సంతకం అక్కరలేని చిత్రబ్రహ్మ

(డిశంబర్ 15 బాపు జన్మదిన సందర్భంగా … బాపు గురించి వారి ప్రియమిత్రులు ముళ్ళపూడి వారి మాటల్లో …. చదవండి…)

బాపు అంటే పని. రోజుకి ఇరవైగంటల పని లొంగని గుర్రాల మీద సవారికి కని, పట్టుదల. బాపూ అంటే సంగీతం. సాలూరి రాజేశ్వరరావు, బడే గులాం అలీ, మొహిదీహసన్, సజ్జాద్, పీజీ వుడవుస్, నవ్వుల మార్కు మార్క్సు, లారెల్ అండ్ హార్డీ. నవ్వడం, నవ్వుకోవడం, నవ్వించడం – మెడ్రాస్ నుంచి హైదరాబాద్ కి రాత్రికి రాత్రి కారు తోలుకు వెళ్ళిపోవడం – కారు నిండా ఫ్రెండ్సుని – ప్యాక్ చేసుకుపోవడం – మళ్లీ బొమ్మలు వేసుకోడం. .

బాపు కళాతపస్వి కాడు. అంటే గడ్డాలూ విగ్గులూ పెంచేసి, గుహల్లోకి దూరిపోడు. తెల్లారగట్ల నాలుగ్గంటలకి లేచి ఓ రెండు గంటలు బొమ్మలు వేస్తాడు. తరువాత సరదాగా రెండు గంటల సేపు బొమ్మలు వేసుకోడం. ఆ తర్వాత ఇంకో గంటన్నర బొమ్మల ప్రాక్టీసు. అలసిపోతాడు గదా. అందుకని – ఓ రెండుగంటల సేపు హాయిగా బొమ్మలు గీయడం. అదయ్యాక తనకిష్టమైన కథలకి బొమ్మలు వేయడం. ఆ తర్వాత … ఇదీ వరస.
ఈ లోపల వచ్చేపోయే ఫ్రెండ్స్ తో జోకులు చెప్పుకోవడం. వాళ్లకి గ్రీటింగ్ కార్డులు వేసి పెట్టడం. వాళ్ల కథలకి బొమ్మలు వేసిపెట్టడం – వాళ్లని నించోమనీ, కూచోమనీ, చెయ్యాలా పెట్టమనీ, చెయ్యిలా పెట్టమనీ, రకరకల భంగిమల్లో రేఖాచిత్రాలు వేసుకోడం.

ఈ కార్యక్రమం అంతటికి గ్యాప్ లేకుండా నేపథ్యంలో పాటలు వస్తూనే వుంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కర్ణాటక, హిందూస్తానీ – బాపు ఎన్నో అద్భుత ప్రయోగాలు చేసి, అక్షరాలతో బొమ్మలు కట్టాడు. బొమ్మలతో భాష పలికించాడు. అత్తా ఒకింటి కోడలే, మూగమనుసులు, కులగోత్రాలు, రక్తసంబంధం వంటి చిత్రాలతో ఆరంభించి సినిమా పబ్లిసిటీలో ఎన్నో అద్భుతాలు చేసి సరికొత్త బాటలు వేశాడు. ఫోర్డు ఫౌండేషన్ తరపున ఫొటోగ్రాఫరుగా ఉత్తర భారతం అంతా పర్యాటించి, కొన్ని వేల ఫొటోలు తీశాడు.

Bapu bommaayilu

బాపూ జర్నలిస్టు కూడా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశాడు.
బాపూ జర్నలిస్టే కాదు. కార్టూన్లకి రాసే వ్యాఖ్యలలో అతని పలుకుబడి, చురుకుదనం కనబడుతుంటాయి.

కథలు, హరికథలు
అసలు నా పేరిట ప్రభలో అచ్చయిన మొట్టమొదటి రెండు కథలు బాపు రాసినవే. అప్పటిదాకా నేను కథలు రాస్తానని హరికథలు చెబుతుండేవాణ్ణి. బాపు ఆ రెండు కథలు వ్రాసి, బొమ్మలు వేసి నాకిస్తే, ప్రభ ఆఫీసుకు వెళ్లి నా కథలు అచ్చువేస్తే, బాపుబొమ్మలు ఊరికే తెచ్చిస్తా”నని బేరం పెడితే – విశ్వంగారు నవ్వుకుని వేశారు. డబ్బులు కూడా ఇచ్చారు. కథకుడిగా పేరు అచ్చయింది కాబట్టి – ఇకనైనా రాయకపోతే బాగుండదని సొంత పెన్నుతో కంటిన్యూ చేసి, నేనూ నిజంగా కథలు రాయడం ఆరంభించాను. బాపు బొమ్మలు వేసి పెట్టి, నా బ్రహ్మరాతని ఫెయిర్ కాపీ చేసి పెట్టేవారు. నేను పడుకుని నిద్ర పోతూంటే, తిట్టి సాధించి, సతాయించి అప్పులిచ్చి రాయించాడు. అదీ కథ.

