2024, నవంబర్ 10 వ తేదీ, ఆదివారం ఉదయం కృష్ణా నదీతీరంలో హరిత బెర్మ్ పార్క్ లో ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ చిత్రకారుల, శిల్పుల మరియు హస్థకళాకారుల నడుమ పుస్తక అవిష్కరణమహోత్సవం ఘనంగా జరిగింది.
64 కళలు.కాం పత్రిక సర్వాంగ సుందరంగా ప్రచురించి కళారంగానికి అందించిన కానుక ఈ ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’.
ఈ శుభ సందర్భంలో…ఈ పుస్తక ఆవశ్యకతను, నేపథ్యాన్ని గురించి… తెలుసుకుందాం.
కళ నిత్యం…
కళ సత్యం…
కళ సర్వస్వం…
కళ విశ్వలక్షణం…
కళ విశ్వరక్షణం…
కళలు… జన హృదయాలను జాగృతం చేసేవి…
కళలు… మానసిక ఆనందాన్ని కలిగించేవి…
64 కళలు అనేవి మానవ జీవ పరిణామ దశలో భాగాలు..
అవి మానవ నాగరికత వికాస ప్రవర్థనంలో సొపానాలు…
కళలు మానవ సంస్కృతికి ప్రతిబింబాలు…!
భాష కన్నా ముందే పుట్టింది…. చిత్రకళ..!
చతుష్షష్ఠి కళల్లో అగ్రభాగాన నిలిచేది చిత్ర,శిల్పకళ లే…
చిత్ర-శిల్ప కళలు జోడుగుర్రాల్లాంటివి…
చిత్రకారుడు కానివాడు శిల్పి కాలేడు…
శిల్పి కానివాడు చిత్రకారుడు కాలేడు….
శతాబ్దాల తరబడి గొప్ప చారిత్రాత్మక కళా సంపదను సృష్టించి…
చరిత్రలో తమ ఆనవాళ్లు లేకుండా కనుమరుగైన చిత్ర,శిల్ప కళాకారులెందరో…
ఒక మైఖేలేంజిలో నీ.., ఒక లియనార్డో డావిన్సీ….నీ
మించిన అమరశిల్పి జక్కన లాంటి కళాస్రష్టలు ఎందరో మన తెలుగువారిలో ఉన్నా..
చరిత్రకారుల తప్పిదాలు, నాటి పాలకుల కుటిల రాజకీయాల కారణంగా…
అలాంటి వారి గురించి ఎక్కడా సంపూర్ణంగా గ్రంథస్థం కాబడలేదు…
అలోటును భర్తీ చేయడానికి… పాతికేళ్ల క్రితం ఓ నవయువకుడు నడుం బిగించాడు…
పట్టుదల వీడని ఉత్సాహంతో పరిశ్రమించాడు… పరిక్రమించాడు… అతనే మన కళాసాగర్!!
ఆంధ్ర కళాదర్శిని… పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన రెండొందల మంది… సమకాలీన చిత్ర, శిల్ప కళా కారుల పరిచయాలతో.. మొదటి పుస్తకం వెలుగు చూసింది… 2001 సంవత్సరం లోనే…
ఆ తర్వాత 2004 సం.లో మరో ప్రయత్నం…
2010 లో సకల కళల సమాహారంగా 64 కళలు.కాం అంతర్జాల పత్రిక ఆవిర్భావం…
సాంకేతికతను అందిపుచ్చుకొని…పత్రికా రంగంలో ఒక సంచలనంగా… కళాకారులకు పెన్నిధి గా… నిలబడి, కళాకారులకోసం విశ్వవ్యాప్త వేదికను రూపొందించాడు మన కళాసాగర్…
పదిహేనేళ్ళ నిరంతరాయ కృషి ఫలితంగా… స్ఫటిక స్వచ్ఛంగా ‘స్ఫటిక జయంతి’ జరుపుకొంటుందీ నాడు 64 కళలు. కామ్!
ఈ రోజు ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ పేరుతో మరోసారి మీ ముందుకు వచ్చాడు…కళాసాగర్
తన పాతికేళ్ల అనుభవాన్ని రంగరించి, మూడేళ్ల పాటు శ్రమించి… అన్ని ప్రాంతాల కళాకారులను ప్రత్యక్షంగా కలిసి… వారి అనుభవాలను, ఆలోచనలను సమీకరించి… నవ్యాంధ్రప్రదేశ్ కు చెందిన ఎందరో శేష కీర్తులు దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం, భగీరథి, అడవి బాపిరాజు, గుర్రం మల్లయ్య, అంకాల వెంకట సుబ్బారావు, పైడిరాజు, మాధవపెద్ది గోఖలే, సి.ఎస్.ఎన్. పట్నాయక్, వడ్డాది పాపయ్య, ఎస్. యం. కేతా, బాపు…. లాంటి వారిని స్మరించుకుంటూ…
నేటి సమకాలీన చిత్ర, శిల్పకళాకారులతో పాటు, కలంకారీ, ఏటికొప్పాక, కొండపల్లి కొయ్య బొమ్మల కళాకారులను చేర్చి…
వెరసి.. మూడొందల ఏభై మంది కళాకారుల పరిచయాలతో… రెండు తరాల కళాకారులకు వారధిగా…
వందేళ్ళ కళాచరిత్రకు దర్పణంలా… కళాసాగర్ సారధ్యంలో… రంగుల్లో… సర్వాంగ సుందరంగా… రూపొంది… నేడు మీ ముందుకొచ్చింది… ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’!
ఇదొక అరుదైన అపురూపమైన సంతోషకరమైన సందర్భం..!!
లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ పనిని… కళాసాగర్ ఎలా చేయగలిగాడు…?
అనేకదా మీ సందేహం…!
ఇందు కోసం ప్రభుత్వాధికారులను, అమాత్యులను కలిసినప్పటికీ… సానుకూల స్పందన రాలేదు…
అయినా నిరుత్సాహపడక… కళాకారులనే ఇందులో భాగస్వామ్యం చేశాడు కళాసాగర్.
కళాకారులు స్వేచ్ఛా జీవులు… భిన్న మనస్తత్వాలు కలవారు…
అయినప్పటికీ వీరందరినీ సంఘటిత పరచి…
నిధులను సమకూర్చుకొని, తన సంకల్పాన్ని సాకారం చేసే క్రమంలో …
ప్రశంసలే కాదు, అవమానాలు కూడా పొందాడు…
అయినా వెనకాడకుండా… తాను తలపెట్టిన కార్యం విలువైనదని నమ్మి, ప్రయత్నాలు కొనసాగించాడు…
ఆ అవిశ్రాంత ప్రయత్న ఫలితమే ఈ రోజు మన ముందున్న “ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” గ్రంథం!
ఇది మనకు మనమే ప్రచురించుకున్న పుస్తకం…
ఇది మన ఉనికిని మనమే కాపాడుకునే ప్రయత్నం!
ఇది నవ్యాంధ్రప్రదేశ్ కళల ప్రాభవాన్ని దేశ వ్యాప్తంగా ప్రజ్వలింప జేయగల కరదీపిక..
ఇది నేడొక పుస్తకం…కావచ్చు…!
‘Life is short – Art is long‘ అన్నట్లు… తెలుగు వారి కళాప్రపంచపు కీర్తిని…
ఇనుమడింపజేసే గ్రంథంగా… రేపు చరిత్రలో నిలిచిపోతుందన్నది కాదనలేని వాస్తవం!
ఈ బృహత్ కార్యానికి కళాసాగర్ కు సహకరించిన కళాకారులకు, కళాప్రోత్సాహకులకు అభివందనాలు… హృదయపూర్వక ప్రణామాలు…
కళ అజరామరం…! కళాకారులు చిరంజీవులు…!!
-పున్నమరాజు
దృశ్యరూపంలో కింది లింక్ క్లిక్ చేసి చూడండి.
https://www.youtube.com/watch?v=6b63_VVzdWU&t=195s