
గతంలో ‘రామారావు నుంచి రామారావు దాకా’-(2009) అన్న గ్రంథాన్ని రచించిన మాకినీడి సూర్య భాస్కర్ ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకన్నట్లు దామెర్ల రామారావు కళా ప్రస్థానంతో మొదలుపెట్టి, యస్వీ రామారావు కళా ప్రస్థానం వరకు అన్న భావనతో ఆ గ్రంథాన్ని తీసుకురావటం జరిగింది. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలలో పేరెన్నికగన్న ఎందరో ఉద్దండులైన కళాకారుల కృషి, సాధన, విజయాలను చక్కగా సేకరించి గ్రంథస్తం చేయటం జరిగింది. అంతటితో తృప్తి చెందక, దామెర్లపై ఒక పూర్తి పరిశోధనతో కూడిన గ్రంథాన్ని ‘దామెర్ల కళ – వారసత్వం’ అన్న పేర (2019) ముద్రించారు. మరి ఇప్పుడు కవిత్వాన్ని ద్వైతం నుంచి అద్వైతం వేపు ప్రయాణం చేయించిన… చిత్రకళను ప్రాక్పశ్చిమ సంగమం కావించిన యస్వీ రామారావు గురించి రాయకుండా ఊరుకుంటారా! మన తెలుగు వాడైన పద్మశ్రీ డా. యస్వీ రామారావుపై లోతైన అధ్యయనంతో తీసుకువచ్చినదే ఈ పుస్తకం!!
‘ఆలోలాంతరాళాలలో…’ అన్న కవితాసంపుటిలో “అందరికీ దూరం చేస్తున్నాయి – నా చిత్రాలు” అన్న శీర్షికన వ్రాసుకున్న భావనలు జీవితాన్ని ఫణంగాపెట్టి వ్రాసుకున్న గీతలు, వ్రాతలు నన్ను అందరికి దూరం చేస్తున్నాయి అంటారు కవి యస్వీ. కాని, ఈ పుస్తకం ద్వారా మనకు అర్థమయ్యేదేమంటే అందరికీ దూరంగా ప్రత్యేక స్థానంలో యస్వీని తన రాతలు, గీతలు నిలబెట్టాయని; ఎదిగేలా చేసాయని స్పష్టంగా తెలుస్తుంది.
కవిత్వం-చిత్రలేఖనంలో, చిత్రలేఖనం-కవిత్వంలో మమేకమై యశస్సు గాంచేందుకు యస్వీ రామారావు చేసిన కృషిలోని విశేషాలను వివరించిన ఈ గ్రంథానికి యస్వీ రామారావు పేరులోని ‘యస్వీ’ని ‘యశస్వి’ గా భావస్ఫోరకంగా ఈ పుస్తక నామధేయంలో పొదిగారు రచయిత మాకినీడి.
‘చిరుగ్రంథ కానుక-మరుగంద మాలిక’అన్న పేర సమకాలీన కళ, సాహిత్య మిత్రులను సమగ్రంగా మనకు పరిచయం చేసే క్రమంలో ఇప్పటి వరకు మాకినీడి రచించిన 12 పుస్తకాలను ఆయా వ్యక్తులు ఆయారంగాలలో చేసిన కృషికి కానుకగా సమర్పించారు. ఆ పరంపరలోంచి వచ్చిన ఈ 13వ గ్రంథమే ‘రామారావు కవిత్వంలో చిత్రకారుడు యస్వీ… యశస్వి!’. 12 శీర్షికలతో ఈ పుస్తకాన్ని అన్నీ తానై (ముఖపత్ర అలంకరణ, డి.టి.పి, పేజీలకూర్పు) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు రచయిత మాకినీడి.
ప్రపంచవ్యాప్తంగా ఎరిగిన యస్వీ లోని ప్రతిభను కవిచిత్రకారుడిగా తెలుగు వారికి ఎరుకపరిచేందుకు విస్తృత రచన చేసారు మాకినీడి. యస్వీ రామారావు కీర్తికి పట్టం కట్టేలా ఈ గ్రంథం అమరింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
యస్వీ రామారావు తన ముందు మాటను శీర్షిక, చేవ్రాలు లేకుండనే సమర్పించగా, ప్రకాశకులు వారి ప్రత్యేక విన్నపం మేరకు అలానే ప్రచురించడం జరిగింది. ఇది తొలుత చూసినప్పుడు విపరీతమని తోచినా, చదివిన తరువాత సబబు, సొబగుగా తోచింది. తన అమూర్త చిత్రణాశైలిని తలపించేలానే తన రచనా శైలి కూడా!
రచయిత మాకినీడి సహజ గుణమైన అవ్యాజమైన ప్రేమను తనదైన కళా హృదయం నుండి అక్షర వృష్టిని కురిపించారు ఈ రచనలో. “విశ్వవిఖ్యాతిగాంచిన, బహుముఖ ప్రజ్ఞావంతులైన విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటివారి కోవకు చెందిన వారు మాకినీడి” అని అంటూ యస్వీ రామారావు ప్రశంసించటం క్రొత్త వారికి కొంతొక వింతగాతోచవచ్చు. శతాధిక గ్రంథకర్త అయిన మాకినీడి కృషి తెలుగు(ఇంటి)వారి కంటే బయటివారికే ఎక్కవుగా తెలుసు అన్నమాటలో ఏమాత్రము అతిశయోక్తి లేదని యస్వీ రామారావు ముందు మాట స్పష్టంగా చెపుతుంది.
“తనకు అపరిచితులైన వారు, విశ్వవ్యాప్తమైన తన చిత్రకళ ప్రక్రియను సమగ్రంగా ఆకళింపు చేసుకోని వారు వ్రాయడం అసాధ్యం. కాని, మాకినీడి సహృదయ సంపన్నుడు, అక్షర రాయుడు” అంటారు యస్వీ. ఈ మాటలు మాకినీడి పరిశోధనా పటిమకు, పరిణతికి గీటు రాళ్లు.
తన అభిమానాన్ని చేతల్లో చూపిస్తూ, ఏడేడు సముద్రాల అవతలనుంచి భారతదేశం చేరి, ఎకాఎకీ కాకినాడ నిన్ను చూడటానికే వస్తున్నానంటే….. ఏం చేయాలి? సమర్థుడు కనుక ఆయన వచ్చేనాటికి ఈ పుస్తకాన్ని రచించి యస్వీ చేతుల్లో పెట్టారు మాకినీడి. ఆ తర్వాత ఆయన ముందుమాటతో రెండో ముద్రణ తెచ్చారు.
ఈ పుస్తకానికి ఆత్మ వంటి యస్వీ రామారావుని నేరుగా విదేశం నుండి స్వయంగా స్వదేశంలో ఉన్న రచయిత ఇంటికే రప్పించేలా చేసింది మాకినీడి పట్ల పెద్దాయన కున్న ప్రేమ, అభిమానం! మూతికి మాస్కులే తీయని ఆ కాలంలో, ఇంటి నుండి అడుగు బయట పెట్టని మనిషిని ఇంత దూరం ప్రయాణించేలా చేసిందంటే… ఈ సంఘటన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతటి అరుదైన సంఘటనోకదా! “తిరుగు ప్రయాణం మార్గమధ్యంలో నా హృదయ భావావేశాన్ని కాగితంపై పెడితే ముందు మాటలయ్యాయి” అంటారు యస్వీ. రామారావు.
ఆ సాయంకాలం రచయిత ఇంటనే ఈ పుస్తకం ఆవిష్కరణ, అంకితం, స్వీకృతి మహోత్సవంగా జరిగాయి. ఇంటి సభ్యులతో పాటు కాకినాడ ముఖ్య పురజనుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రచయిత మనుమరాలు చి. మోహన సాయిప్రియ ఆవిష్కరించగా, ఆ బుజ్జి బుజ్జి చేతుల మీదుగా పుస్తక కథానాయకుడు ప్రతిని స్వీకరించటం జరిగంది.
ఆధునికాంధ్ర చిత్రకళా శిఖరాగ్రం, విశ్వవిఖ్యాత కళాతేజం పద్మశ్రీ డాక్టర్ యస్వీ-యశస్వి. 23 ఏళ్ళ వయస్సుకే అంతర్జాతీయ స్థాయి యశస్సు గాంచిన రామారావు అతనిలోని మరో ప్రతిభ కవిత్వం. ఆనాటి అరకొర సౌకర్యాలతో ఐదుగురు గురువుల పథనిర్ధేశముతో అంచలంచెలుగా మార్గాలను వెదకుతూ, చిత్రకళ అధ్యయన మార్గాలను తనకు తానుగా స్వయంగా నిర్మించుకుంటూ, ఈ స్థాయికి ఎదిగిన వైనాన్ని తనదైన శైలిలో మాకినీడి సూర్య భాస్కర్ ఈ గ్రంథంలో యస్వీ కళాప్రస్థానాన్ని వివరించారు.
ప్రత్యేకమైన పాఠకుల కొరకే అన్నట్లుగా రాసిన ఈ పుస్తకం, ఇందులోని చిత్రలేఖనం, సాహిత్యపు విలువలను ఆస్వాదించ గలిగిన పాఠకుల స్థాయిని పెంచే రచన అని అనిపించుకోగలదు. యస్వీ రామారావు కవిత్వం, చిత్రలేఖనాలను సమన్వయపరుస్తూ మాకినీడి రాసిన సమీక్షా గ్రంథం. కవి చిత్రకారుడి పరిచయం, కవితా పరిశీలన- కళా విమర్శ, – పరామర్శ గ్రంథం.
యస్వీ తన చిత్రకళ వర్ణ వైచిత్యాన్ని, కవిత్వంలో ఇమిడ్చిన నైపుణ్యాన్ని మాకినీడి అన్వేషణా లాఘవం బాగా పట్టుకుంది. మాకినీడి కళా విమర్శన మచ్చుకు ఈ వ్యాఖ్యలు చూడండి…“ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతీ సమ్మేళనానికి వివేకానందుడు, పరమహంస, యోగానంద వంటివారు ఆధ్యాత్మికంగా ప్రయత్నిస్తే, దాన్నే కళాపరంగా సాధించి చూపారు యస్వీ రామారావు (కళా తాత్వ్తికుడు)” అంటారు మాకినీడి.
సమీక్షకుడు: ఆత్మకూరు రామకృష్ణ
ప్రతులకు: మాకినీడి సూర్య భాస్కర్
చరవాణి: +91 94915 04045