విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘    

ఉత్తరాంధ్ర పోరాటాలకు పురిటిగడ్డ మాత్రమే కాదు, సాహితీ కళా రంగాలకు పుట్టినిల్లు. గురజాడ, ద్వారం వెంకటస్వామి నాయుడు, అంట్యాకుల పైడిరాజు లాంటి సాహిత్య, సంగీత, చిత్రకళా రంగ ఉద్దండులెందరో నడయాడిన నేల విజయనగరం.

వృత్తిరీత్యా చిత్రకళా భోదన చేస్తూ, మరో పక్క చిత్రకళ-సాహితీ రంగాలలో విశేషంగా రాణిస్తున్న ఇనపకుర్తి చిన సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా వాసే. తన కుంచె ద్వారా అనేక భావ చిత్రాలకు ప్రాణం పోస్తూ… తన కవిత్వం ద్వారా ఉత్తరాంధ్ర తాడిత, పీడిత ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు.

జీవన ప్రస్థానం: విజయనగరం జిల్లా లంకలపల్లిపాలెంలో  శ్రీమతి ఇనపకుర్తి సత్యవతి, సూర్యనారాయణ దంపతులకు 1966 నవంబర్ 15 న జన్మించిన చిన సత్యనారాయణ బాల్యం నుండి లలిత కళల పై మక్కువ చూపేవారు. పదవ తరగతి తర్వాత కె. బ్రహ్మానందం గురువు గారి దగ్గర చిత్రకళాభ్యాసం చేసి డ్రాయింగ్ హైయ్యర్ పరీక్షలు పాసయ్యారు. అటు పిమ్మట టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి వేపాడ జిల్లా పరిషత్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా ఉద్యోగంలో చేరారు.

చిత్రకళా భోదన: డ్రాయింగ్ టీచర్ గా జిల్లాలో పలుచోట్ల పనిచేసి, ప్రస్తుతం రఘుమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిసున్న వీరు ఎక్కడ పనిచేసినా గ్రామీణ పిల్లలలో దాగివున్న కళను వెలికితీసేందుకు నిత్యం కృషి చేస్తారు.. వీరి కృషి ఫలించి, ఈయన ప్రోత్సాహంతో ఎందరో విద్యార్థినీ విద్యార్థులు  జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన పోటీలలో రాణించి బహుమతులతో పాటు, పలు బంగారు పథకాలు, మెరిట్ సర్టిఫికెట్లు సాధించారు. వీరి విద్యార్థులు చిత్రించిన చిత్రాలు ఎన్నో సావనీర్లలో, కేటలాగ్లలో ప్రచురించబడ్డాయి.  ఇందుకయ్యే రంగులు, కుంచెలు, పోస్టల్ ఖర్చుల కోసం తన సొంత సొమ్మును వెచ్చించి పిల్లలను భావి చిత్రకారులుగా తీర్చిదిద్దుతున్న వీరు అభినందనీయులు.

సాహితీ సృజన: ఒక పక్క  డ్రాయింగ్ టీచర్ గా చిత్రకళా సాధన చేస్తూ… మరో పక్క  కథలు, కవితలు రాయడం ప్రారంభించారు. పలు పత్రికలలోనూ వీరి కథలు, కవితలు ప్రచురింపబడ్డాయి.  2001 సంవత్సరంలో వీరు రాసిన ‘మోజు ‘ అనే కవితకు ‘ఎక్స్ రే ఉత్తమ కవితా అవార్డ్ ‘ ను అందుకున్నారు.  2014 సంవత్సరంలో ‘అతనింకా అక్కడే ‘ కవితకు తెలుగు కవిత్వంలో అత్యుత్తమ  అవార్డుగా ప్రసిద్దిచెందిన ‘రంజని కుందుర్తి ‘ అవార్డ్ను కూడా పొంది ఎందరో కవుల ప్రశంసలందుకున్నారు. ఇంకనూ అనేక గుర్తింపు పొందిన సంస్థల నుండి పలు అవార్డులు, బహుమతులు పొందారు.

కళా సృజన : ‘శ్రీను ‘ అనే కుంచె  పేరుతో అనేక భావపూరిత చిత్రాలకు జీవం పోస్తూ… ప్రకృతి చిత్రణ, మోడరన్ ఆర్ట్, సింబాలిజం లాంటి ప్రక్రియల్లో  ఎన్నో చిత్రాలు వేసారు. దళసరి పేపరు తీసుకొని కొనగోటితో అందమయిన నఖచిత్రాలు గీయడంలోనూ సత్యనారాయణ మాస్టారు దిట్ట. ఇవే కాకుండా సుద్దముక్కలు, సబ్బులపై దేవతామూర్తుల, జాతీయ నాయకుల రూపాలను ఎంబోజింగ్ పద్దతిలో చెక్కి తనలోని బహుముఖ కళాప్రజ్ఞను ప్రదర్శించి ఎందరో ప్రముఖుల ప్రశంసలతో పాటు పలు అవార్డులూ అందుకున్నారు.

అవార్డులు: యంగ్ ఎన్వాయిస్ ఇంటర్నేషనల్, కోనసీమ చిత్రకళా పరిషత్, ప్రతిమా ఆర్ట్ సొసైటీ, అజంతా కళారామం(పద్మశ్రీ యస్వీ రామారావు గారి చేతులమీదుగా) , డ్రీమ్  చిడ్రన్ ఆర్ట్ అకాడెమీ, లలితకళా పరిషత్, ఆర్ట్ క్లబ్, కల్పన కల్చరల్ సొసైటీ లాంటి సంస్థల నుండి బెస్ట్ ఆర్ట్ టీచర్ గా, ఉత్తమ చిత్రకారునిగా అవార్డులందుకున్నారు.
-2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఆర్ట్ ట్టీచర్ అవార్డ్
-2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఉగాది పురస్కారం ‘ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా …
-యంగ్ ఎన్వాయిస్ ఇంటర్నేషనల్ వారి సద్గురు పురస్కారం మరియు సంస్కృతి పురస్కారం

చిత్రకళా ప్రదర్శనలు : హైదరాబాద్, విజయవాడ , గుంటూరు, విజయనగరం, విశాఖపట్టణం మొదలగు చోట్ల సుమారు 20 సోలో ప్రదర్శనలు, నఖ చిత్రాలపై విద్యార్థులకు సాలూరులో ఒకరోజు వర్కు షాప్ నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

-కళాసాగర్ యల్లపు

సుద్దముక్కలు, సబ్బులపై ఎంబోజింగ్ పద్దతిలో చెక్కిన శిల్పాలు:

నఖచిత్రాలు:

1 thought on “విజయనగర చిత్రకళా కీర్తి – ‘ఇనపకుర్తి ‘    

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link