చిత్ర ‘చంద్ర’ జాలం

తెలుగు పాఠకులకు కథా చిత్రాలతో, కార్టూన్లతో రంజింపచేసిన ప్రముఖ చిత్రకారుడు బాపు ఏకలవ్య శిష్యులు ఎందరో. ఆ శిష్యులలో పలువురు బాపు లైన్ మాత్రమే పట్టగలిగి, భావం మిస్ అయ్యారు. కాని బాపు లైన్ నేగాక ఆయనలాగా రచయిత మనోభావాన్ని చిత్రాలలోకి తీసుకురావటమేకాక, ఆ భావాన్ని అధిగమించి చిత్రీకరించటంలో చేయి తిరిగిన చిత్రకారుడుగా నిలబడినవాడు చంద్ర.

చంద్రపూర్తి పేరు మైదం చంద్రశేఖర్. చిత్రకారుడిగా చంద్ర. కథారచయితగా తొలి రోజుల్లో చంద్రశేఖర్, ఆ తర్వాత కళాదర్శకుడిగా, బుల్లితెర సీరియల్స్ కి దర్శకుడిగా చంద్ర పేరునే స్థిరపరచుకున్నాడు. చంద్ర తొలి కార్టూన్ 1959లో ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. 1961లో తొలి కథ ‘నా సూటుకేసు’ అనేది ఆంధ్రప్రభలో వెలువడింది.
ఆ పైన మరో మూడేళ్ళకు ‘గడ్డి పూలు’ పుస్తకానికి బొమ్మలు గీశాడు. బాపు గీసిన ప్రతి కళాఖండాన్ని తిరిగి తనదైన ధోరణిలో, శైలిలో గీయటం చేశాడు చంద్ర. తొలిదశలో పూర్తిగా బాపు ప్రభావంలో ఉన్న ఆయన క్రమంగా తనకంటూ ఒక స్టైల్ ని తయారు చేసుకున్నాడు చంద్ర. ఆయనది వరంగల్లు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినవాడు.
1946 ఆగష్టు 25న పుట్టిన చంద్రశేఖర్ ఆర్టిస్ట్ చంద్రగా స్వయంకృషితో ఎదిగినవాడు. చిన్నతనం నుండి కనిపించిన విషయాన్ని చిత్రీకరిస్తూ, మానవ రూపురేఖలను, అందునా ఆడవారి రూపురేఖలను అద్భుతంగా మెలికలు తిప్పి గీయగలిగాడు.

బాపు బొమ్మకు ప్రత్యామ్నాయ బొమ్మ చంద్ర పాళీ పండించేది. అతనిలోని చిత్రకళా తృష్ణ పి.యు.సి.తో చదువు ఆపించి, ఫైన్ ఆర్ట్స్ కోసం హైదరాబాద్ చేరేలా చేసింది. చంద్ర ఆరేడు తరగతుల దశలోనే శంకర్స్ వీక్లీ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు.
హైదరాబాద్ నగర జీవితం చంద్రలోని చిత్రకారుడిని వికసింపచేసింది. నాటికి పత్రికారంగం హైదరాబాద్ చేరలేదు. పత్రికా ప్రచురణకి, పుస్తకాలు ప్రచురించే సంస్థలకు నిలయంగా విజయవాడ ఉండేది. తనలోని చిత్రకారుడికి అవకాశాలు వెతు క్కుంటూ విజయవాడ వచ్చేవాడు చంద్ర.

చంద్ర స్నేహశీలి. ఒకసారి పరిచయమయితే అతన్ని మరచిపోవటం కష్టం. నవ్వు ముఖంతో కనిపించేవాడు. కుంచె పట్టినప్పుడే ముఖంలో ‘సీరియస్ నెస్’ వచ్చేదేమో. నారాయణగూడ అనేది ఆనాటి రచయితలు, నటులు, కళాకారులకు నిలయమైన ప్రాంతం. అక్కడ మకాం ఉండి దాశరథి, బిరుద రాజు రామరాజువంటివారి ఛాయలో ఎదిగాడు.
ఇరానీ కేఫ్ కేంద్రంగా కబుర్లు చెపుతూ, తన చిత్రాలకు తగిన మోడల్స్ ని సామాన్యులలో నుండి వెతుక్కునేవాడు. తెలుగు పత్రికారంగంలో సంచలనమైన స్వాతి మాసపత్రిక 1970లో హైదరాబాద్లో ప్రారంభమయినపుడు ‘స్వాతి’ అనే అక్షరాల రూప కల్పన ప్రాథమికంగా చేసినవాడు చంద్ర. మాస పత్రికలో ఎన్నో కథలకు ఇల్ల(స్టేషన్స్ గీశాడు.

స్వాతికోసం ప్రత్యేకంగా కథలు రాశాడు. ఇక మాస పత్రికలో చంద్ర కార్టూన్స్ అనేకం. అలా చంద్ర అందించిన బొమ్మలు, పెయింటింగ్లు, గ్రీటింగ్ కార్డులు కోకొల్లలు. వామపక్ష భావజాలం గల చంద్ర ఆ భావజాల పత్రికలైన విరసం, భూమిక, కథాసాహితిలకు లోగోలను అందించాడు.

యువ, జ్యోతి, రచనవంటి పలు పత్రికల్లో కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా పనిచేశారు. బహుశా చంద్ర చేత బొమ్మ గీయించుకోని పత్రికలుగాని, చంద్ర తన పుస్తకానికి కవర్ పేజీ గీస్తే బాగుండు అని కోరుకోని రచయితలుగాని తెలుగునాట లేరు.
ఉద్యోగరీత్యా కొంతకాలం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేశాడు. అయినా చంద్రది స్వతంత్రంగా ఉండే మనస్థత్వం. ఏ ఒక్క సంస్థకు అంటిపెట్టుకోలేదు. ఏ ఒక్కరికింద ఎక్కువ కాలం ఉండలేదు. చంద్రలోని రచయిత చక్కని కథలను అందించి బహుమతులు గెలుచుకున్నాడు.

ఆయన కథ బడ్జట్ యూత్ టైమ్స్ జాతీయ అవార్డును గెలుచుకుంది. చంద్ర సినీ, టి.వి. రంగాలలో కూడా పనిచేసి గుర్తింపుపొందిన కళాకారుడు. కొన్ని సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా, కొన్ని సినిమాలలో నటుడిగా ఉన్నాడు. సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గాను పనిచేశాడు. ఇంద్రధనస్సు, వెన్నెల వేట అనేవి చంద్ర దర్శకత్వంలో వచ్చిన టీవీ ధారావాహికలు. డాక్యుమెంటరీలు రెండు చంద్ర నిర్మించి మెప్పు పొందాడు. చంద్ర దృష్టిలో ఒక మంచి చిత్రం పడినా, ఆయన చదివిన ఒక కథ మనస్సుకు హత్తుకున్నా దానిగురించి నలుగురికి చెప్పేవాడు. చూడండి, చదవండి అంటూ ప్రోత్సహించేవాడు.

టాలెంట్ కి తగిన గుర్తింపు పాఠకులు, నాటి కళాకారులే ఇవ్వాలన్నది ఆయన మాట. చంద్రనేత్రం చాలా సునిశితమయినది. ప్రకృతిలో కనిపించే చెట్ల కొమ్మలు, రాళ్ళు సేకరించి వాటి రూపాలను కొత్త రకంగా తన ఇంటిలో పెట్టివుంచేవాడు. అటువంటి కన్ను అందరికీ ఉండదంటారు మిత్రులు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలినుండి కళారత్న అవార్డ్ ని, ప్రభుత్వం నుండి ‘హంస’ అవార్డును అందుకున్నాడు చంద్ర.

2016లో ఆయన 70వ పుట్టినరోజును హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించినపుడు అక్కడ చేరిన మిత్రులు, అభిమానుల సంఖ్యను బట్టి చంద్ర పాపులారిటీ ఎటువంటిదో అర్థంచేసుకోవచ్చు.
నాడు విడుదల చేసిన ‘చంద్రవంక’ అభినందన సంచిక చంద్ర వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది. కోవిడ్ వల్ల ఎందరో ప్రముఖులు కన్నుమూశారు. ఆ జాబితాలో చంద్ర చేరాడు.నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్సలో ఉన్న చంద్ర గుండె ఆగిపోయింది. ఒక గొప్ప చిత్రకారుడిని తెలుగువారు కోల్పోయారు.
చంద్ర ఆత్మశాంతికి చేతులు జోడించి ‘స్వాతి’ ప్రార్థిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap