కళలకు సృష్టికర్త, కళాకారుడు-జనం అంటే కళలను దర్శించి ఆనందించేవారు, సామాన్య పౌరులు! జనులలో రెండు రకాల వారుంటారు ఒక వరం కళలోని లోతుపాతులను తెలియకనే Intution తో ఆనందించే వారు. రెండో తరగతి తెలిసి ఆనందించేవారు! ఆనందమే ఆదరణకు కారణమౌతుంది. ఆదరణ అంటే ఏమిటి? మెచ్చుకోవటం, ఇంకా చెప్పాలంటే కళాకారుని శ్లాఘించటం! కళాకారుడు సృష్టించిన చిత్రాలను సేకరించి తమ భవంతులను అలంకరించుకోవటం! ఆనందాను భూతిని నొందిన వారిలో కొందరు మాత్రమే శిల్ప చిత్రాలను ఖరీదు చేసి, తమ స్వంతం చేసుకోగలుగుతారు! అప్పుడే చిత్రాల ద్వారా చిత్రకారునికి విలువ పెరుగుతుంది. నేటి సమాజంలో వస్తువుకు విలువ గట్టడమంటే ఆర్థికంగా మూల్యం చెల్లించటం అని అర్థం! ఆర్థికంగా మూల్యం కట్టినప్పుడు చిత్రకారునికి ఇతోధిక ప్రోత్సాహం కలుగుతుంది. అతను మళ్లీ సృష్టికి ఇతోధికంగా ఉపక్రమించుతాడు లేనిచో నిరుత్సాపడి వేరే వృత్తిని అవలంభించి క్రమంగా తన కళకు స్వస్తి పలుకుతాడు.
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని మనం అనుకొంటాం. కొందరు కృషి చేసినా తగిన ఫలితం లేక బాధలను అనుభవిస్తుంటారు. ముఖ్యంగా శిల్ప చిత్రకారులు ఈ కోవకు చెందినవారు! కళాకారుడు బ్రతకాలంటే వానికి ఆర్థిక స్తోమత కలిగించాలి. సామాన్య ప్రజలకు చిత్రశిల్పక పోషించే స్తోమత ఉండదు. ధనవంతులైన ప్రతివానికీ అభిరుచి (taste) వుండదు. అభిరుచి వున్నా, కొనేందుకు సాహసించడు. కనుక నేటి ప్ర ప్రభుత్వాలు కళను, కళాకారులను పోషించే బాధ్యత వహించవలసియు ప్రస్తుతము ప్రభుత్వాలు Art Gallery లు, మ్యూజియాలలో చిత్రాలను సేకరించి కళలను భద్రపరుస్తున్నాయి. కళలతో బాటు కళాకారులను సన్మానించి పోషించు బాధ్యత కూడా ప్రభుత్వాలపై నున్నదనే మాట కూడా కొంత ఆలోచించివలసినటువంటి విషయం. కళను ఆదరించుటమంటే కళాకారుని ఆదరించుటయేకదా! సామాన్య ప్రజలు పరిశ్రమలలోని కళను (Art Industry) లేక ప్రాయోజితకళను మాత్రం పోషిస్తారు. వారు నిత్యం వాడుకునే వస్తువులలోని కళను ఆదరిస్తారు. ఉదా. నగిషీలు లేక చీరెలు అలంకారిక వస్తువులు మొదలైనవి కాని చిత్రాలు, శిల్పాలను అధిక ధరలను వెచ్చించి, ఆదరించుట వారి ఆర్థిక స్తోమతకుమించిన పని.
