
ప్రఖ్యాత నైరూప్య చిత్రకారుడు, ఆంధ్రజ్యోతి పూర్వ ఉద్యోగి, అంతర్వాణి క్రీస్తుసువార్త మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకుడు మద్దాల జేమ్స్ అలెగ్జాండర్ అలియాస్ ‘అలెక్స్’ ఈరోజు(16-5-2026) విజయవాడలో కన్నుమూశారు. అలెగ్జాండర్ కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.
అలెగ్జాండర్ ఆంధ్రజ్యోతిలో ‘పేజీ లే అవుట్’ ఆర్టిస్టుగా, చిత్రకారుడిగా చాలాకాలం పని చేశారు . ఆయనకు భార్య శ్రీలక్ష్మి, నిఖిలేష్, తేజ, రాకేష్ ముగ్గురు కుమారులు వున్నారు. తేజ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు రాకేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అలెగ్జాండర్ కుటుంబం కొంతకాలం క్రితం బుడమేరు వరదల్లో సర్వస్వం కోల్పోయి చాలా ఇబ్బందులు పడింది. అలెగ్జాండర్ అనేక కవితా సంపుటాలకు, సంకలనాలకు ముఖచిత్రాలు గీశారు. యాబ్ స్ట్రాక్ ఇమేజెస్ గీయడంలో అలెగ్జాండర్ తిరుగులేని చిత్రకారుడిగా పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కవితా సంపుటాలకు ఆయన పెన్ తో తనదైన శైలిలో గీసే లైన్ ఆర్ట్స్ ఎంతో అర్థవంతంగా, ఆకర్షణీయంగా వుండేవి. చాలామంది కవులు తమ కవితలకు అలెక్స్ చేత బొమ్మ గీయించుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటారు.
అలెక్స్ మృతికి మల్లెతీగ పత్రిక ఎడిటర్ కలిమిశ్రీ, బెల్లంకొండ శివాజీ, చిత్రకారులు పి. చిదంబరం, 64 కళాలు పత్రిక ఎడిటర్ కళాసాగర్, డా. రావెళ్ల, కవి, అనువాదకుడు పి.శ్రీనివాస్ గౌడ్, అలెక్స్ సన్నిహితుడు, విశ్రాంత జర్నలిస్ట్ అవ్వారు శ్రీనివాసరావు పలువురు కవులు, చిత్రకారులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
