‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ (Art of AP- Coffee Table book) గ్రంథం చూశాక కొన్ని మాటలు రాయాలనిపించింది. తన కళ, తన కృషి మాత్రమే గుర్తింపబడాలని.. ఇతరుల విజయాలను సహించలేని, ఒప్పుకోలేని సంకుచిత భావాలతో నిండి వున్న నేటి కాలంలో అందరిలా కాకుండా తన జాతి మొత్తం తానే అనుకుంటూ… ఆ జాతిగౌరవాన్ని పలువురికి ప్రకటించాలనుకున్న కళాసాగర్ గారి ప్రయత్నాన్ని ప్రశంసించడం కనీస బాధ్యతగా భావిస్తూ… ‘ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకం గురించి నా అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తున్నాను.
ఈ గ్రంథం యొక్క ఆత్మను ప్రకటిస్తూ ఆంధ్రజాతి కళా సాంస్కృతిక ప్రతీకయైన లేపాక్షి నందిని ముఖచిత్రంగా నిలబెట్టడం ద్వారా గ్రంథానికి గొప్ప రూపునిచ్చారు.
దామెర్ల రామారావు, పైడిరాజు, వరదా వెంకట రత్నం, భగీరథీ, నకాల వెంకట సుబ్బారావు, సి.ఎస్.ఎన్. పట్నాయక్, వపా, బాపు లాంటి మహనీయ చిత్రకారుల దివ్యస్మృతులు పంచుతూ.. ఈ మహావృక్షాల ఫలాలమే మేము అని చాటుతూ.. నేటి బి.ఏ. రెడ్డి, ఎస్వీ రామారావు, గిరిధర్ గౌడ్, V. రమేష్, పి.యస్. ఆచారి, ఉదయ్ కుమార్, రవీంద్ర రెడ్డీ, వేలు ఆనందాచారి, సి.వి. రాజు, కాటూరి వెంకటేశ్వర రావు, హరి ప్రసాద్, రమేష్ గుర్జాల, సిరాజుద్దీన్, మంచెం, పద్మా రెడ్డీ, రాజేశ్వరరావు లాంటి కళాకారుల కళాకారుల సృజనను అందించారు ఈ పుస్తకంలో.
ఆధ్యాత్మికంగా భగవద్గీత, విష్ణు చిత్రాలతో ప్రారంభమై.. రమణీయ లలిత వర్ణమయ చిత్రరూపంగా లావణ్య స్త్రీ మూర్తిని చూపుతూ.. జింకా రామారావు గారి హృదయంగమ ప్రకృతిలో జీవన పరిమళాలు పంచే వృక్షరాజ చిత్రము ప్రచురించి పూర్వచిత్రకళా దిగ్గజాల గురుతరానికి పెద్ద పీట వేసి తదుపరి నేటితరాల చిత్రకారులకు చోటిచ్చారు.
కళాకారులను ఐదు విభాగాలుగా చిత్రకారులు, గ్రాఫిక్స్ కళాకారులు, ఇలస్ట్రేటర్స్, శిల్పులు, సినిమా, క్రాఫ్ట్ కళాకారులుగా విభజన చేసి, 300 మంది కళాకారుల కృషిని మనకు అందించారు. ఇందులో వారందరి సమగ్ర జీవిత చిత్రణతో పాటు, మన సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు ఎంపిక చేసి A4 సైజులో ఆర్ట్ పేపర్ పై రంగుల్లో ఈ పుస్తకం ప్రచురించారు.
పుస్తక రూపం చూస్తే రాజసం.. వివరం చూస్తే వర్ణమయం..
ముఖచిత్రం ఆంధ్రజాతి సంస్కృతి పరిమళాలను ముందే ఊహించేలా చేస్తుంది.
ఇక కళాసాగర్ గారి మనోద్దేశం పరిశీలిస్తే.. తెలుగు చిత్రకళా చరిత్రను నిక్షిప్తం చేయడంలో నిర్లక్ష్యం జరుగుతున్నది. ఇది సహించలేనిది. ఈ లోటును ఎలా భర్తీ చేయాలి. ఒక గ్రంథాన్ని ప్రచురించి తెలుగు ప్రతిభను ప్రపంచానికి చాటాలి అనుకున్నారు. అదే వీరి చిరకాల స్వప్నం.
ఇక పుస్తక విషయం: తెలుగు చిత్రకారులు అంటే ఉమ్మడి రాష్ట్రాలు వస్తాయి. కానీ కళాశాలలు ఉన్న తెలంగాణ చిత్రకారులు ముందే విభజనపడి వారు ప్రత్యేకమైన పుస్తక ప్రచురణ చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నారు.
ఇక మన వారిని మనమే ప్రోత్సహించుకోవాలనే తపనతో కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందిన కళాకారులకే చోటిచ్చారు. గ్రంథాన్ని ఆంగ్ల భాషలో ప్రచురించడం వల్ల రాష్ట్రాలను, దేశాన్ని దాటి ఇతర ప్రాంతాలకు, దేశాలకు మన ప్రతిభ తెలుస్తుంది అనేది తెలుగు భాషాభిమానులు కూడా కాదనలేని నిజం. కనుక ఆంగ్ల భాషలో ప్రచురించి పుస్తక ప్రయాణపు పరిధిని విస్తృతం చేసారు.
ఈ గ్రంథంలో ఆంధ్రులందరూ ఇంచుమించుగా ఉన్నారు. కొందరు వేరే వేరే కారణాలతో ఇందులోకి చేరలేకపోయారు. పుస్తకం చూసిన తరువాత మలి ముద్రణ ఎప్పుడని ఆరా తీస్తున్నారు! రెండవ ముద్రణలో ఈ పుస్తకంలో తమకు చోటు సంపాదించుకోవాలని కళాకారులు కోరుకుంటున్నారు.
గ్రంథంలో కొంత పరిణతి పొందిన చిత్రకారుల కోసం వయసును కూడా ప్రమాణంగా తీసుకున్నామని చెప్పారు. వివిధ చిత్రకారుల కుంచెల విన్యాసం చాలా అపురూపంగా ఉంది. కన్నుల పండుగగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఇంతటి అపురూప, అనంత, అమేయ, అద్భుత స్థాయిలో చిత్రకళ అధ్యయనం జరుగుతున్నది.. అని గర్వంగా సంతోషంగా జగతికి చాటి చెప్పడంలో సఫలీకృతులయ్యారు. ఇరవై సంవత్సరాల తన బంగారు కలను నిజం చేసుకుని ఉన్నత స్థానంలో నిలబడ్డారు.
కళలు కనడం ఎంత సులువో.. ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టం. ఈ గ్రంథరూపం దాల్చడానికి ఎన్నెన్ని సర్దుబాట్లు జరిగాయో, ఎన్నెన్ని ముందు వెనుకలాడడం ఉందో.. ఎన్ని రకాల విమర్శలు..మాటలు..అపార్థాలున్నాయో.. అన్నింటినీ దారిలోకి తెచ్చుకుని సమగ్రంగా, సచిత్రంగా, సవివరంగా, సలక్షణంగా అందరి సమక్షంలో సంబరంగా విడుదల చేసి.. పండుగకు మిఠాయి పంచిపెట్టినట్లుగా గ్రంథాన్ని చేతిలో పెట్టారు. ఆ గ్రంథం చూస్తూనే సంబరం..ఆ పుస్తకంలో తన చిత్రాన్ని చూస్తే మరింత సంబరంగా చిత్రకారులందరూ మురిసి.. అక్షర మాలలల్లి అనేక విధాల సాగర్ గారిని ప్రశంసించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
అప్పుడు తెలిసింది పుస్తకం రూపు దాల్చడంతోనే తన కల నేరవేరలేదని. అందరూ సంతోష హృదయులు కావడంతోనే తన కల ఫలించిందని..
“ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” గ్రంథం చూడగానే సగం.. తెరిచాక సంపూర్ణంగా ఆంధ్రజాతి చిత్రకళా వైభవం చాటుతుంది అనేది నిర్వివాదాంశం.
64 కళలు.కామ్ పత్రిక వీరు సాధించిన తొలి విజయం. ఆ పత్రిక వివిధ కళాకారులను ఏనాటి నుండో 200 దేశాల వారికి పరిచయం చేస్తూ వస్తున్నది. ‘ఆంధ్ర కళాదర్శిని’ మలి విజయం. నేడు ‘ఆర్ట్ ఆఫ్ ఎపి’.. సాధించినది అఖండ విజయం. ఈ దీప్తి కళా సాగర్ గారి భావి ప్రయత్నాలకు స్ఫూర్తి.
ఇంతటి విజయాన్ని సాధించిన కళాసాగర్ యల్లపు గారికి హృదయపూర్వక అభినందనలు.
–ఎన్.వి.పి.ఎస్. ఎస్. లక్ష్మి, చిత్రకారిణి, రాజమండ్రి
“ఆర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” పేజీలు : 320, వెల : రూ. 2000/-(in A.P. and Telangana)
ప్రతులకు : 98852 89995 (GooglePay) / 99519 21822 (PhonePe)
దృశ్యరూపంలో కింది లింక్ క్లిక్ చేసి చూడండి.
https://www.youtube.com/watch?v=6b63_VVzdWU&t=195s
Art of Andhra Pradesh – Introducing a rare coffee table book that showcases the priceless works of 300 + artists, sculptors and artisans. Beautifully designed and hardbound book with vibrant colourfull pages.
Edited by Kalasagar Yellapu. No. of Pages 320, Price Rs. 2000/- for Copies: 9885289995