“అందమె ఆనందం, ఆనందమే జీవితమకరందం” అను నుడి రెండురకాలుగా వర్తిస్తుంది. అందం భౌతికరూపాన్ని ఆశ్రయుంచినది. ఆనందం ఆధ్యాత్మికం, కళలో Spiritual Significance ఉత్తమమై, ఉన్నతమైనదిగా, మానసిక శాంతికి కారకమైనదిగా (Mental Peace) ను మన సంప్రదాయం చెప్పుచున్నది. కళలు నవరసాత్మికంగా వర్ధిల్లినది. నవరసాలలో శాంతిరసం, మోక్ష మార్గానికి ఉపాస సాధనంగా వాడినట్లు మనకు తెలుస్తున్నది! దీనికి దేవతా మూర్తులు ప్రత్యక్ష సాక్ష్యం . శృంగార రసాన్ని ప్రకటించు చిత్రాలు, వీర, కరుణ, అద్భుత రసములు ప్రతిబింబించు చిత్రాలు, మానసికోల్లాసమునకు (Mental Satisfaction) వినోదానికి కారకాలు. భీభత్స రౌద్రరసాలు, రజస్సు, తమస్సులను కలిగించి మానసిక ఆందోళనకు కారణాలౌతాయి. శాంతి రసం మోక్ష మార్గాన్ని సూచిస్తుంది.
కళాకారుడు నిత్య జీవితాన్ని, ప్రకృతి రూపాలను, రంగులతో మేళవించి రససృష్టిచేస్తాడు. ఉత్తమ కళాసృష్టి ప్రకృతిని సౌందర్యాన్ని, సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజానికి దారి చూపిస్తుంది. నీతిని బోధిస్తుంది! సమాజాన్ని ఏకత్రాటిపై నడిపే బాధ్యత ప్రభుత్వానిది కనుక ప్రభుత్వాలు ఈ సత్యాన్ని గమనించి కళలను పోషించి ఆదరించాలి. ప్రభుత్వమే జనానికి ప్రతిబింబకావాలి.
“జనం మనం, మనం జనం. జనం లేంది మనం లేము, మనం లేంది జనం లేరు.” అని దాశరథి మహాకవి నుడివి. ‘మన’కి కళాకారుడి మనుగడే మన మనుగడ అవుతుందని చెప్పకుండా చెప్పుతుంది. కళాకారుడి సృష్టిమనిషి మనుగడకి దర్పణం! కళాకారుని ఆదరించటం జన జీవితాలకి ప్రాణాధారము.
జ్ఞాన పీఠగ్రహీత ఆయన డా. సి.నారాయణరెడి గారు వారి తల్లి మీద ఒక కవిత రాస్తూ, “నేను చిత్రకారుణ్ణి కాదు, పద చిత్రకారుణ్ణి, మా అమ్మరూపాన్ని సృష్టించడానికి”అని అన్నారు. చిత్ర రచన యొక్క ప్రాముఖ్యత వారు చెప్పుచూ వారి ప్రతిభతో పద చిత్రంలోనే మాతృమూర్తి వాత్సల్యాన్ని మనకు దర్శింపచేసినారు. ముఖ్యంగా ప్రభుత్వం పై విషయాలతో పాటు తమ అభివృద్ది కార్యక్రమాల నిర్మాణపు పనులలో చిత్రకారులను, శిల్పకారులను నియోగించి అటు ప్రజాహితంగాను ఇటు ప్రజారంజకంగాను సంస్కృతి దర్పణాలుగా నిర్మాణాలను చేపట్టినట్లుయితే, కళకి కళాకారుడికి ఆదరణ కలిగించిన దవుతుందని నా అభిప్రాయం.
ప్రభుత్వాదరణలో కులం, మతం, ప్రాంతీయత, బంధుప్రీతి పాటించకూడదు. కేవలం ప్రతిభకే పట్టం గట్టితే నిజమైన జనాదరణగా భావించవలయును. లేనిచో జనాదరణ అను కార్యం బూడిదలో పోసిన పన్నీరౌతుంది.
-కొండపల్లి శేషగిరిరావు
(కొండపల్లి శేషగిరిరావు గారి చిత్ర, శిల్పకళా రామణీయకం పుస్తకం నుండి …రచనా కాలం: 2-11-2001)