నిర్మాతలు తమ చిత్రాలకు గోఖలే గారిని బ్రతిమాలి చిత్రాలు వేయించుకున్నారు.
దానికి కారణం ఆయన వేస్తేనే ఆధారిటేటిగా, ఆథంటిక్గా ఉంటుంది. నాకు పని లేకపోతే హాయిగా రచయితగా ఇంట్లో కూర్చొని కథలు వ్రాసుకుంటా గాని రాజీపడి పనిచేయవలసిన అవసరం నాకు లేదు అని తెగించి చెప్పగలిగే ధీశాలి. గోఖలే గారు సహజత్వానికి దగ్గరలోనే ఫాంటసీ తీసుకు రాగలిగేవారు. అజంతా ఎల్లోరా, అమరావతి, హంపి శిల్పాలతో పాటు పల్నాడు చిత్రాలను కూడా ఎంతో గొప్పగా చిత్రించేవారు.

పౌరాణిక జానపద చిత్రాలకు ఆయన పెన్నిధి. శ్రీయుతులు యన్.టి.రామారావు, యం.యస్.రెడ్డి, పుండరీకాక్షయ్య, కె.వి.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి వీరంతా శ్రీ గోఖలే గారి సమర్ధతను చక్కగా ఉపయోగించుకున్నారు. డబ్బు గురించి మరచిపోయి పనినే దైవంగా భావించి వృత్తికి న్యాయం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న మనిషి శ్రీ గోఖలే. మేము 20 సంవత్సరాలు ఒకే కుటుంబ సభ్యుల్లా మెలిగాము. ముఖ్యంగా విజయా సంస్థలో ఎవరు గోఖలే, ఎవరు కళాధర్ అనేది తెలియనంత సన్నిహితంగా కలిసి పనిచేశాము. కొంతకాలం ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటు విడివిడిగా పనిచేశాము. నేను ఆర్ట్ డైరెక్టర్‌గా “ఉన్న పద్ధతులలో సర్దుకుపోతూ తంటాలు పడుతున్నాను” అని అంటే లోలోన సంతోషించేవారే తప్ప తను లొంగివచ్చేవారు కారు.
ఈ కాలంలో ఆర్ట్ డైరక్టర్ పనిలేదు. నేను వెళ్ళిపోతున్నానులే అన్నట్టుగా ఆయన 1981లో కీర్తిశేషులయ్యారు.
తుదిశ్వాస విడిచేవరకు ఆయనకు ఉన్న ఆదర్శాలను వదులుకోలేదు. అదే నా ఆత్మీయ మిత్రుడు మా గోఖలేలోని ప్రత్యేకత.

-కళాధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap