
ఎల్లలు లేనిది, ఎల్లలు ఎరుగనిది కళ. కళలను 64 గా మన పెద్దలు పేర్కొన్నారు. ఆ కళల్లో అత్యంత పురాతనమైనది చిత్రకళ, శిల్పకళ. మన దేశ శిల్పకళకు సాక్ష్యంగా నిలుస్తాయి హైందవ దేవాలయాలు. చిత్రకళ కుడ్యాలపై మొదలై ఆ తరువాత పలు ఇతర రకాలుగా విస్తరించి, నేడు కొత్త సోకడలల్లోకి వెళ్ళింది. ఇటువంటి చిత్రకళ, ఇతర కళల్లో ఏ ఇతర ప్రాంతంవారికీ తీసిపోని కళాకారులు ఆంధ్రదేశంలో ఉన్నారు.
కళకు ఆదరణ ఉన్నదా! లేదా!! చిత్రకళతో జీవితం వెళ్ళదీయగలిగిన ఆదాయం లభించేనా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అయితే కళాకారుడు వాటిగురించి అస్సలు ఆలోచించడు.
కళను ఒక తపస్సులా భావించి, అందులో లీనమై. తాను చిత్రీకరించినది లేదా చెక్కినది బయటి లోకానికి ఆవిష్కరించి చూపుతాడు. ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చేసినా కళాకారుడు పట్టించుకోడు. తన బాధ్యత మనసులోని చిత్రానికి చక్కనిరూపం ఇవ్వటం దీక్షగా స్వీకరించుకుని వెళుతుంటాడు. గడచిన వంద సంవత్సరాల కాలంలో తమ చిత్రకళతో కళాప్రపంచాన్ని అలరించిన కళాకారులు ఎందరో ఉన్నారు. ఒకనాడు పాఠశాలల్లో డ్రాయింగ్ ఒక అంశంగా బోధించే టీచర్ ఉండేవాడు.
“ఒక చిత్రీకరణ ప్రాథమిక అంశాలు ప్రతి పిల్లవాడికీ అందించే యత్నం స్కూల్ స్థాయిలో జరిగేది. ఆ తర్వాత ఎవరికి నచ్చినరీతిలో వారు తమకు ఇష్టమైన అంశాన్ని తీసుకుని దానిమీద పట్టుసాధించేవారు. కాలేజీ స్థాయిలో కూడా కళని ఒక సబ్జెక్ట్ గా బోధించిన కళాశాలగా బందరులోని జాతీయ కళాశాల నిలుస్తుంది. బెంగాలనుండి ప్రముఖ చిత్రకారులను తీసుకువచ్చి ఆధ్యాపకులుగా నియమించింది యాజమాన్యం.
అడవి బాపిరాజు వంటి మేటి చిత్రకారుడు, రచయిత ఆ కళాశాలకు ప్రధాన అధ్యాపకుడిగా ఎంతో ముందుకు తీసుకువెళ్ళాడు చిత్రకళను, పలువురు కళాకారులను తీర్చిదిద్దాడు.
దాదాపుగా అదే సమయంలో ఆంధ్రుల సాంస్కృతిక కేంద్రమైన గోదావరి తీర పట్టణం రాజమహేంద్రవరంలోని కాలేజీలో ఉన్న బ్రిటీష్ ప్రిన్సిపాల్ తన శిష్యులలోని టాలెంట్ని గుర్తించి వారికి పాశ్చాత్య చిత్రకళలోని మెళుకువలను నేర్పాడు.
చిత్రకళకి అవసరమయిన పరికరాలను, పదార్థాలను విదేశాలనుండి తెప్పించి, అందజేసి ప్రోత్సహించాడు. అలా రాజమహేంద్రవరంలో దామెర్ల రామారావు గొప్ప కళాకారుడిగా రూపుదిద్దుకున్నాడు. వంద సంవత్సరాల కాలంలో ఒక చిత్రకళలోనే కాదు ఇతర కళలలోనూ ఎందరెందరో తమ ప్రతిభను ఆంధ్రదేశంలో ప్రదర్శించి, ఆ తర్వాత మెరుగైన అవకాశాలు, గుర్తింపు వెతుక్కుంటూ దేశంలోని ఇతర నగరాలకు, విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు.
ఆ మేటి కళాకారుల వివరాలు, వారి చిత్రాలను, ఇతర కళారూపాలను ఒకచోటికి తెచ్చి. పుస్తకంగా ప్రచురించే ప్రయత్నం విజయవాడకి చెందిన 64 కళలు డాట్ కాం పత్రిక నిర్వహిస్తున్న కళాసాగర్ యల్లపు చేశాడు. అతని దశాబ్దపు పైబడిన కృషి ఫలితం ఆంధ్రకళాదర్శిని-ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో వెలువడిన కాఫీ టేబుల్ పుస్తకం.
కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన చిత్రకారులు, శిల్ప కళాకారులు, గ్రాఫిక్ ఆర్ట్, సినీ పోస్టర్ ఆర్ట్. పోస్టర్ డిజైన్ చేసినవారు, కథలకు బొమ్మలు వేసిన చిత్రకారులు. ఆర్ట్ & క్రాప్ట్క చెందినవారి వివరాలన్నింటినీ సేకరించటం అనే మహాయజ్ఞంలో యల్లపు కళాసాగర్ తో పాటుగా మరెందరో సహకరించి, శ్రమించారు. మరెందరో వెన్ను తట్టి ప్రోత్సహించారు. రెండు దశాబ్దాల పైబడిన శ్రమ ఈ పుస్తకంవెనుక ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీకొందరు చిత్ర, శిల్పకళాకారులపై మోనోగ్రాఫ్లు తెచ్చింది. ఐనా అవి కేవలం పదహారుమందికే పరిమితం.
నాటినుండి కళల విషయంలో వెలుగులోకి తీసుకురావాల్సినది మరెంతో ఉన్నదని భావించిన కళాసాగర్ తన ప్రయత్నం ప్రారంభించి 2001లో తొలిసారిగా ఈ కాలపు కళాకారుల వివరాలు అందించాడు. దానికి లభించిన ఆదరణతో 2004లో రెండవ సంపుటి తీసుకువచ్చాడు. అందులో 240 కళాకారుల వివరాలు ఉన్నాయి.
ఈ ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్లోని కళాకారులంతా హర్షించారు. తమకు తెలిసిన ఇతర ఆర్టిస్ట్స్ వివరాలు పంపారు. కళాకారుల మధ్య సంప్రదింపులు పెరిగాయి, కళపట్ల అవగాహన పెరిగింది. ఒక చిన్న విత్తనం కళారంగంలో కళాసాగర్ యల్లపు నాటగా అది నేడు మహావృక్షంగా పెరిగి మనముందు ఆంధ్రుల కళాహృదయాన్ని తెరిచి చూపుతున్నది. కళాకారులను ఐదు విభాగాలుగా చిత్రకారులు, గ్రాఫిక్స్ కళాకారులు, ఇలస్ట్రేటర్స్, శిల్పులు, సినిమా, క్రాఫ్ట్ కళాకారులుగా విభజన చేసి, 320 మంది కళాకారుల కృషిని మనకు అందించారు. ఇందులో వారందరి సమగ్ర జీవిత చిత్రణతో పాటు, మన సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు ఎంపిక చేసి A4 సైజులో ఆర్ట్ పేపర్ పై రంగుల్లో ఈ పుస్తకం ముద్రించారు.
శాతవాహన కాలంనుండే మొదలైన శిల్పకళా పోషణ, బౌద్ధస్థూపాలలోనూ, ఇక్ష్వాకుల కాలంలోని అమరావతి సాంప్రదాయ శిల్పాలు, కృష్ణ దేవరాయలు పోషించినవి. ఇలా కాలానికి తగినట్టుగా పరిణతి చెందుతూ ఆంధ్ర కళాకారుల్ని ఆకట్టుకుని, కృషిసలిపేలా చేసింది.
కాగితంమీద నలుపు, తెలుపు రంగులలో చిత్రాలు వేయటంలో అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, మహిళలు ఆరితేరారు. వీరిలో కేంద్ర ప్రభుత్వంనుండి పద్మశ్రీ అవార్డులు అందుకున్న ప్రతిభావంతులు, తమ చిత్రకళా ప్రయోగాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవారు ఉన్నారు.
ఒక్కొక్క చిత్రకారుడిది ఒక ప్రత్యేక శైలి. ప్రాంతీయంగా కన్పించే దృశ్యాలు, ప్రకృతి అంశాలు, వ్యక్తుల రూపాలు, పౌరాణిక ఘట్టాలు, చారిత్రక రూపాలన్నీ మన కళ్ళముందు నిలిపిన ఆయా కళాకారుల వ్యక్తిగత వివరాలతోపాటు వారి చిత్రాల్ని అందించిన పుస్తకం ‘ఆంధ్రప్రదేశ్ కళాదర్శిని’- ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కళాకారులు, కళాభిమానులు కొని భద్రపరచుకోవాల్సిన పుస్తకం ఇది.
–దుగ్గరాజు శ్రీనివాసరావు
స్వాతి వారపత్రిక ( 7 – 2 – 2025 ) సంచిక నుండి…
ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (అన్ని పేజీలు రంగుల్లో…)
ఎడిటర్: కళాసాగర్
పేజీలు: 374, వెల: రూ. 2000/-
Mobile: 98852 89995