కొంటె బొమ్మల బాపు

సముద్రాన్ని సీసాలో బంధించాలి అన్న ఆలోచన ఎంత హాస్యాస్పదమో, బాపు అను రెండక్షరాల కళాప్రపంచాన్ని ఒక చిన్న వ్యాసంలో చెప్పాలనుకోవడం కూడా అంతే హాస్యాస్పదమౌతుంది. కారణం ఆది అంతాలు అగుపించని మహా సముద్రమంతటి కళాసామ్రాజ్యాన్ని కృషితో, పట్టుదలతో ఏర్పరుచుకున్న అతని కళా ప్రపంచపు సరిహద్దులు కూడా కూడా అంతే విశాలంగా మారిపోయాయి. ఇలస్ట్రేషన్స్, కేరికేచర్, కార్టూన్స్ మరియు సినిమా అనే చతుర్విద ప్రక్రియలలో నలుచెరగులా దృఢంగా వేళ్లూనుకు పోయిన ఆ చిత్రకళా వటవృక్షమే బాపు అని పిలవబడే సత్తిరాజు లక్ష్మీనారాయణ. నేడు (31-8-24) బాపు వర్థంతి ఈ సందర్భంగా బాపు ని స్మరించుకుందాం.

పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సూర్యకాంతమ్మ, వేణు గోపాలరావు దంపతులకు 1933 డిశంబర్ 15న. బి.కామ్. బి.ఎల్., చదివిందీ మద్రాస్లో అడ్వకేట్గా రిజస్టర్ చేసుకున్నది కూడా మద్రాస్ హైకోర్ట్ లో. వృత్తికి, ప్రవృత్తికీ పొంతన లేని ఆ లాయర్ వృత్తిని వదిలివుండకపోయినట్లయితే ఆంధ్రావని అందానికి ప్రతిరూపంగా అతని కుంచె నుండి జాలువారిన ఆ వాలుజడల వయ్యారులు, కొంటె చూపులకోనంగిలు, రెండుజడల సీతలు, నవరసాల నాయకులు, నర్తకీ మణుల బంగిమలు, నవలా నాయికలు, ఇంకా ఎంకీ, శశిరేఖ, మధురవాణి, కిన్నెర సాని, సీగాన పెసూనాంబ, అప్పులఅప్పారావు, చిచ్చురపిడుగు బుడుగు, నాయుడు బావ లాంటి పాత్రలేగాక, రసరమ్యమైన రామాయణ చిత్రాలు, వీక్షించే భాగ్యాన్ని మనం కోల్పోయే వాళ్లం. అంతే గాదు. సీతాకళ్యాణం, భాగవతం, శ్రీరామరాజ్యం లాంటి దృశ్య కావ్యాలను మనం వీక్షించలేకపోయేవాళ్ళం.
ఇంతేనా ఆ కళాసామ్రాజ్యపు సరిహద్దులు అని అనుకుంటే పొరబాటే, బాపును ప్రత్యక్షంగా ఎవరైనా ఎరిగి ఉండకపోవచ్చేమో కానీ బాపు బొమ్మను చూడని కళ్లు, బహుశా ఉండకపోవచ్చు. కారణం మనం నిత్యం వివిధ కార్యాల నిమిత్తం ప్రయాణించే ఆర్టీసీ బస్లో సాధారణంగా ముందరి సీట్లలో కూర్చునేందుకు ప్రయత్నించినపుడు “కాదు ఇవి స్త్రీలవి అని చెప్తుంది అక్కడ వయ్యారపు గీతల్లో వున్న బాపు బొమ్మ. అంతలా అల్లుకుపోయిన బాపు గీత, అతని చేతిరాతలే కాదు వయ్యారపు వలపు వ్యంగ్య గీతలలో కూడా ప్రేక్షకులను చక్కిలిగింతలు పెట్టించారు. తొలి వ్యంగ్య చిత్రకారుడు తలిశెట్టి ప్రారంభించిన ఈ వ్యంగ్య చిత్రకళాప్రక్రియకు తన పొదుపైన రేఖలు, ప్రాణమిత్రుడు రమణతో కలిసి చేసిన వయ్యారపు వ్యాఖ్యలు వెరసి కార్టూన్ కళకు పరిపూర్ణత తీసుకువచ్చాయి.