ఇలా తన పదిహేనవ ఏట నుంచి బాపు నేర్చుకుంటూనే ఉన్నాడు. ” నేను ఆర్టుస్కూల్ కి వెళ్లలేదు. సక్రమమయిన ట్రెయినింగు లేదు. అది అడుగడుగునా నా చేతకాని తనాన్ని వెక్కిరిస్తూనే వుంటుంది” అంటాడిప్పడికీ నిజమే. బాపుకి ఫలానా అంటూ ఒక గురువూ లేడు. ఒక స్కూలూ లేదు. మంచి రచయితలకు మంచి పుస్తకాల్లాగే లోకంలో మంచి బొమ్మలు వేసిన, వేస్తున్న వాళ్లందరూ అతనికి గురువులే. ఒక గురువు, ఒక స్కూలు లేకపోడం తనకి ఆ చదువురాదన్న బాధ, ఒక రకంగా కసిని పెంచింది. సాధన మీద మనసు నిలిపింది.

Illustration for Vamsee story

లక్ష చిత్రపూజ
పెద్ద వాళ్లు చెప్పారు కాబట్టి, బి.కామ్. బి.ఎల్. పాసై హైకోర్టులో లాయరై సంతకం పెట్టినా నల్లకోటుతో ఓ ఫోటో కూడా దిగకుండా ఇంటికొచ్చి బొమ్మల భాగోతంలో పడిపోయాడు. ఇలా తన పదహేనో ఏట నుంచి దాదాపు 35 ఏళ్ళుగా వేసిన చిత్రాలు దాదాపు లక్షాపాతిక వేలుంటాయి. అంటే కళాసరస్వతికి లక్ష చిత్రపూజ చేసిన ధన్యుడు. చాలా మంది తనది అనే శైలి ఏర్పరచుకుని, దాని మీద ప్రభుత్వం గడించి అదే నిలుపుకుంటారు. బాపువి అనేక రకరకాల శైలులు. కాని అన్నీ కలిపి బాపుదే, ‘బాపురే’ అనిపించే శైలి.

పేరు రాయకపోయినా బాపుదే అని చాటి చెప్పే ప్రత్యేకత. అతను కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. కవరు పేజీలు వేశాడు. కార్టూన్లు వేలకు వేలు వేశాడు. బొమ్మల కథలు వేశాడు. వందలకొద్దీ గ్రీటింగ్ కార్డ్స్ వేశాడు. వేలాది బొమ్మలు గీశాడు. దేవుళ్లకి రూపకల్పన చేశాడు. సీతారాములను, ఆంజనేయ స్వామినీ, అనన్యసాధ్యం అనిపించేటంత గొప్పగా అనేకసార్లు వేసాడు.

అతని సీతాకళ్యాణ ఘట్టం తెలుగు నాట తమిళనాడులోనూ ఎన్నో పెళ్ళిళ్లకి శుభలేఖ మీద ముఖచిత్రంమై అలరించింది.

Story illustration

వాఖ్యా సహిత చిత్రాలు
అలాగే గాలిబ్ గీతాలు, జనార్దనాష్టకం, ప్రాచీన గాధాలహరి, భారత రామాయణ, భాగవత పురాణ పురుషులు, ప్రబంధాలు, కాశీ మజిలీలు, అన్నమాచార్య, గీతాంజలి, మహాప్రస్థానం, త్రిపురనేని రామస్వామి వంటి ప్రముఖ నాస్తికవాదుల పుస్తకాలకు ఎన్నో చేశాడు. ఆ గ్రంధాల ఔన్నత్యానికి ధీటైన రీతిలో, ఆ రచయితల హృదయ భావాన్ని ప్రతిబింబించి, వాటిపై పాఠకుడుగా, చిత్రకారుడుగా తన వ్యాఖ్యకూడా స్ఫురించే శిల్పవైభవం చూపించాడు.
ఒకసారి తెలుగేమీ తెలియని ఓ ఉర్దుకవి గాలిబ్ గీతాలకు బాపు వేసిన బొమ్మలను చూసి, ఆ బొమ్మలను బట్టి ఆయా గీతాలను గుర్తుపట్టి చెప్పాడట. తెలుగులో మహా రచయితలయిన తాపీ ధర్మారావు, చిలకమర్తి, గురజాడ, విశ్వనాథ, చలం, శ్రీశ్రీ, మల్లాది, కందుకూరి, నండూరి, రావిశాస్త్రి, ముప్పాళ్ల, యద్దనపూడి వంటి గొప్ప రచయితలందరి పుస్తకాలకు బొమ్మలు వేసిన ఘనత బాపూదే.

పాత్రల రూపకల్పన
“తెలుగు వెలుగులు” శీర్షికలో అతను తీర్చిదిద్దిన రేఖా చిత్రాలు – ఛాయా చిత్రాలకు మించి ఆయా మహా పురుషుల ప్రతిభను, వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేశాయి. అలాగే అతను రూపకల్పన చేసిన ప్రసిద్ధ పాత్రలు బారిష్టరు పార్వతీశం, గిరీశం, గణపతి, పదహారణాల తెలుగు ఆడపడుచు అనిపించుకున్న “బాపు బొమ్మ” ఉరఫ్ బామ్మ, రెండుజెళ్ల సీత, బుడుగు, లావుపాటి పిన్నిగారూ, గయ్యాలి భార్య, ఆవిడలో సగం ఉండే మధ్యతరగతి మహారాజు, పాఠకుల మనసులో స్థిరముద్ర వేసుకున్నాయి. చిత్రలేఖనంతో సరిపెట్టక, కమర్షియల్ ఆర్డులో కూడా చాలా కృషి చేసి సాధించాడు. జై. వాల్టర్ థామ్సన్, ఎఫిషెంట్ పబ్లిసిటీస్, ఎఫ్.డి. స్టీవర్ల్ వగైరా సంస్థల ఆర్టిస్టుగా, ఆర్ట్ డైరెక్టరుగా వ్యాపార ప్రకటనలకెన్నిటికో డిజైన్ చేశాడు. క్యాలెండర్లు, పేక దస్తాలు, కార్డు బోర్డు బాక్సులు చేశాడు. టైపోగ్రఫీలో శ్రద్ధ తీసుకుని, అక్షరాలతో ఆటలాడుకున్నాడు.

తెరబొమ్మలు
1967లో సాక్షి సినిమా తీశాడు. బాపు సినిమాలో కూడా అతనికి గురువులెవరూ లేరు. ఏనాడు సరిగ్గా షూటింగ్ చూసెరగడు. లోకంలో మంచి సినిమాలు తీసిన, తీస్తున్న వారంతా గురువులే, గొప్ప సినిమాలన్నీ పాఠ్య గ్రంధాలే, ఇవికాక బాపు చూపు కామన్ సైన్స్! నవయుగ ఫిలింస్ అధిపతి శ్రీ శ్రీనివాసరావుగారు వేరే అర్హతలు లేనందుకు ఇవే ఉన్నందుకు ముచ్చటపడి సాక్షి తియ్యడానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఆ విధంగా ఆనాడు బొమ్మలు వెయ్యడానికి రేడియో అన్నయ్య రాఘవగారు గురువైతే, బొమ్మలు తియ్యడానికి వాసుగారూ అంతటివారయ్యారు. బాపు పాతిక సినిమాలు తీశాడు. మంచివి, చెడ్డవి, పరవాలేదులే’ వి, గొప్పవి. తెలుగువి, తమిళ, హిందీవి.
ఒకప్పుడు బొమ్మలు వెయ్యడానికి పద్దెనిమిది గంటలు పనిచేస్తే, ఇప్పుడు తెల్లారగట్ల. రెండు గంటలు బొమ్మలు వేసి అవసరాన్ని బట్టి పదహారు గంటలు సినిమా పని చేస్తాడు. ఎడిటింగు, డబ్బింగు, రీ రికార్డింగు, మిక్సింగు వంటివి తనే చేసుకుంటాడు.

బాపు లైబ్రరీ ఒక చిన్న ప్రపంచం. అందులో చిత్రకళ, చలనచిత్ర కళ గురించి ఎన్నో పుస్తకాలున్నాయి. అతను సంపాదించే ప్రతి రూపాయిలో సగం భాగం, ఈ లైబ్రరీకే వెళ్ళిపోతుంది. అతని లైబ్రరీ ఖరీదు రెండు లక్షలు. కానీ.. దాని విలువ కోటానుకోట్లు. అతను సుఖాలు కోరడు. ఇచ్చినా భరించడు. ఎప్పుడూ చిన్న కార్పెట్ వేసుకుని, కింద మఠం వేసుకు కూచుని పనిచేస్తాడు. అతని లగ్జరీ సంగీతం, జోక్సూనూ, తన మీద తనే జోక్ వేసుకోగల ఆరోగ్యం అతనికి పుష్కలంగా ఉంది.

బాపు అంటే వుడ హౌస్, ఖాన్ సాహెబ్, త్యాగరాజస్వామి, మొహ్లిహసన్, సాలూరి రాజేశ్వరరావు, కె.వి. మహదేవన్, వుహళేంది, ఎం.ఎస్. విశ్వనాధన్, ఇళయరాజా, నవ్వు మార్కు మార్క్సు బ్రదర్స్, చాప్లిన్, లారెల్, రమణ, స్నేహం-సరదా హాయి బొమ్మలు చూడటం, బొమ్మలు తియ్యడం, వెయ్యడం, నేర్చుకోవడం… నేర్చుకోవడం… నేర్చుకోవడం…!!

ముళ్లపూడి వెంకటరమణ

Bapu portraits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap