శ్రీమతి అనురాధ గాడ్గిల్ గారు, నివాసం హిమాయత్ నగర్, హైదరాబాద్.
చదువు పరంగా, బి.కాం. గ్రాడ్యుయేషన్, మరియు కంప్యూటర్ సైన్స్ లో పి.జి. డిప్లోమా చేసారు.
“స్త్రీల పట్ల వివక్ష కనబరిచే మన కుటుంబ వ్యవస్థ వాళ్ల అభిరుచుల్ని, ఆశయాలను అంతగా పట్టించుకోకుండా, రకరకాల ఆంక్షలతో చిన్న చిన్న ఆశల్ని సైతం నెరవేరనివ్వదు. ప్రత్యేకించి వివాహ జీవితం ద్వారా గృహిణిపై మోపబడిన బాధ్యతల వల్ల చాలామటుకు అభిరుచులు ఆదిలోనే వాడిపోయేందుకు కారణమవుతుంటాయి. అరుదుగా ఏ కొద్దిమందిలోనే కుటుంబ అండదండలతో వికసిస్తాయి. జీవితానికి, కుటుంబ వ్యవస్థకు ఓ అర్థాన్ని, గుర్తింపునూ తెచ్చిపెడతారు”.
కాని అనురాధ గారికి భర్త, పిల్లలు సహాయ-సహకారాలు పూర్తిగా అందించడం వల్ల, “ఈరోజు నేనూ ఓ ఆర్టిస్టుగా రాణించకలుగుతున్నానని” సంతోషాన్ని వివరించారు.
ఆయిల్ పేయింటింగ్స్, అక్రిలిక్ పేయింటింగ్స్, ఫాబ్రిక్ పేయింటింగ్స్, గ్లాస్ పేయింటింగ్స్, సాండ్ పేయింటింగ్స్, డ్రాయింగ్, స్కెచెస్, మగ్గం వర్క్స్ (ఆరి వర్క్స్ & జర్దోసి వర్క్స్), హ్యాండ్ ఎంబ్రాయిడరీ, తంజావూర్ పేయింటింగ్స్, మరియు క్రాఫ్ట్ వర్క్స్ మొదలగునవి ప్రత్యేకంగా చేస్తుంటారు.
“అనురాధ ఫైన్ ఆర్ట్స్ ఫౌండేషన్” ఇనిస్టిట్యూట్ (అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ) ను స్థాపించి, ఫౌండర్ & జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు అనురాధ గారు.
ఈ ఇనిస్టిట్యూట్ లో అన్ని వయసుల వారికి చిత్రకళలతోపాటు పైన పేర్కొన్న వాటిలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అంతేకాదు పై పనులను ఆర్డర్ పై తీసుకొని చేసి ఇస్తుంటారు కూడా.
చిన్నప్పటి నుండి చిత్రకళల పట్ల విపరీతమైన ఆసక్తి ఎక్కువ. కంటికి ఏది కనిపించినా, ఏది నచ్చిన వాటిని వెంటనే తన శైలిలో చిత్రించడం, ఆనందించడం “అలవాటు” గా చేసుకున్నారు. ఈ అలవాటు దినదిన ప్రవర్ధమానమయ్యింది.
చిత్రకళలో మంచి నైపుణ్యం సంపాదించడానికి, అరవై సంవత్సరాలు అనుభవం కలిగిన గొప్ప కళాకారిణి, మరియు చిత్రకళ ఉపాధ్యాయురాలు శ్రీమతి అజ్ర జమాల్ గారి దగ్గర శిష్యురాలుగా చేరడం, వారి దగ్గర అయిదు సంవత్సరాలుపాటు శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఎంతో విశిష్టత కలిగిన చిత్రకళాకారిణిగా అభివృద్ధి చెందారు. అలాగే పదిమందికి చిత్రకళను నేర్పించే స్థాయికి కూడా ఎదిగారు. ఈ కళారంగంలో నేటికి 18 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించారు అనురాధ.
ఈ నేపధ్యంలో పది వర్క్ షాపులను నిర్వహించారు. ఆరు సార్లు గ్రూప్ ప్రదర్శనలనలలో పాల్గొన్నారు. అయినప్పటికి ఇంకా ఏదో సాధించాలన్న అసంతృప్తి మాత్రం ఎప్పుడూ వుంటుందని, ఎప్పటికైనా జీవితంలో-జాతీయ స్థాయిలో “ఓ మంచి ఆర్టిస్టు” గా గుర్తింపు రావాలని తన ఆశయాన్ని తెలిపారు. స్థాపించిన ఇనిస్టిట్యూట్ ద్వారా చిత్రకళలో పలువురికి శిక్షణ ఇచ్చి మంచి ఆర్టిస్టులను తయారు చేస్తున్నారు.
చివరిగా “ప్రతి మనిషికి ఏదో ఒక ధ్యేయం వుండాలి. అప్పుడే మనకు గుర్తింపు, ఫలితం తప్పక వస్తుందని” సందేశాన్నిచ్చారు శ్రీమతి అనురాధ గాడ్గిల్ గారు.
డా. దార్ల నాగేశ్వర రావు