- గురజాడ అప్పారావు 159 వ జయంతి వేడుకలు
* సుమారు 80 చిత్రాలతో ఈ చిత్రకళాప్రదర్శన ప్రారంభం ..
విజయవాడలో బందర్ రోడ్ లో వున్న బాలోత్సవ్ భవనం లో 21-9-21, మంగళవారం ఉదయం ‘జాషువా సాంస్కృతిక వేదిక’ వారు మహాకవి జాషువా 126 వ జయంతి ఉత్సవాలను మంగళవారం ప్రారంభించారు. తొలిరోజు బాలల చిత్రాలతో ఆర్ట్ గ్యాలరీ ని ప్రారంభించారు. అలాగే గురజాడ అప్పారావు 159 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి బాలోత్సవ్ కమిటీ గౌరవ అధ్యక్షుడు చలువాది మల్లికార్జునరావు మాట్లాడుతూ.. మహాకవి గురజాడ అప్పారావు రచనలు ఆదర్శమని, ఆయన మాటలు ఇప్పటి జీవన విధానానికి వర్తింపజేసుకోవచ్చని పేర్కొన్నారు. పిల్లల్లో సమాజంపై అవగాహన కల్పించేందుకు, సృజనాత్మకత పెంపుదలకు చిత్రలేఖన పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు. ఆర్ట్ గ్యాలరీని తిలకించి, నిర్వాహకులను అభినందించారు. “దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుసులోయ్…” అన్న గురజాడ గేయానికి పాఠశాల, కళాశాల విద్యార్థులు చిత్రించిన సుమారు 80 చక్కటి చిత్రాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ప్రముఖ చిత్రకారుడు టి.వి. చిత్రాలు కూడా వున్నాయి.
కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ ఆర్ట్స్ నిర్వాహకులు ఎ.సునీల్ కుమార్, “ప్రస్థానం” పత్రికా ఎడిటర్ సత్యాజీ, ’64కళలు.కాం’ ఎడిటర్ కళాసాగర్, ప్రముఖ చిత్రకారుడు టి.వి, ఆర్టిస్ట్ గిరిధర్, చిత్రం సుధీర్, జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి, నిర్వాహకులు గుండు నారాయణరెడ్డి, సి.ఆర్. రావు, రాజు, అమరావతి బాలోత్సవం కన్వీనర్ పిన్నమనేని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. “ప్రస్థానం” పత్రికా ఎడిటర్ సత్యాజీ మాట్లాడుతూ వందేళ్ళ క్రితం గురజాడ రాసిన “దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుసులోయ్…” అన్న గురజాడ గేయం ఒక భారత దేశానికి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికీ వర్తిస్తుందని, ఆయన ఆలోచనలు నేటికీ నిత్యనూతనమని పేర్కొన్నారు. ’64కళలు.కాం’ ఎడిటర్ కళాసాగర్ మాట్లాడుతూ “దేశమంటే మట్టికాదోయ్… ” అన్న గురజాడ గేయానికి బొమ్మలు వేయడం చాల క్లిష్టమని, అయినా చాలా మంచి చిత్రాలు గీసారని, చిత్రకారులను అభినందించారు. విజయవాడ లాంటి నగరంలో ఆర్ట్ గ్యాలరీల అవసరం చాలా వుందని, ఆ లోటు నగరం నడిబొడ్డున వున్న ఈ ఆర్ట్ గ్యాలరీ తీరుస్తుదని అన్నారు. గ్యాలరీల కోసం వేలకువేలు అద్దె కట్టి తమ చిత్రాలను ప్రదర్శించుకోలేని స్థితిలో చిత్రకారున్నారని, ఇలాంటి వేదిక వారిలో కొత్త ఆశలు చిగురింపజేస్తుందన్నారు. ఈ సభలో ఈ ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రముఖుల చేతులమీదుగా అందజేశారు. ఈ చిత్రకళాప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగుతుంది.
Very Nice