విరాళం అన్న కార్టూన్లో టౌన్ హాలు నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న వ్యక్తికి విరాళంగా వచ్చిన ఇటుకలను చూపిస్తూ విరాళం ఇమ్మంటే ఏమిచ్చాడో చూడు ఆ పెద్ద మనిషి అని వ్యక్తి అంటే రెండో వ్యక్తి “గోల్దేమో గోకి చూడు” అన్న డైలాగ్ లోని పంచ్ అద్భుతంగా వుండి ప్రేక్షకుడిలో పొరలు పొరలుగా నవ్వు రప్పిస్తుంది. మరొక కార్టూన్ లో.
బొండాంలా మారిన భార్యకు మెరుపు తీగలా చలాకీగా ఉన్న ఒకప్పటి తన ప్రియుడు తారసపడితే తన ప్రక్కనే వున్న బియ్యంబస్తాలాంటి తన భర్తకు గర్వంగా అతన్ని పరిచయం చేసే ప్రయత్నంలో “పొట్ట లోనికి లాక్కుచావండి” అన్న భార్య ఆజ్ఞను ఆ బొండాం భర్త అమలు పరిస్తే ఏమౌతుంది? అంతవరకూ అతని పొట్టను టైట్గా పట్టి వున్న ప్యాంట్ కాస్తా ఊడి క్రిందపడిపోదూ! అదుగో చంద్రం” అన్న ఈ కార్టూన్ చూస్తే ఎవరైనా నవ్వకుండా ఉండగలరా? అయితే పండక్కి మైసూరెడుతున్నాం. కనుక ఇక్కడికి రావద్దని కార్డు రాసిన కోడలు పిల్లకి తన భర్తతో కలిసి వెళ్తున్న రైలుబండికి ఎదురుగా వచ్చే మరో రైలులోనే తన ముసలి అత్తమామలు కనిపించినపుడు గానీ తాను రాసిన పోస్ట్ కార్డ్ ని పోస్ట్ చేయడం మరిచాననే విషయం గుర్తుకు వస్తే అక్కడ ఆ కోడలు పిల్లలోని గాబరా, గందరగోళం, ఇటు అత్తమామల్లోని ఆందోళనలు చూస్తే ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. హైద్రాబాద్- బెంగుళూర్ కార్టూన్లో..

దాదాపు 12 ఏళ్ళ వయసులోనే అనగా 1945లోనే ప్రారంభించిన తన కళాయానంలో నేటి వరకూ ఎన్నో వేల వ్యంగ్య చిత్రాలను ఆయన సృజించారు. బాపు గారు తన జీవిత కాలంలో సుమారు లక్ష కు పైగా బొమ్మలు గీసారు. ఇవన్ని కూడా విజయవాడకు చెందిన గంధం ప్రసాద్ గారు డిజిటలైజ్ చేసారు. ఈ సుదీర్ఘ కళాప్రయాణంలో అతని రేఖా విధానంలో ఎన్నో మార్పులను మనం గమనించగలం. మొదట్లో చాలా సాదాసీదాగా ఉన్న అతని రేఖలు, కాలక్రమంలో పరిపక్వత సంతరించుకున్న అతని కుంచె నాజూకైన సన్నటి గీతలను ఒకసారి సృజిస్తే, మరోసారి బొద్దుగీతలు ఇంకోసారి లావు సన్నటి గీతల సమ్మేళనం. ఇలా పయనించి ప్రస్తుతం కార్టూన్లో ఇంచుమించు సన్నటి గీతలు, పల్చటి రంగులతో ఆయన వేస్తున్నారు. బ్రష్ లేదా పెన్ ఎన్నో రకాలుగా, ఎలా వాడినా కార్టూన్, ఇలస్ట్రేషన్ రెండింటినీ ఒకే గాటిన కట్టకుండా రెండింటికీ ప్రక్కా బేధం చూపిస్తూ ఇటు గీత, అటు రాత రెండింటా భావవ్యక్తీకరణను అత్యున్నత స్థాయిలో చెప్ప గల మహా చిత్రకారుడు ఈ రెండక్షరాల బాపు.

సినిమా కార్టూన్లో శుభం కార్డిని సైతం ‘భశుం” అని వేసి ప్రేక్షకులని గగ్గోలు పెట్టించిన బాపూ… సరిలేరు వేరెవ్వరూ నీకు.
అన్నింటా టాపైన ఓ బాపూ, అందుకో మా హాట్సాప్.!

– వెంటపల్లి సత్యనారాయణ,  9491378313

9 thoughts on “కొంటె బొమ్మల బాపు

    1. ధన్యవాదములు కన్నాజీ రావు గారు

  1. మీరన్నట్టు బాపు గారి గురించి ఎంత చెప్పినా, విన్నా ‘బాపురే!!’అని అనిపిస్తుంది. అన్ని వేల కార్టూన్లు, లక్షల చిత్రాలు, 50 వరకు సినిమాలలో ఇవీ గొప్పవి అని ఎంచడం ఎవరితరం? క్లుప్తంగానైనా చక్కగా చెప్పారు. అభినందనలు.

  2. చాలా చక్కగా రాసారు వెంటపల్లి సత్యనారాయణ గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap