శ్రీమతి ఏలూరిపాటి అన్నపూర్ణ గారు, నివాసం కళ్యాణ్ నగర్, వెంగళరావు నగర్ దగ్గర, హైదరాబాద్.
చదువుపరంగా బి.యస్.సి., సి.ఎఫ్.యన్., డి.ఎఫ్.ఎ., చదివారు.
గృహిణిగా వుంటూనే చిత్ర కళాకారిణిగా రాణిస్తూ, గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుండి అంటే ఉహ తెలిసిన, పదేళ్ల వయసు నుండి బొమ్మలు గీస్తున్నారు. వాటర్ కలర్స్, ఆయిల్, ఎక్రిలిక్ వంటి అన్నిరకాల రంగులను ఉపయోగించి చిత్రాలు వేస్తారు. పెన్సిల్ డ్రాయింగ్, స్కెచెస్ కూడా గీస్తారు. “ల్యాండ్ స్కేప్ (ప్రకృతి చిత్రాలు) పేయింటింగ్స్ వేయడం అంటే అన్నపూర్ణ గారికి అమితమైన ఆనందమని అంటారు. నాన్న, అన్న దమ్ములు, అక్కా చెళ్ళెల్లు కూడా డ్రాయింగ్స్-పేయింటింగ్స్ వేసేవారు. వారిని ఆదర్శంతో, వారి మరియు భర్త ప్రోత్సాహంతోను, సహకారంతోను మంచి చిత్రకారుణిగా ఎదగటానికి దోహదపడిందని అన్నపూర్ణ గారు వివరించారు. కళారాధన ధ్యేయంగా, ఆత్మసంతృప్తి కోసమే పేయింటింగ్స్ వేస్తున్నట్లు చెప్పారు. డ్రాయింగ్ లో డిప్లోమా చేసినా, పేయింటింగ్స్ కు సంబంధించి పుస్తకాలు చదివి నేర్చుకున్నారు. అన్నపూర్ణ గారిలో ఉన్న సృజనాశక్తికి అధ్యయనం, అభ్యాసం పదును పెట్టాయి. కాన్వాస్ పై రంగులు, బ్రష్ లు పరుగులు పెట్టాయి. అంతే చివరికి గమ్యం వందల సంఖ్యలో ఫ్రేములకు చేరాయి. ఇంటిలో ఎక్కడ చూసినా కళాఖండాలే. కప్ బోర్డులలో ఫ్రేములే. సెల్ఫ్ లలో పేయింటింగ్సులే. అటకల పైనా డ్రాయింగులే.
స్పందించే హృదయముంటే, వారి ప్రతిభకు ఏ డిగ్రీలు, ఏ యూనివర్సిటీలు అక్కరలేదని నిరూపిస్తున్నాయి అన్నపూర్ణ గారి చిత్రాలు. వీరి కళ జీవితం పై ప్రభావం చూపింది స్త్రీ అంతరంగం. గాసిప్, ది లాస్ట్ పేజ్, ఓల్డ్ వుమెన్, విలేజ్ బెల్స్, లంబాడా విత్ ఎ చైల్డ్ చిత్రలలో కనిపిస్తాయి. స్త్రీ హృదయాన్ని స్త్రీలే లోతుగా పరిశీలించగలరని అనడానికి తార్కాణం వీరి చిత్రాలు. బ్లాక్ పెన్ తో గీసిన అన్నపూర్ణ గారి కుమార్తె చిత్రం “మై డాటర్” ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని అంటారు. నేనొక కళాకారిణిగా, మాతృహృదయాన్ని జోడించి వేసిన చిత్రమదని చెప్పారు. వీరు వేసే పేయింటింగ్స్ వేటికవే భిన్నంగా వున్నాయి.
యాభైకు పైగానే గ్రూప్ ప్రదర్శనలలోను, అయిదు సార్లు సోలోగాను, ఊశా లో మూడుసార్లు ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. ఎన్నో సంస్థలు నుండి అనేక అవార్డులు అందుకున్నారు. ఎన్నో చిత్రకళా శిభిరాల్లో పాల్గొన్నారు. ఎనభై పేయింటింగ్ లు అమ్ముడుపోయానని తెలిపారు. అయినా చిత్రకళను వృత్తిగా కాకుండా అభిరుచిగానే రాణించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అన్నపూర్ణ గారి పేయింటింగ్స్ కొన్ని “మిసిమి” మాసపత్రికలో ప్రింట్ అయ్యాయి. ఇది వీరి చిత్రకళా ప్రతిభకు తార్కాణం.
సహజత్వం ఉట్టిపడే రీతిలో కళాహృదయాలను ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంటాయి అన్నపూర్ణ గారి చిత్రాలు. వీరి చిత్రాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పల్లెవాసుల వేషధారణ, గ్రామీణ జీవన నేపథ్యం తదితర అంశాలతో సహజ సిద్ధమైన వర్ణమేళవింపులతో స్పష్ఠంగా గోచరిస్తాయి. కళాభిమానులను రంజింప చేస్తాయి.
చివరిగా “ప్రతి కళాకారుడు తనేంటో నిరూపించుకునే విధంగా రాణించాలని, జరిగే ప్రతీ విషయాన్ని అనుభవంగా తలచి, ముందుకెళ్లాలి. వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు” శ్రీమతి ఏలూరిపాటి అన్నపూర్ణ గారు.
డా. దార్ల నాగేశ్వర రావు
Very nice sir
Nice article. Congrats to అన్నపూర్ణ గారూ and నాగేశ్వరరావుగారు.